సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో రైతులెందరు..? ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 55.53 లక్షలు! కానీ వ్యవసాయ శాఖ ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వేలో తేలిన రైతుల సంఖ్య 45.33 లక్షలు!! మరి రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెట్టుబడి సాయం పథకానికి ఏ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలి? ఇప్పటిదాకా ఇదో చిక్కుప్రశ్న. ప్రస్తుతం దీనిపై స్పష్టత వచ్చింది. పెట్టుబడి సాయం పథకానికి రైతుల సంఖ్యను కాకుండా రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ భూమిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. ఈ మేరకు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో తేలిన 1.42 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఆ భూముల కింద రైతులకు 71.75 లక్షల వ్యవసాయ ఖాతాలున్నాయి. ఈ ఖాతాల ప్రకారమే ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేయనుంది. ఒక్కో రైతుకు ఒకటికి మించి ఖాతాలు ఉండే అవకాశం ఉన్నందున రైతుల సంఖ్యకు, ఖాతాల సంఖ్యకు మధ్య భారీ తేడా కనిపిస్తోందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఉదాహరణకు ఒక రైతుకు ఒక రెవెన్యూ గ్రామంలో రెండెకరాలు, మరో రెవెన్యూ గ్రామంలో మరో ఐదెకరాలు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆ రైతుకు రెండు వ్యవసాయ ఖాతాలుంటాయి. పథకాన్ని అమలు చేస్తే ఇలాంటి రైతులకు రెండు ఖాతాల్లో వేర్వేరుగా ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. భూముల రికార్డుల ప్రక్షాళనలో అధికారులు నిక్కచ్చిగా వ్యవసాయ భూముల వివరాలను ఓ ఖాతాలో రాశారు. వ్యవసాయేతర భూమి ఉంటే దాన్ని మరో ఖాతాలో చూపారు. ఇలా వ్యవసాయ ఖాతాల్లో పేర్కొన్న భూమి 1.42 కోట్ల ఎకరాలు ఉన్నట్టు తేలింది. ఈ ఖాతాలను ప్రామాణికంగా తీసుకొనే సాగు భూమికి పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తారని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. సీఎంతో జరిగిన సమావేశంలోనూ ఇదే చర్చ జరిగిందన్నారు.
సొమ్ము ఎలా ఇద్దాం?
రైతులకు పెట్టుబడి పథకం కింద ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.4 వేలు ఇచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే దీన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెట్టుబడి సొమ్మును రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై సీఎం కార్యాలయం కసరత్తు చేసింది. చెక్కుల ద్వారా ఇస్తేనే బాగుంటుందన్న భావన ఆ సమావేశంలో వ్యక్తమైంది. ఇదే అంశంపై చర్చించేందుకు మంత్రి పోచారం శనివారం వాణిజ్య, సహకార బ్యాంకులు, పోస్టల్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకుల ద్వారా అందజేస్తే రైతు రుణ పెండింగ్ బకాయిల్లో కలుపుకుంటాయన్న భావన ఉంది. దీంతో చెక్కులు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది. మరోవైపు దాదాపు ప్రతీ గ్రామంలోనూ పోస్టాఫీసులు ఉన్నందున పోస్టల్ ఖాతాను రైతులందరూ తీసుకుంటే దాని ద్వారా సరఫరా చేయడం సులువన్న చర్చ కూడా జరిగింది. అలాగే దీనిపై నేరుగా రైతుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి పోచారం సాయంత్రం నల్లగొండ జిల్లాకు వెళ్లి రైతులతో చర్చించారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా ఇదే తరహా రైతు అభిప్రాయాలు తీసుకుంటున్నారు.
సాగు భూములను గుర్తించేదెలా?
మరోవైపు సాగుచేస్తున్న భూములను గుర్తించడం ఎలా అన్న దానిపైనా చర్చిస్తున్నారు. అనేక కారణాలతో రైతులు కొంత భూమిని సాగు చేయకుండా వదిలేసే అవకాశముంది. రబీలో చాలా వరకు భూమి ఖాళీగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగు భూమిని గుర్తించి పెట్టుబడి పథకాన్ని ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. సాగు చేయకుండా పెట్టుబడి పథకం కింద డబ్బులు తీసుకునే పరిస్థితి ఏర్పడితే పథకం లక్ష్యం నీరుగారుతుందని భావిస్తున్నారు. అందువల్ల పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ ఉపసంఘం భేటీ
పెట్టుబడి సొమ్మును ఎలా అమలుచేయాలన్న దానిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమ లేదా మంగళవారాల్లో సమావేశం కానుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకులు, పోస్టాఫీసులు, రైతులు, ఇతర వ్యవసాయ నిపుణులతో చర్చించాక అందులో వచ్చే అభిప్రాయాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది. దీనిపై ఎక్కువ సమయం తీసుకోకుండా మొదటి సమావేశంలోనే పెట్టుబడి అమలు తీరుపై మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముంది. ఆ మార్గదర్శకాలను ముఖ్యమంత్రికి నివేదిస్తారు. ఆ మార్గదర్శకాలను సీఎం అధ్యయనం చేశాక మార్పులు చేర్పులు చేసి జీవో ఇస్తారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment