kalvakuntla chandra sekhar rao
-
సిద్దిపేట ముస్తాబు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సీఎం హోదాలో తొలిసారి సిద్దిపేట పట్టణానికి బుధవారం వస్తున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం అంతా సిద్దిపేట పట్టణంలో మకాం వేసింది. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు మంగళవారం రోజంతా బిజీ బిజీగా పర్యటన కార్యక్రమాలను పరిశీలించారు. ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ నేత ృత్వంలో సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో హెలీప్యాడ్ స్థలాన్ని, కోమటి చెరువు వద్ద రూ. 6.8 కోట్ల వ్యయంతో పర్యాటక క్షేత్రంగా అభివ ృద్ధి చేయనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమాల పనులను, ఫిల్టర్ బెడ్ వద్ద ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర స్థాయి అధికారుల సమీక్ష సమావేశం కోసం చేస్తున్న ఏర్పాట్లను, ఎన్జీఓ భవన్, కోర్టు ఆవరణలను జేసీ శరత్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసచారిలతో కలిసి పరిశీలించారు. హెలీప్యాడ్ స్థలాన్ని పోలీసులతో పాటు బ్యాంబ్ స్క్వాడ్ బృందం, సీఎం సెక్యూటిరీ సిబ్బంది తనిఖీ చేశారు. హెలీకాఫ్టర్ మినీ స్టేడియంలో రెండు దఫాలుగా ల్యాండింగ్ చేసి చూశారు. సీఎం కార్యక్రమం ఇలా.. హైదరాబాద్ నుంచి హెలీకాఫ్టర్లో ఉదయం 11 గంటలకు నేరుగా కరీంనగర్ వెళ్లనున్న సీఎం కేసీఆర్, అక్కడి నుంచి తిరిగి మధ్యాహ్నం 1.10 గంటకు సిద్దిపేట పట్టణంలోని మినీ స్టేడియానికి హెలీకాఫ్టర్లో చేరుకుంటారు. 1.15 గంటలకు కోమటిచెరువు వద్దకు చేరుకుని పర్యాటక క్షేత్రంగా అభివ ృద్ధి చేసే కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 2 నుంచి 2.30 గంటల వరకు భోజన విరామం తీసుకుంటారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకు మంత్రులు, అధికారులతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పై సమీక్ష జరుపుతారు. 4.10 గంటలకు సిద్దిపేట ఎన్జీవో భవన్లో జరగనున్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారు. 4.25 గంటలకు కోర్టుభవన్లో నిర్వహించే న్యాయవాదుల సమావేశంలో పాల్గొంటారు. 4.45 గంటలకు హెలీప్యాడ్ చేరుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులు మహ్మద్ అలీ, రాజయ్య, మంత్రులు తన్నీరు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారకరామారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్నలు, జిల్లా ఎస్పీ, కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కూడా బుధవారం సిద్దిపేట రానున్నారు. -
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
సాక్షి, హన్మకొండ : వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండున్నర గంటల పాటు పర్యటించనున్నారు. ఈనెల 9వ తేదీన జిల్లాలో సీఎం పర్యటన వివరాలను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా ఉదయం 11.45 గంటలకు సీఎం నిట్‌కు చేరుకుంటారు. కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు పయనమవుతారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరిగే కాళోజీ స్మారక సభకు వచ్చేవారు ఉదయం పది గంటలకే నిట్ ఆడిటోరియానికి చేరుకోవాలని రవీందర్రావు కోరారు. అంతకుముందు బాలసముద్రం సబ్‌స్టేషన్ వెనక కాళోజీ కళాక్షేత్రానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆదివారం మధ్యాహ్నం రవీందర్రావు పరిశీలించారు. ఆయన వెంట పార్టీ నేతలు నన్నపునేని నరేందర్, బూజు గుండ్ల రాజేంద్రకుమార్, గుడిమల్ల రవికుమార్, ఉడుతల సారంగపాణి, మహ్మద్ నయీమొద్దీన్, తొనుపునూరి వీరన్న, నలుబోలు సతీష్, కోరబోయిన సాంబయ్య తదితరులు ఉన్నారు. మంగళవారం సీఎం పర్యటన వివరాలు ఉదయం 11.45 గంటలు :హెలికాప్టర్ ద్వారా నిట్‌కు చేరుకుంటారు 11.51 గంటలు : నక్కలగుట్టలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేస్తారు. 11.55 గంటలు : బాలసముద్రంలో నిర్మించనున్న కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన మధ్యాహ్నం 12.10 గంటలు : నిట్ ఆడిటోరియానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్మారక సభలో పాల్గొంటారు 1.30 గంటలు : కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుంటారు. అక్కడే లంచ్ చేస్తారు 2. 05 గంటలు : నిట్‌కు బయల్దేరుతారు 2. 15 గంటలు : హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ పయనం -
స్థానిక ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ మూడు రోజులపాటు రాజధానిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకరోజు శిక్షణను ఒకేసారి ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ, సీఎం మాత్రం మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలని.. అందులో ఒకరోజు మొత్తం తానే శిక్షణ ఇస్తానని వారికి వివరించారు. అయితే, ఈనెల 22 తర్వాత శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 51.05 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ సమగ్ర సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు 51,05,072 కుటుంబాల వివరాలను కంప్యూటరీకరణ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ వివరించారు. ఈనెల 11వ తేదీలోగా ఈ కంప్యూటర్లలో డేటా నిక్షిప్తం చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. -
బడ్జెట్ అంటే జమాఖర్చులు కాదు..
ప్రభుత్వ విధానాలను ప్రతిబింబించాలి: ముఖ్యమంత్రి కేసీఆర్ * కేవలం ఒక ఏడాది ప్రక్రియగా చూడొద్దు * రూపకల్పనలో కొత్త ఒరవడి ఉండాలి * వనరుల సమీకరణ, సంస్కరణలపై దృష్టిపెట్టండి * ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులకు సూచన సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ అంటే కేవలం జమాఖర్చుల వ్యవహారం కాదని, అది ప్రభుత్వ విధానాల ఆవిష్కరణగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రతి శాఖకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు జరపడానికి ముందే.. విధి విధానాలు రూపొందించి, క్షుణ్నంగా చర్చించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా, సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో బడ్జెట్‌పై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రభుత్వ సలహాదారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలికంగా ఉండాలని.. అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాలని కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణకు ఉన్న వనరులు, ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు, అనుకూలతలు, ప్రతికూలతలు ఏమిటనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహనతో విధానాలు రూపొందించాలని సూచించారు. ప్రతి రంగంలోనూ ప్రస్తుతమున్న విధానాలు, చట్టాలు ఎలా ఉన్నాయి, వాటిని యథాతథంగా వాడుకోవచ్చా, మార్పులు చేయాలా, పూర్తిగా కొత్త చట్టాలు తేవాలా, అసలు విధానమే మార్చాలా.. అన్న అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ సదర్భంగా అధికారులను సీఎం కోరారు. నిర్లక్ష్యానికి గురైనవాటిని గుర్తించండి.. తెలంగాణకు అనేక అంశాల్లో అనుకూలతలు ఉన్నా ఇంతకుముందటి పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నారు. ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి కొత్త ఒరవడి సృష్టించాలని.. ప్రతీశాఖలో నిర్లక్ష్యానికి గురైన వాటిని గుర్తించి సవరించాలని అధికారులకు సూచించారు. తెలంగాణ విత్తనోత్పత్తికి అత్యంత అనువుగా ఉన్నా.. పూర్తిగా నిర్లక్ష్యం జరిగిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్రాప్ కాలనీలుగా విభజించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు తనకున్న శక్తి మేరకు కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. వేర్వేరుగా ప్రతిపాదనలు.. విధానాల రూపకల్పనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని, వాటిని కూడా ప్రభుత్వంలో భాగంగా పరిగణించాలని సూచించారు. గ్రామ, మండల, జిల్లా, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు తగిన అధికారాలు, బాధ్యతలు అప్పగించడానికి అవసరమైన విధానాలు రూపొందించాలని చెప్పారు. బడ్జెట్ అనేది ఒక సంవత్సరం కోసం చేసే ప్రక్రియగా ఉండరాదని... ఐదేళ్ల కాలానికి కార్యాచరణ రూపొందించుకుని మొదటి ఏడాది నిధులు కేటాయిస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని కోరారు. అదే విధంగా అక్రమాలను నియంత్రించే విధానాలు, కార్యాచరణ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, ఏకే గోయల్, పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ మాట్లాడాలి..
వరంగల్‌సిటీ : ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన మనసులోని మాటను బయటపెట్టాలని మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాశిబుగ్గలోని అంబేద్కర్‌భవన్‌లో సోమవా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రా లు ఏర్పడకముందు చంద్రబాబునాయుడు ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం ఆయన మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎస్సీ వర్గీకరణపై స్ప ష్టమైన వైఖరిని ప్రకటించాలన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చొరవ చూపితే వర్గీకరణ అమలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇరు రాష్ట్రా ల ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు వెల్లడించకుంటే పోరాటాలు చేస్తామన్నారు. ఈనెల 19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సామాజిక సర్వేను ఒకరోజు కాకుండా వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకరోజు లో రాష్ట్రమంతటా సర్వే నిర్వహించడం సాధ్యపడద ని, అనుకోకుండా ఆ రోజు కుటుంబ సభ్యులు ఇబ్బం దుల్లో ఉంటే కచ్చితమైన డేటా నమోదయ్యే అవకా శం ఉండదని వివరించారు. పేదలకు రేషన్ కార్డుల విషయంలో అన్యాయం జరిగితే రాష్ట్రప్రభుత్వం కూలిపోతుందన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాన్నీ పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందకుమార్, తిప్పారపు లక్ష్మణ్, ఈర్ల కుమార్, తీగల ప్రదీప్, వేల్పుల వీరన్న, పుట్ట రవి, ఎర్ర విజయ్, బేతాళ్ల శివ, సిరిమల్ల వీరేందర్, ప్రమోద్, అనంత్, దేవన్న, చిరంజీవి, అబ్రహం, వీరుభాయ్, మహేష్ పాల్గొన్నారు. -
సీఎంవోలో ఇంకా గందరగోళమే!
కార్యదర్శులకు ఇప్పటికీ శాఖలు కేటాయించని వైనం ఫలితంగా ముందుకు కదలని ఫైళ్లు హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీ ఇంకా కుదురుకోలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి 40 రోజులు దాటుతున్నా పేషీలోని అధికారుల్లో ఎవరెవరూ ఏయే శాఖలు చూడాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో ఫైళ్లన్నీ సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావుకు మినహా మిగిలిన కార్యదర్శులకు వెళ్లడంలేదు. ముఖ్యమంత్రి పేషీలోకి అధికారుల ఆలస్యంగా రావడం, ఇప్పటి వరకు వారికి ఎలాంటి శాఖలు కేటాయించకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. పేషీలో ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యకార్యదర్శిగా నర్సింగరావు వ్యవహరిస్తున్నారు. స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ప్రత్యేక కార్యదర్శులుగా ఉన్నారు. కానీ వీరికింకా శాఖలు కేటాయించలేదు. వివిధ శాఖల నుంచి సీఎం కార్యాలయానికి వచ్చే ఫైళ్లను అధ్యయనం చేసి, వాటిని ముఖ్యమంత్రికి వివరించడం, అందుకు అనుగుణంగా ఫైళ్లపై సంతకాలు చేయించి తిరిగి పంపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ శాఖలు చూడాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఆ ఫైళ్లు ముందుకు కదలడంలేదు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు సంబంధించిన ఫైలు కూడా అలాగే ఉండిపోయింది. -
జీపీల సంగతి నాకొదిలేయండి: కేసీఆర్
హైదరాబాద్: హైకోర్టు, వివిధ కోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదుల నియామక వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ న్యాయవాదుల (జీపీల) నియామకాల్లో పార్టీ నేతలు, మంత్రులు, న్యాయవాదుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నందున ఆ వ్యవహారాన్ని తానే పర్యవేక్షించడం మేలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డికి తెలిపారు. దీనికి ఏజీ రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ జె.రామచంద్రరావులు ఏ మాత్రం అభ్యంతరం లేదన్నారు. పదిశాతం వాటా కోరుతున్న రంగారెడ్డి లాయర్లు... ఇదిలా ఉండగా, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తమకు 10 శాతం పోస్టులు ఇవ్వాలని రంగారెడ్డి కోర్టుకు చెందిన న్యాయవాదులు పట్టుబడుతున్నారు. హైకోర్టులో జరిగిన ఉద్యమాల్లో ముందుండి పాల్గొన్నది తామేనని, అందువల్ల తమకు అగ్ర తాంబూలం ఇవ్వకతప్పదని వారు కోరుతున్నారు. -
తెలంగాణ మంత్రుల క్వార్టర్లు ఇవే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రుల్లో కొందరికి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మంత్రులకు ఈ నివాస సముదాయంలోని 1 నుంచి 15వ నంబర్ క్వార్టర్ వరకు విభజన సమయంలో కేటాయించిన సంగతి విదితమే. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రి ఈటెల రాజేందర్‌కు క్వార్టర్ నంబర్ 12, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఐదు, విద్యాశాఖమంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డికి 15వ నంబర్, నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావుకు ఏడో నంబర్ క్వార్టర్‌ను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సలహాదారులకు శాఖల కేటాయింపు... ప్రభుత్వం నియమించిన ఆరుగురు సలహాదారులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్. విద్యాసాగర్‌రావు(సాగునీటి పారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన శాఖ), కేవీ రమణాచారి(దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక, యువజన, మీడియా), బీవీ పాపారావు(సంస్థాగత వ్యవహారాలు), ఎ.రామలక్ష్మణ్(సంక్షేమం), జీఆర్ రెడ్డికి ఆర్థికశాఖను కేటాయించారు. -
సమరోత్సాహం
కేసీఆర్ సుడిగాలి ప్రచారం... హెలికాప్టర్ ద్వారా పర్యటన ఒకే రోజు ఐదు సెగ్మెంట్లలో సభలు... అధిక సంఖ్యలో హాజరైన జనం గులాబీ బాస్ మాటల తూటాలు... ప్రత్యర్థులపై విమర్శల బాణాలు పిచ్చికూతలు మానుకోవాలని రాహుల్‌కు హితవు వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో ‘కారు’ రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తోంది. గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటనతో ఓరుగల్లులో ప్రచారపర్వాన్ని వేడెక్కిం చారు. మంగళవారం ఒకే రోజు ఐదు శాసనసభ నియోజకవర్గాలను చుట్టేసి ప్రత్యర్థి పక్షాలకు అందనంత దూరంలో నిలిచారు. బహిరంగ సభలకు భారీగా జనం తరలిరావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లిలో బహిరంగ సభ ప్రారంభం కాగా, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడలో సాగింది. సాయం త్రం ఐదు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రచారానికి వెళ్లారు. వ్యంగ్యాస్త్రాలు.. విమర్శలు బహిరంగ సభల్లో కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. విమర్శలు వాడీ పెంచుతూ ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తిపోశారు. అదేసమయంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యమం నడిపినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామంటూ వరాల వర్షం కురిపించారు.అసంతృప్తులకు అవకాశాలు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి కేసీఆర్ భరోసా కల్పించారు. పరకాల టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని భూపాలపల్లి సభలో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగుర్ల ఆనందంతో కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రుడికి ఇస్తారని భావించినప్పటికీ... ఆయన పోటీకి విముఖత చూపిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ సభలో ఆయన గురించి ప్రస్తావిస్తూ రామచంద్రుడికి రాజ్యసభ, ఎమ్మెల్సీల్లో ఏదో ఒక అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఇప్పటికే ఈ లైన్లో పరకాల సిట్టింగ్ ఎమ్మె ల్యే బిక్షపతి కూడా ఉన్న విషయం తెలిసిందే. సరాసరి ప్రసంగంలోకి... సభాస్థలికి సమీపంలోనే హెలికాప్టర్లో దిగిన ఆయన సరాసారి వేదికపైకి వెళ్లి ప్రజలకు అభివాదం చేసి... సరాసరి ప్రసంగంలోకి వెళ్లిపోయూరు. ఆయన ప్రసంగం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే సాగింది. 40 నిమిషాల వ్యత్యాసంతోనే సభలు సాగారుు. తొలి సభ తర్వాత మలి సభలు కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో తన ప్రసంగ సమయూన్ని తగ్గించుకున్నారు. ఎక్కువ సభల్లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే రెండు దశల్లో ప్రచారం చేపట్టిన కేసీఆర్ మూడో విడతగా మరోసారి ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. -
ప్రాజెక్టుల నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యమా..?
విద్యుదుత్పత్తి అవుతున్నా జిల్లా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు బంధనాలను తెంచుకోండి బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం, న్యూస్‌లైన్ : ‘ఎడమ వైపు కృష్ణా నది, కుడి వైపు గోదావరి, ఇతర నదులు ఉన్నా జిల్లాలో కరువు తాండవిస్తోంది... పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహింరగ సభలో ప్రసంగిస్తూ... జిల్లాలో కేవలం 34 శాతం భూమి మాత్రమే సాగుకు అనుకూలంగా ఉందని, ఈ భూమికి కూడా సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా రైతులకు సాగునీరు అందించే దుమ్ముగూడెం, రుద్రమకోట ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని గత పాలకులను ప్రశ్నించారు. కిన్నెరసాని నీరు ఎందుకూ ఉపయోగపడడం లేదని, భారీగా విద్యుదుత్పత్తి అవుతున్నా జిల్లా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్లు జిల్లాలోని గార్ల, బయ్యారం ప్రాంతాలకు రావాల్సి ఉండగా సీమాంధ్రకు చెందిన ఇంజనీర్ కెఎల్ రావు కుట్రతో ఆ ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. తమ కళ్ల ముందునుంచే కృష్ణా నది నీరు వెళ్తున్నా వేంసూరు ప్రాంత రైతులు మాత్రం సాగునీటి కోసం లిప్టులు, ఇతర విద్యుత్ మోటర్లు పెట్టుకొని ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. తమను సీమాంధ్ర ప్రాంతం వారు చీటికి మాటికి బెదిరిస్తున్నారని వేంసూరు మండల రైతులు చెప్పినప్పుడు తాను తీవ్రంగా కలత చెందానని అన్నారు. మన ప్రాంతంలో మన పాలన వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని, ప్రాజెక్టు గట్టుమీద కుర్చీ వేసుకొని కూర్చొని నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. బంధనాలు తెంచుకుని ఇబ్బందులు, మోసపూరిత మాటలను నమ్మకుండా టీఆర్ఎస్కు మద్దతు పలికి హరిత తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎస్కె. బురహన్ భేగ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కల సాకారమవుతున్న తరుణంలో బంగారు తెలంగాణ ఏర్పాటు టీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి జీ. కృష్ణ మాట్లాడుతూ అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నా జిల్లాను అభివృద్ధి చేయకుండా పాలక పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఖమ్మం సభ అనంతరం కేసీఆర్ మణుగూరు బయల్దేరగా... హెలికాప్టర్ దారితప్పి భద్రాచలం వెళ్లడంతో అక్కడి నుంచి ఇల్లెందుకు వెళ్లి.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా కొత్తగూడెం వచ్చారు. అక్కడ బహిరంగసభలో పాల్గొని తిరిగి ఖమ్మం వచ్చి బస చేశారు. ఈ సభల్లో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్, మధిర, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, అభ్యర్థులు బొమ్మెర రామ్మూర్తి, రావెళ్ల రవీంద్ర, ఊకె అబ్బయ్య, జలగం వెంకట్రావు, నాయకులు తవిడిశెట్టి రామారావు, అర్వపల్లి విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఒకేరోజు ‘త్రీ స్టార్స్’
నేడు జిల్లాకు రానున్న కేసీఆర్, జైరాం రమేష్, ఏచూరి హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేయనున్న గులాబీ బాస్ మధిర, ఖమ్మంలో జైరాం.. మధిర, భద్రాచలంలో సీతారాం సాక్షి, ఖమ్మం: జిల్లాలో రాజకీయ ప్రచారం వేడెక్కింది. పార్టీల అగ్రనేతలను రప్పించి ప్రచార జోరు పెంచేందుకు అన్ని పార్టీలు సై అంటున్నాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు జిల్లాకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న పార్టీలు అగ్రనేతలు వస్తుండడంతో వారి ప్రచార పర్యటనను విజయవంతం చేయడంలో నిమగ్నమయ్యాయి. నాలుగు చోట్ల ‘గులాబీ’ సభలు.. జిల్లాలో టీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. చాలా కాలం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాకు వస్తుండడం, ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో.. శ్రేణులంతా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందులో కేసీఆర్ సభలకు నేతలు ఏర్పాట్లు చేశారు. అలాగే కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ప్రచారానికి చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడంతో చివరకు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను తెలంగాణలో ప్రచారానికి టీపీసీసీ రంగంలోకి దింపింది. ఆయన జిల్లాలోని మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మధిర, భద్రాచలంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 3.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం చేరుకుంటారు. ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మణుగూరు చేరుకొని అక్కడ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు ఇల్లెందు, 6 గంటలకు కొత్తగూడెం సభలలో ప్రసంగిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం చేరుకొని ఇక్కడే రాత్రి బస చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. సీతారాం ఏచూరి పర్యటన ఇలా.. ఉదయం 8 గంటలకు మధిర చేరుకుం టారు. అక్కడ వైఎస్సార్సీపీ, సీపీఎం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధిర నియోకజవర్గ స్థాయి సెమినార్లో ప్రసంగిస్తారు. ఆ తర్వాత భద్రాచలంలో ప్రచారంలో పాల్గొంటారు. జైరాం రమేష్పర్యటన ఇలా.. సాయంత్రం 4 గంటలకు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నాగులవంచలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకు ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు. -
కేసీఆర్ గైర్హాజరు.. శ్రేణుల్లో నిరుత్సాహం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట చంద్రశేఖర్‌రావు ఇబ్రహీంపట్నం పర్యటన రద్దు కావడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టీఆర్ఎస్కు కేసీఆర్ పర్యటన మరింత బలం చేకూర్చుతుందని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ప్రచార పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సభ ప్రారంభం కానుండడంతో ఆ పార్టీ అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులు, స్థానిక నాయకులు పెద్దఎత్తున జనసమీకరణ చేపట్టాలని అనుకున్నా ఆశించిన మేర జనంరాలేదు. అఅభిమానుల్లో అసంతృప్తి చాలా కాలం తర్వాత కేసీఆర్ ఇబ్రహీంపట్నం వస్తుండన్న ప్రచారంతో అభిమానులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. శుక్రవారం భానుడి ప్రతాపం తగ్గడంతో సభకు వచ్చిన వారంతా ఉత్సాహంగా కేసీఆర్ కోసం వేచి చూశారు. అయితే సాయంత్రం ఆరుగంటలు దాటుతున్నప్పటికీ కేసీఆర్ రాకపోవడంతో సభకు హాజరైన అగ్రనేతలు కే.కేశవరావు, నాయిని నర్సింహారెడ్డి తదితరులు ప్రసంగాలు ప్రారంభించారు. వారి ప్రసంగాలు ముగిసినా కేసీఆర్ రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఊసురు మంటూ వెనుదిరిగారు. -
‘కారు’ లేని కేసీఆర్
-
‘కారు’ లేని కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు కారు.. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సొంతంగా ఒక్క కారు కూడా లేదట! తనకే కాదు.. తన సతీమణి శోభ పేరు మీద కూడా ఎలాంటి వాహనం లేదని కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పులను ప్రకటించారు. మొత్తం రూ.14.94 కోట్ల ఉన్నాయని అందులో స్థిరాస్తులు రూ. 8.65 కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ. 6.29 కోట్లుగా చూపారు. తన సతీమ ణి వద్ద రూ. 21 లక్షలు విలువైన చరాస్తులున్నాయని, మొత్తం రూ.7,87,53,620 అప్పులున్నాయని తెలిపారు. 2012-13లో రూ. 6,59,684 ఆదాయాన్ని అర్జిస్తే, 2013-14లో రూ. 8,67,830 ఆర్జించినట్లు ఆదాయ పన్నుల రిటర్న్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. నామా ఆస్తులు రూ. 338 కోట్లు ఖమ్మం లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నామా నాగేశ్వరరావు మొత్తం రూ. 338 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో రూ.222 కోట్లు స్థిరాస్థులైతే.. రూ. 116 కోట్లు చరాస్తులని పేర్కొన్నారు. తన పేరు మీద రూ. 141 కోట్ల స్థిరాస్తులు, రూ. 45 కోట్ల చరాస్తులు ఉండగా.. మిగతావి తన భార్య నామా చిన్నమ్మ, కుమారులు పృథ్వీతేజ, భవ్యతేజ పేర్ల మీద ఉన్నట్లు వివరించారు. తన పేరుతో రూ.19 కోట్లు, తన భార్య పేరుతో రూ.7 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. కామ్రేడ్ నారాయణా కోటీశ్వరుడే ఖమ్మం లోక్‌సభకు సీపీఐ అభ్యర్థిగా పోటీచేస్తున్న కె.నారాయణ తనకు, తన భార్యకు కలిపి రూ. 3 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. తన వద్ద రూ. 4.27 లక్షల నగదు, రూ. 77.50 లక్షల విలువైన భూములు, రూ. 25.10 లక్షల విలువ గల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తన భార్య వసుమతిదేవి పేరు మీద రూ.20.83 లక్షల నగదు, రూ. 66.50 లక్షల విలువ గల భూములు, రూ. 1.44 కోట్ల విలువ గల చరాస్తులు ఉన్నాయని నివేదించారు. కుబేరుడు వివేక్.. మొత్తం ఆస్తులు రూ. 265 కోట్లు గత ఎన్నికలతో పోలిస్తే ఎంపీ వివేకానంద ఆస్తులు వుూడింతలు దాటారుు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోకస్‌భ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ సవుర్పించిన వివేక్.. తన అఫిడవిట్లో తనకు రూ. 194.28 కోట్ల స్థిరాస్తులు, రూ.44.28 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. భార్య పేరిట రూ.10.99 కోట్ల స్థిరాస్తులు, రూ.16.70 కోట్ల చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. తన పేరిట రూ. 2.99 కోట్లు, భార్య పేరిట రూ.9.32 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారు. 2009 ఎన్నికల్లో ఆయున తన ఆస్తులను రూ. 72.95 కోట్లుగా ప్రకటించారు. అప్పుడు అప్పులేమీ లేవని ప్రకటించారు. కేసీఆర్ వద్ద రూ. 40 లక్షలు అప్పుచేసిన కేటీఆర్ సిరిసిల్ల నుంచి రెండోసారి పోటీకి దిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ వద్ద రూ.40 లక్షల అప్పు తీసుకున్నట్లు పే ర్కొన్నారు. 2009 ఎన్నికలప్పుడు రూ.4.20 కోట్ల ఆస్తులు.. రూ.57 లక్షల అప్పు ప్రకటించిన కేటీఆర్ ఈసారి... తన పేరిట, తన భా ర్యా పిల్లల పేరిట రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.2.86 కోట్ల స్థిరాస్తులున్నట్లు వెల్లడించారు. వ్యవసాయు రుణం, గోల్డ్‌లోన్, తండ్రికి ఇవ్వాలినవి కలిపి రూ. 2 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరేందర్‌గౌడ్ ఆస్తులు రూ. 62 కోట్లు చేవెళ్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూళ్ల వీరేందర్‌గౌడ్ (దేవేందర్‌గౌడ్ తనయుడు) తనకు రూ. 62 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు ప్రకటించారు. ఇందులో రూ. 29.6 కోట్లు పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి తనకు రావాల్సిన బకాయిలుగా చూపగా, మరో రూ. 27.5 కోట్ల మేర పలు కంపెనీల్లో తనకు వాటాలున్నట్టు వెల్లడించారు. రూ. 3.5 కోట్లు విలువ చేసే పది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు. దంపతులిద్దరికీ సొంత వాహనాలు లేకపోవడం విశేషం. కాగా తనకు రూ. 13.25 కోట్ల ఆప్పులు కూడా ఉన్నాయని వీరేందర్ వెల్లడించారు. పొన్నాల ఆస్తులు రూ. 7 కోట్లు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తనకు, తన భార్యకు కలిపి రూ. 7 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఖిలాషాపురంలో ఇల్లు, జూబ్లీహిల్స్‌లో రూ. 50 లక్షల విలువ చేసే అపార్ట్మెంట్, రాంపూర్, వరంగల్ చుట్టు పక్కల ప్రాం తాల్లో 14.66 లక్షల విలువైన సాగుభూమి ఉన్నట్లు తెలిపారు. -
మాటల తోటమాలి
ప్రొఫైల్ పూర్తి పేరు: కల్వకుంట్ల చంద్రశేఖరరావు సొంతూరు: చింతమడక, మెదక్ జిల్లా పుట్టిన తేదీ: 17.2.1954 తండ్రిపేరు: రాఘవరావు తోబుట్టువులు: ఒక అన్న, 9 మంది అక్కాచెల్లెళ్లు భార్య: శోభ పిల్లలు: కల్వకుంట్ల తారక రామారావు (ఎమ్మెల్యే), కవిత (తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు) విద్యార్హతలు: ఎమ్మే (తెలుగు) అది సిద్దిపేట శివారు ప్రాంతం. భారీ బహిరంగ సభ. నేల ఈనిందా అన్నట్టు జనం. చీకటి పడుతోంది. జనంలో అసహనం. ఉన్నట్టుండి వేదిక పక్కగా గందరగోళం. చూస్తుండగానే పెరిగిపోతోంది. అంతలో ఓ బక్కపలచని వ్యక్తి లేచి మైకందుకున్నాడు. ‘అంతా మనోళ్లేనా? లేకుంటె ఎవడన్న మోపైండా?’ అన్నాడు.ఒక్కమాటతో అంతా గప్‌చుప్. తర్వాత అతను అరగంట పాటు అనర్గళంగా మాట్లాడాడు. ఒక్కమాటతో అంతమందినీ అదుపు చేసిన ఆ మాటల మాంత్రికుడు కేసీఆర్‌గా దేశమంతటికీ తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. బోరెడ్డి అయోధ్య రెడ్డి: 13 ఏళ్లంటే నేతల రాజకీయ జీవితంలో మరీ ఎక్కువ కాలమేమీ కాదు. కానీ కేసీఆర్ విషయం అలా కాదు. గడచిన పదమూడేళ్లకాలం ఆయనకు కొన్ని జీవితాలకు సరిపడా తీపి, చేదు అనుభవాలను, ఎత్తుపల్లాలను చవిచూపింది. అంత తక్కువ కాలంలో ఆయనన్ని దూషణ భూషణలు అందుకున్న నాయకుడు మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పుష్కర కాలంగా రాష్ట్ర రాజకీయాలన్నీ తెలంగాణ చుట్టూ, కేసీఆర్ చుట్టే తిరిగాయి. ఎవరేమన్నా పట్టించుకోని విలక్షణ రాజకీయ శైలితో వివాదాలకు, విమర్శలకు, సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచారు. తెలంగాణ ప్రజల కలల ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. మాటలే పెట్టుబడి కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ వారసత్వమూ లేదు. చిన్న వయసులోనే టీడీపీలో చేరి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. 1999లో కేసీఆర్‌కు చంద్రబాబు తన కేబినెట్లో చోటు కల్పించకుండా డిప్యూటీ స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఆ అవమానాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆయనలో ‘తెలంగాణ సోయి’ రెక్కలు విప్పుకోవడం అప్పటినుంచే మొదలైంది. ఏడాదికి పైగా అన్ని కోణాల నుంచీ అధ్యయనం చేసి ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ‘తెలంగాణ’ ఆకాంక్షలను తట్టి లేపడం సాధ్యమేనన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ తదుపరి అడుగు వేశారు. బాబుపై తిరుగుబావుటా ఎగరేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించారు. ప్రజాకాంక్షలను రాజకీయాలతో ముడిపెడుతూ ఎన్నికలే ఉద్యమ పంథాగా నడిపించారు. మాటే మంత్రమని ఎందుకంటారో కేసీఆర్ ప్రసంగం వింటే తెలుస్తుంది. అద్భుతమైన వక్తల జాబితాలో ఆయన నిలుస్తారు. తెలుగులోనే గాకుండా ఉర్దూ, హిందీ భాషల్లోనూ అనర్గళంగా ప్రసంగించగలరు. ఆంగ్లంపై కూడా మంచి పట్టుంది. బద్ధ విరోధులు కూడా ఆసక్తిగా వినే శైలీవిన్యాసం, చమక్కులు కేసీఆర్ సొంతం. భాషపైనా యాసపైనా మాండలికాలపైనా లోతైన అవగాహన ఉంది. అలాగని తనను మాటల మరాఠీ అని ఎవరన్నా అంటే కేసీఆర్ కస్సుమంటారు. ‘దీక్ష’ తెచ్చిన ఊపు 2009 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ రూపురేఖలను మార్చేసింది. 2009 నవంబరు 29న ఆమరణ దీక్షకు దిగడం కేసీఆర్ ప్రస్థానంలో మరో కీలక మలుపు. పలు వివాదాలకు తావిచ్చిన ఆ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు డిసెంబరు 9న కేంద్రం ప్రకటించింది. అప్పుడది సాకారం కాకపోయినా టీఆర్ఎస్ పుంజుకునేందుకు కారణమైంది. వ్యవసాయం.. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేసీఆర్‌కు సాగుపై ఎంతో మక్కువ. రాష్ట్ర మంత్రిగా ఉండగా రంగారెడ్డి జిల్లాలో భూమి కొన్నారు. ఇప్పుడు మెదక్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక సేద్యం చేస్తున్నారు. ఎగుడుదిగుళ్లు 2001లో పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది. తరవాత సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీ సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో వచ్చిన 42 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో 14 చోట్ల కూడా పోటీ చేసినా గెలిచింది 26 సీట్లే. ఆ సమయంలో కాంగ్రెస్ విసిరిన సవాలును అందిపుచ్చుకుని కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణవాదానికి రిఫరెండంగా ప్రచారం చేసి 2 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. పదేపదే రాజీనామా కార్డు ప్రయోగించడం అప్పుడప్పుడూ బెడిసికొట్టింది కూడా. 2008లో మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. 17 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల ఓటమి చవిచూశారు. ఆ ఫలితాలతో కేసీఆర్ కుంగిపోయారు. 2009 సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసి మహాకూటమిలో చేరి కేసీఆర్ మరో చేదు అనుభవం చవిచూశారు. 55 అసెంబ్లీ, 9 లోక్‌సభ ు స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే, 2 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది. రెండు లక్షల మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపించిన కరీంనగర్ ఓటర్లు ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు. ‘తెలంగాణ వెనుకబాటుతనం పోవుటానికి నిధులు కావాన్నని కేంద్రానికి చంద్రబాబు ఉత్తరం రాసిండట. ఆ కార్డు ముక్క ఎటు పోయిందో? అడ్రసు గిట్ట తప్పు రాసిండా ఏంది?’ - కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖపై.. ‘కరెంటు మీటర్లు చంద్రబాబు ఎక్కి తిరుగుతున్న హెలికాప్టరు పంకల కంటె స్పీడుగా తిరుగుతున్నయి’ - బాబు హయాంలో విద్యుత్ సంస్కరణల పేరుతో బిగించిన డిజిటల్ కరెంటు మీటర్లపై ఎద్దేవా -
సభలో విగ్రహావేశాలు
మట్టిబొమ్మలు పగిలితే ట్యాంక్‌బండ్‌కు వెళ్లి రోదించారన్న కేటీఆర్ వెయ్యి మంది విద్యార్థులు మరణిస్తే కన్నీటి బొట్టు రాల్చరంటూ ధ్వజం మట్టిబొమ్మలు కావవి.. జాతి నేతల చిహ్నాలు: ధూళిపాళ్ల, వంగా గీత కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: శైలజానాథ్, టీ టీడీపీ సభ్యులు సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉన్న ప్రముఖుల విగ్రహాల కూల్చివేతపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు మంగళవారం శాసనసభలో దుమారం రేపాయి. టీఆర్ఎస్, టీడీపీ సభ్యుల మధ్య ఆవేశకావేశాలకు దారి తీశాయి. సభ్యులు చరిత్ర తవ్వుకుంటూ మాటల యుద్ధానికి దిగారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ సీమాంధ్ర టీడీపీ సభ్యులతో పాటు, అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు సభను అడ్డుకున్నారు. వెన్నుపోట్లకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆద్యుడని కేటీఆర్ ఎద్దేవా చేస్తే, ఎన్టీఆర్‌ను గద్దె దించడానికి అందరితో సంతకాలు చేయించింది టీఆర్ఎస్ అధినేత కేసీఆరేనని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ బిల్లుపై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ‘ట్యాంక్‌బండ్‌పై ఉన్న నాలుగు మట్టి బొమ్మలు పగిలిపోతే రాద్ధాంతం చేస్తూ రోదించారు. అక్కడకు వెళ్లి కన్నీరు పెట్టుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వెయ్యి మంది మరణిస్తే కన్నీరు కూడా పెట్టలేదు. అలాంటి వారు అన్నదమ్ముల్లా కలిసుందామని ఎలా అంటారు?’ అని వ్యాఖ్యానించారు. దాంతో సభలో దుమారం రేగింది. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. టీడీపీ సభ్యులు కూడా పోడియంలోకి వెళ్లి, కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. కానీ కేటీఆర్ మాత్రం, ‘క్షమాపణలు చెప్పను. వంద శాతం ఇలాగే అంటాను. నాలుగు మట్టిబొమ్మలు కూలితే ఇంత రోదిస్తారా?’ అని మరోసారి అనడంతో గొడవ రెట్టింపయింది. దాంతో సభను డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క ఐదు నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా సభలో అదే ఆందోళన కొనసాగింది. ఏ మహనీయులకు తాము వ్యతిరేకం కాదని టీఆర్ఎస్ పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. ‘‘పెట్రోల్ మంటల్లో కాలిపోతూ కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ నినాదాలు చేస్తూ మరీ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి ఆత్మహత్యలు వద్దంటూ తీర్మానం, విజ్ఞప్తి చేద్దామని, తద్వారా యువకులకు భరోసా కల్పిద్దామని కోరినా ఎవరూ కలసి రాలేదు. కడుపు మంటతో చేసే పనులు సాధారణంగా జరుగుతుంటాయి. మీ ఉద్యమంలో కూడా జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేశారు. ట్యాంక్‌బండ్‌పై కొమరం భీమ్, బందగి, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఎందుకు పెట్టలేదు? పదవులు మాకు గడ్డిపోచ కింద లెక్క’’ అన్నారు. మట్టిబొమ్మలు కావవి: ధూళిపాళ్ల టీడీపీ సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కల్పించుకుని, అవి మట్టిబొమ్మలు కావని, జాతి నాయకులకు, సంస్కృతీ, సంప్రదాయాలకు చిహ్నాలని అన్నారు. ‘‘ఆ విగ్రహాలు పెట్టడానికి వేసిన కమిటీలో ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డితో పాటు కేసీఆర్ కూడా సభ్యుడు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మీ నైజానికి గుర్తు. క్షమాపణ చెప్పే సంస్కారం కూడా లేదా?’ అంటూ మండిపడ్డారు. కేటీఆర్ బదులిస్తూ, ‘బతికున్న వారికి సమాధి కట్టే సంస్కృతి మీది. శాంతియుత ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేస్తేనే అలాంటి ప్రతిక్రియ జరిగింది. ఎన్టీఆర్‌పై చెప్పులేయించిన దుర్మార్గులు మీరు. క్షమాపణ చెప్పాలని మీ నాయకునికి సూచించండి. మీ దగ్గర సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణకు అనుకూలమని మీ టీడీపీ మేనిఫెస్టోలో అన్నారు. ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. సిగ్గుంటే రాజీనామా చేసి మాట్లాడండి. మందబలంతో నోరు నొక్కేస్తే ఎవరూ ఊరుకోరు’’ అన్నారు. గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా చంద్రబాబు నీచుడని ఎన్టీఆరే అన్నారని గుర్తు చేశారు. దాంతో మరోసారి టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ‘అహంకార వైఖరి నశించాలి’, ‘అహంకార వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’, ‘క్షమాపణ చెప్పాలి’ అంటూ నినాదాలు చేశారు. విడిపోవడానికే ఏకాభిప్రాయమా: కేటీఆర్ రాష్ర్టం విడిపోవడానికి కావాల్సిన ఏకాభిప్రాయం, కలిసుండటానికి మాత్రం అవసరం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, ఏకాభిప్రాయంతోనే విభజన జరగాలనడం సరికాదన్నారు. ‘‘కుట్రలు, కుతంత్రాలతోనే నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. రెడీమేడ్‌గా ఉన్న హైదరాబాద్ రాజధాని కోసమే సీమాంధ్ర వారు అప్పుడు కలసిపోయారు. తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు స్వభావముంది. నిజాం నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రక్షణగా టీఆర్ఎస్ నిలబడింది. ఈ బిల్లు ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ రాలేదు. మెడలు వంచి తెలంగాణను సాధించుకుంటున్నాం’’ అన్నారు. రాష్ట్రం కోసం పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావు చనిపోతే ఆయన అంత్యక్రియలను కనీసం అధికార లాంఛనాలతో నిర్వహించలేదంటూ ఆక్షేపించారు. పీవీ నరసింహారావును రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడాది కూడా పని చేయకుండా చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో పూర్తి శత్రుభావం రాకముందే విడిపోవడం మంచిదన్నారు. -
జిల్లాపై కేసీఆర్ నజర్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్‌తోపాటు పది అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ కీలక నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌లను కేసీఆర్ రంగంలోకి దింపినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న వివిధ పార్టీలకు చెం దిన సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రధాన పార్టీల సీనియర్లు పలువురు బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తుండటం.. తాజాగా 11న ఆయన జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరేందుకు సుముఖంగా ఉన్న పలువురిపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలకు టీఆర్ఎస్ గాలం ఆదిలాబాద్‌పై ఆధిపత్యం పెంచుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. టీడీపీకి కంచుకోటలాంటి జిల్లాపై ఇప్పటికే టీఆర్ఎస్ పట్టు సాధించింది. మొదటి నుంచి టీడీపీని ఆదరించిన జిల్లా ప్రజలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ పార్టీకి పూర్తిగా దూరమవుతూ వచ్చారు. ఇప్పటికే ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, రామన్నలు టీఆర్ఎస్లో చేరారు. ఎంపీ రాథోడ్ రమేష్ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరతారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు గోడం నగేశ్, సుమన్ రాథోడ్‌లపై కూడా ఈ రకమైన ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, ఆత్రం సక్కులు ఆ పార్టీలో కొనసాగుతూ తెలంగాణ మంత్రం జపిస్తుండగా, ప్రధాన పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ప్రజాప్రతినిధులు, సీనియర్లపై టీఆర్ఎస్ దృష్టి సారించడం రాజకీయవర్గాల్లో తాజా అంశంగా మారింది. ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరు, సిర్పూరు, ముథోల్ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, 2014 ఎన్నికల్లో బోథ్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోను విజయావకాశాలున్న అభ్యర్థులకు గాలం వేసే పనిలో టీఆర్ఎస్ పడింది. ఈ నెలాఖరులోగా చేరికలకు మాట.. 2014 ఎన్నికలు లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు ఇటీవలే శిక్షణ తరగతులు నిర్వహించిన ఆ పార్టీ జిల్లాలో మరో ఐదు నియోజకవర్గాల్లోను పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మల్, బోథ్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ప్రజల్లో మంచి పట్టున్న ఓ సీనియర్ నేతతో ఇటీవలే మాట్లాడినట్లు తెలిసింది. నిర్మల్‌లో ఇప్పటికే పార్టీ ఇన్చార్జి ఉన్నా... ఆయనకు నచ్చచెప్పి పార్టీలో చేర్చుకునే విషయమై టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు కూడా మంతనాలు జరిపినట్లు చెప్తున్నారు. ఓ వైపు కేసీఆర్, మరోవైపు హరీష్‌రావు, ఈటెల రాజేందర్ జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన సీనియర్లతో మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది. ఇదిలా వుండగా 2013 డిసెంబర్ మొదటి వారం నాటికి కాంగ్రెస్-టీఆర్ఎస్లు, బీజేపీ-టీడీపీ మధ్య పొత్తులు ఉంటాయన్న ప్రచారం ఉంది. అయితే తాజాగా ఏ పార్టీలకు పొత్తుల విషయమై స్పష్టత లేకపోవడంతో విడివిడిగానే పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ప్రజాక్షేత్రంలోకి ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో టీఆర్ఎస్ పొత్తుల ప్రసక్తి లేకుండా... అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. జిల్లాకు చెందిన పలువురికి ‘గులాబి’ కండువా వేసేందుకు ఈ నెలాఖరుకల్లా గడువు పెట్టినట్లు సమాచారం.