ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రుల్లో కొందరికి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణం చేసిన మంత్రుల్లో కొందరికి బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో నివాసాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మంత్రులకు ఈ నివాస సముదాయంలోని 1 నుంచి 15వ నంబర్ క్వార్టర్ వరకు విభజన సమయంలో కేటాయించిన సంగతి విదితమే. ఆర్థిక, పౌరసరఫరాల శాఖల మంత్రి ఈటెల రాజేందర్‌కు క్వార్టర్ నంబర్ 12, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఐదు, విద్యాశాఖమంత్రి జి. జగదీశ్వర్‌రెడ్డికి 15వ నంబర్, నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి హరీశ్‌రావుకు ఏడో నంబర్ క్వార్టర్‌ను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
సలహాదారులకు శాఖల కేటాయింపు...
ప్రభుత్వం నియమించిన ఆరుగురు సలహాదారులకు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్. విద్యాసాగర్‌రావు(సాగునీటి పారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన శాఖ), కేవీ రమణాచారి(దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక, యువజన, మీడియా), బీవీ పాపారావు(సంస్థాగత వ్యవహారాలు), ఎ.రామలక్ష్మణ్(సంక్షేమం), జీఆర్ రెడ్డికి ఆర్థికశాఖను కేటాయించారు.