స్థానిక ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ మూడు రోజులపాటు రాజధానిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకరోజు శిక్షణను ఒకేసారి ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ, సీఎం మాత్రం మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలని.. అందులో ఒకరోజు మొత్తం తానే శిక్షణ ఇస్తానని వారికి వివరించారు. అయితే, ఈనెల 22 తర్వాత శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
51.05 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ
సమగ్ర సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు 51,05,072 కుటుంబాల వివరాలను కంప్యూటరీకరణ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ వివరించారు. ఈనెల 11వ తేదీలోగా ఈ కంప్యూటర్లలో డేటా నిక్షిప్తం చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు.