Integrated survey
-
1.42 కోట్ల ఎకరాలకు ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో రైతులెందరు..? ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 55.53 లక్షలు! కానీ వ్యవసాయ శాఖ ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో తేలిన రైతుల సంఖ్య 45.33 లక్షలు!! మరి రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి సాయం పథకానికి ఏ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలి? ఇప్పటిదాకా ఇదో చిక్కుప్రశ్న. ప్రస్తుతం దీనిపై స్పష్టత వచ్చింది. పెట్టుబడి సాయం పథకానికి రైతుల సంఖ్యను కాకుండా రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ భూమిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ మేరకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో తేలిన 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఆ భూముల కింద రైతులకు 71.75 లక్షల వ్యవసాయ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల ప్రకారమే ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేయనుంది. ఒక్కో రైతుకు ఒకటికి మించి ఖాతాలు ఉండే అవకాశం ఉన్నందున రైతుల సంఖ్యకు, ఖాతాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక రైతుకు ఒక రెవెన్యూ గ్రామంలో రెండెకరాలు, మరో రెవెన్యూ గ్రామంలో మరో ఐదెకరాలు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ రైతుకు రెండు వ్యవసాయ ఖాతాలుంటాయి. పథకాన్ని అమలు చేస్తే ఇలాంటి రైతులకు రెండు ఖాతాల్లో వేర్వేరుగా ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. భూముల రికార్డుల ప్రక్షాళనలో అధికారులు నిక్కచ్చిగా వ్యవసాయ భూముల వివరాలను ఓ ఖాతాలో రాశారు. వ్యవసాయేతర భూమి ఉంటే దాన్ని మరో ఖాతాలో చూపారు. ఇలా వ్యవసాయ ఖాతాల్లో పేర్కొన్న భూమి 1.42 కోట్ల ఎకరాలు ఉన్నట్టు తేలింది. ఈ ఖాతాలను ప్రామాణికంగా తీసుకొనే సాగు భూమికి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తారని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే చర్చ జరిగిందన్నారు. సొమ్ము ఎలా ఇద్దాం? రైతులకు పెట్టుబడి పథకం కింద ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే దీన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్టుబడి సొమ్మును రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై సీఎం కార్యాలయం కసరత్తు చేసింది. చెక్కుల ద్వారా ఇస్తేనే బాగుంటుందన్న భావన ఆ సమావేశంలో వ్యక్తమైంది. ఇదే అంశంపై చర్చించేందుకు మంత్రి పోచారం శనివారం వాణిజ్య, సహకార బ్యాంకులు, పోస్టల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకుల ద్వారా అందజేస్తే రైతు రుణ పెండింగ్ బకాయిల్లో కలుపుకుంటాయన్న భావన ఉంది. దీంతో చెక్కులు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. మరోవైపు దాదాపు ప్రతీ గ్రామంలోనూ పోస్టాఫీసులు ఉన్నందున పోస్టల్ ఖాతాను రైతులందరూ తీసుకుంటే దాని ద్వారా సరఫరా చేయడం సులువన్న చర్చ కూడా జరిగింది. అలాగే దీనిపై నేరుగా రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి పోచారం సాయంత్రం నల్లగొండ జిల్లాకు వెళ్లి రైతులతో చర్చించారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ఇదే తరహా రైతు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సాగు భూములను గుర్తించేదెలా? మరోవైపు సాగుచేస్తున్న భూములను గుర్తించడం ఎలా అన్న దానిపైనా చర్చిస్తున్నారు. అనేక కారణాలతో రైతులు కొంత భూమిని సాగు చేయకుండా వదిలేసే అవకాశముంది. రబీలో చాలా వరకు భూమి ఖాళీగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగు భూమిని గుర్తించి పెట్టుబడి పథకాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. సాగు చేయకుండా పెట్టుబడి పథకం కింద డబ్బులు తీసుకునే పరిస్థితి ఏర్పడితే పథకం లక్ష్యం నీరుగారుతుందని భావిస్తున్నారు. అందువల్ల పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ ఉపసంఘం భేటీ పెట్టుబడి సొమ్మును ఎలా అమలుచేయాలన్న దానిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమ లేదా మంగళవారాల్లో సమావేశం కానుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, రైతులు, ఇతర వ్యవసాయ నిపుణులతో చర్చించాక అందులో వచ్చే అభిప్రాయాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. దీనిపై ఎక్కువ సమయం తీసుకోకుండా మొదటి సమావేశంలోనే పెట్టుబడి అమలు తీరుపై మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముంది. ఆ మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి నివేదిస్తారు. ఆ మార్గదర్శకాలను సీఎం అధ్యయనం చేశాక మార్పులు చేర్పులు చేసి జీవో ఇస్తారని తెలిసింది. -
సగం మందికి నో గ్యాస్
♦ ఇంటిగ్రేటెడ్ సర్వేలో గుర్తింపు ♦ జిల్లాలో 5.50 లక్షల కార్డుదారులకే గ్యాస్ ♦ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు ♦ మార్చి 31లోగా 1.50 లక్షల దీపం కనెక్షన్లు ♦ నెలకు 25 వేల కనెక్షన్ల పంపిణీకి చర్యలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో అల్పాదాయ వర్గాల(బీపీఎల్)కు చెందిన వారిలో సగం మందికి గ్యాస్ కనెక్షన్ లేదని లెక్కతేల్చారు. వీరిలో అర్హులను గుర్తించి దీపం పథకంలో కొత్త కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టారు. నెలకు కనీసం 25వేల కనెక్షన్ల చొప్పున 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీపీఎల్ కార్డు కలిగి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినట్టే. ఏజెన్సీలో 43,978 మందికే గ్యాస్ ఇంటిగ్రేటెడ్ సర్వే మేనేజ్మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ వద్ద ఉన్న గణాంకాలను బట్టి జిల్లాలో 10,85,573 బీపీఎల్ కార్డుల్లో 5,49,595 కార్డుదారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 5,35,978 కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్ లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిలో అత్యధికం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నారు. ఏజెన్సీలో 2,19,092 కార్డుదారులుంటే వారిలో కేవలం 43,978 మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కార్డు తీసుకునేటప్పుడు, ఆ తర్వాత డీలర్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం లెక్కతేలిన ఈ జాబితాపై నిగ్గు తేల్చేందుకు ఇంటింటా సర్వే జరపాలని ఇప్పటికే తహశీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గ్యాస్ కనెక్షన్లు లేని వారిలో ఎవరైనా ఈ మధ్యకాలంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంతలేదనుకున్నా మరో నాలుగు లక్షలకుపైగా గా్యస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనా. బీపీఎల్ కార్డుదారులందరికీ గ్యాస్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సర్కారు తొలి విడతగా జిల్లాకు 1.50 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన 33 వేల కనెక్షన్లు ఇంకా పంపిణీ జరగకపోవడంతో వాటితో సహా 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు గ్యాస్ కంపెనీలకు సబ్సిడీమొత్తాన్ని సర్కార్ జమ చేసిందంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రమేయం లేకుండా గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కార్డుదారులందరికీ దీపం కనెక్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామని రూరల్ డీఎస్ఓ శాంతకుమారి తెలిపారు. -
స్థానిక ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ పాఠాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ మూడు రోజులపాటు రాజధానిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకరోజు శిక్షణను ఒకేసారి ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ, సీఎం మాత్రం మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలని.. అందులో ఒకరోజు మొత్తం తానే శిక్షణ ఇస్తానని వారికి వివరించారు. అయితే, ఈనెల 22 తర్వాత శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 51.05 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ సమగ్ర సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు 51,05,072 కుటుంబాల వివరాలను కంప్యూటరీకరణ పూర్తయిందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ వివరించారు. ఈనెల 11వ తేదీలోగా ఈ కంప్యూటర్లలో డేటా నిక్షిప్తం చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన వివరించారు. -
హమ్మయ్య!
►ఊపిరి పీల్చుకున్న జనం ►సమగ్ర సర్వే విజయవంతం ►88.79% కుటుంబాల నమోదు ►సిరిసిల్లలో అప్పులపై ఆందోళన ►రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సర్వే పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 8 గంటల వరకు జిల్లాలో 88.79 శాతం సర్వే పూర్తయినట్లు కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. అప్పటికే దాదాపు 45 మండలాల్లో 95 శాతం సర్వే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,12,724 కుటుంబాలుంటే 10,76,729 కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి పదకొండు గంటల వరకు అక్కడక్కడ సర్వే కొనసాగింది. ఎన్యూమరేటర్లు డుమ్మా కొట్టడం, ఫారాల కొరతతో చాలాచోట్ల సర్వే ఆలస్యంగా మొదలైంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 400 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాకపోవటంతో అధికారులు హడావుడి పడ్డారు. ప్రైవేటు కాలేజీల విద్యార్థులను సైతం రంగంలోకి దింపి మధ్యాహ్నం నుంచి సర్వే మొదలు పెట్టించారు. జగిత్యాల పట్టణంలో దాదాపు 500 ఇళ్లు సర్వేలో గల్లంతైనట్లు ఆలస్యంగా గుర్తించారు. అప్పటికప్పుడు అదనంగా ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపి సర్వేను మొదలుపెట్టారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా అక్కడ సర్వేను పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పదకొండు గంటల వరకు అక్కడ సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న సర్వేలో అప్పుల వివరాలు సైతం నమోదు చేసుకోవాలని సిరిసిల్లలో దళితులు ఆందోళనకు దిగడంతో సర్వే రెండు గంటలపాటు నిలిచిపోయింది. సంజీవయ్యనగర్‌లో ఎన్యూమరేటర్లను అడ్డుకోవటంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కుటుంబ స్థితిగతుల కాలమ్‌లో అప్పుల వివరాల నమోదుకు అధికారులు అంగీకరించి.. ఎన్యూమరేటర్లకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయటంతో ఆందోళన సద్దుమణిగింది. -
అంతా సిద్ధం
సాక్షి, కరీంనగర్ : సమగ్ర సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులాలు, ఆర్థిక, సామాజిక, సమగ్ర జనాభా లెక్కింపు సమాచార సేకరణ కోసం ఈ నెల 19న చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతం చేసేందుకు విస్తృత ప్రచారం చేసిన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివరాలను కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా ఎస్పీ శివకుమార్ ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో వివరించారు. నియోజకవర్గానికి, మండలానికి ఒకరి చొప్పున ప్రత్యేకాధికారులను నియమించామని, సందేహాలుంటే వారిని సంప్రదించాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే ఉండి సమాచారం కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు వాస్తవ వివరాలతో సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 30 కుటుంబాల సర్వే బాధ్యతలిచ్చామని పేర్కొన్నారు. ఎ న్యూమరేటర్లు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయా తహశీల్దార్ కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాలని, వారికి అక్కడ ఒక రోజు ముందే సర్వే ఫారాలు అందజేస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు ఎన్యూమరేటర్లు తాము సర్వే నిర్వహించే ప్రాంతాల్లో పర్యటించి.. మరుసటి రోజు ఉద యం 7 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రజలు చెప్పిందే రాసుకోకుండా.. ఇల్లు, పరిసర పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని వాస్తవ వివరాలు నమోదు చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. పూర్తి చేసిన సర్వే ఫారాలు సంబంధిత, గ్రామ పంచాయతీ, తహశీల్దార్ కార్యాలయాల్లో అప్పజెప్పాలన్నారు. సర్వే సమాచారాన్ని 20 నుంచి 26వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తామని చెప్పారు. ఇం దుకోసం జిల్లావ్యాప్తంగా 3 వేల కంప్యూటర్లు.. అంతే మంది ఆపరేటర్లను నియమించినట్లు వివరించారు. సర్వే సిబ్బంది ని తరలించేందుకు.. 200 ఆర్టీసీ, 446 ప్రైవేట్ మినీ బస్సులు, 569 జీపులు, ఇతర వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శివకుమార్ చెప్పారు. 3500 మంది పోలీసు సి బ్బంది ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని, పెట్రోలింగ్ కోసం 200 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. టోల్‌ఫ్రీ సర్వేపై సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 18004254731 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు నిరంతరం ఈ నంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఏ అనుమానమున్నా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. వాస్తవాలే చెప్పండి *సిబ్బందికి వాస్తవాలే చెప్పాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఒకే పొయ్యి మీద వండుకున్నా.. వారిని ఒకే కుటుంబంగా గుర్తిస్తామన్నారు. * ఇంటికి నోషనల్ నంబర్ కేటాయింపు సమయంలో అందుబాటులో లేనివారు ప్రస్తుతం ఇంట్లో ఉంటే వారికీ నోషనల్ నంబర్ కేటాయించి, వివరాలు సేకరిస్తారు. * గుడిసెలకూ నోషనల్ నంబర్లు కేటాయించనున్నారు. సర్వం బంద్ సర్వే రోజు సర్వం బంద్ కానుంది. సిబ్బంది కోసం అందుబాటులో ఉంచిన బస్సులు, ప్రైవేట్ వాహనాలు మినహా ఏ వాహనాలూ రోడ్లపై తిరగవు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవే ట్ కార్యాలయాలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ఫ్యాక్టరీలన్నీ మూతబడనున్నాయి. ప్రభుత్వం సెలవు ప్రకటిం చడంతో ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే.. కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య హెచ్చరించారు. -
సర్పంచులపై ‘సర్వే’ భారం
మోర్తాడ్ : సంక్షేమ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వే పారదర్శకంగా సాగే సూచనలు కనిపించడం లేదు. చిన్న చిన్న లొసుగుల కారణంగా సర్వేకు గ్రామ స్థాయిలో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమగ్ర సర్వే నిర్వహణ కోసం జిల్లాకు 2 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సర్వే నిర్వహణ కోసం ఎన్యుమరేటర్ల ఎంపిక, సూపర్వైజింగ్ అధికారులు ఎంపిక పూర్తి కాగా తొలి విడత శిక్షణ ముగిసింది. రెండో విడత శిక్షణ ఆదివారం సాగనుంది. కాగా గ్రామాల్లోకి వచ్చే సర్వే ప్రతినిధులకు భోజనం, టిఫిన్, టీ సదుపాయాలను సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కల్పించాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన అధికారులు సర్వే ప్రతినిధులకు కల్పించాల్సిన సదుపాయాలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వం కోసం నిర్వహించే సర్వేకు తాము ఎందుకు ఖర్చులు భరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ 30 ఇళ్లలోని ప్రజల సమాచారం సేకరించాల్సి ఉంది. గ్రామంలోని ఇళ్ల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్ల కేటాయింపు జరుగుతుంది. మేజర్ పంచాయతీలు అయితే ఒక పంచాయతీ పరిధిలో 50 నుంచి 150 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో పాల్గొననున్నారు. చిన్న పంచాయతీలు అయితే ఒక పంచాయతీలో 30 నుంచి 80 మంది వరకు సర్వే నిర్వహించనున్నారు. ఒక పూట భోజన సదుపాయానికి *మూడు వేల నుంచి *10 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎన్యుమరేటర్లు టిఫిన్ సొంతంగా సమకూర్చుకున్నా భోజనానికి స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ‘సౌకర్యం మాటున సర్వేపై పెత్తనం’ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా సదుపాయాల పేరుతో సర్వేపై ప్రజాప్రతినిధులు పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు సర్వే ప్రతినిధులను తమ గుప్పిట్లో ఉంచుకుని తమ వారి కోసం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాయించే అవకాశం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలకు అధికారులు నిధులను కేటాయించి భోజన సదుపాయాన్ని కల్పిస్తే సర్వేలో ఎవరి జోక్యం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా భోజన సదుపాయానికి ప్రజాప్రతినిధులు సొంతంగా నిధులు కేటాయించాలని అధికారులు సూచించడం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్వే సర్కార్ కోసం అయినప్పుడు సర్కార్ ద్వారానే భోజన సదుపాయం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచ్‌లపై సర్వే భారంను తొలిగించి సర్వే పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.