మోర్తాడ్ : సంక్షేమ పథకాలు అర్హులకే అందాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వే పారదర్శకంగా సాగే సూచనలు కనిపించడం లేదు. చిన్న చిన్న లొసుగుల కారణంగా సర్వేకు గ్రామ స్థాయిలో ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సమగ్ర సర్వే నిర్వహణ కోసం జిల్లాకు 2 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సర్వే నిర్వహణ కోసం ఎన్యుమరేటర్‌ల ఎంపిక, సూపర్‌వైజింగ్ అధికారులు ఎంపిక పూర్తి కాగా తొలి విడత శిక్షణ ముగిసింది. రెండో విడత శిక్షణ ఆదివారం సాగనుంది. కాగా గ్రామాల్లోకి వచ్చే సర్వే ప్రతినిధులకు భోజనం, టిఫిన్, టీ సదుపాయాలను సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు కల్పించాలని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన అధికారులు సర్వే ప్రతినిధులకు కల్పించాల్సిన సదుపాయాలపై తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రభుత్వం కోసం నిర్వహించే సర్వేకు తాము ఎందుకు ఖర్చులు భరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ 30 ఇళ్లలోని ప్రజల సమాచారం సేకరించాల్సి ఉంది. గ్రామంలోని ఇళ్ల సంఖ్యను బట్టి ఎన్యుమరేటర్‌ల కేటాయింపు జరుగుతుంది.
మేజర్ పంచాయతీలు అయితే ఒక పంచాయతీ పరిధిలో 50 నుంచి 150 మంది ఎన్యుమరేటర్‌లు సర్వేలో పాల్గొననున్నారు. చిన్న పంచాయతీలు అయితే ఒక పంచాయతీలో 30 నుంచి 80 మంది వరకు సర్వే నిర్వహించనున్నారు. ఒక పూట భోజన సదుపాయానికి *మూడు వేల నుంచి *10 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎన్యుమరేటర్‌లు టిఫిన్ సొంతంగా సమకూర్చుకున్నా భోజనానికి స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
‘సౌకర్యం మాటున సర్వేపై పెత్తనం’
సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నా సదుపాయాల పేరుతో సర్వేపై ప్రజాప్రతినిధులు పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు సర్వే ప్రతినిధులను తమ గుప్పిట్లో ఉంచుకుని తమ వారి కోసం ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాయించే అవకాశం కనిపిస్తుంది. గ్రామ పంచాయతీలకు అధికారులు నిధులను కేటాయించి భోజన సదుపాయాన్ని కల్పిస్తే సర్వేలో ఎవరి జోక్యం ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా భోజన సదుపాయానికి ప్రజాప్రతినిధులు సొంతంగా నిధులు కేటాయించాలని అధికారులు సూచించడం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. సర్వే సర్కార్ కోసం అయినప్పుడు సర్కార్ ద్వారానే భోజన సదుపాయం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్పంచ్‌లపై సర్వే భారంను తొలిగించి సర్వే పారదర్శకంగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
సర్పంచులపై ‘సర్వే’ భారం
Published Sun, Aug 17 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement