హైకోర్టు, వివిధ కోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదుల నియామక వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించినట్టు తెలిసింది.
హైదరాబాద్: హైకోర్టు, వివిధ కోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదుల నియామక వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ న్యాయవాదుల (జీపీల) నియామకాల్లో పార్టీ నేతలు, మంత్రులు, న్యాయవాదుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నందున ఆ వ్యవహారాన్ని తానే పర్యవేక్షించడం మేలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డికి తెలిపారు. దీనికి ఏజీ రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ జె.రామచంద్రరావులు ఏ మాత్రం అభ్యంతరం లేదన్నారు.
పదిశాతం వాటా కోరుతున్న రంగారెడ్డి లాయర్లు...
ఇదిలా ఉండగా, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తమకు 10 శాతం పోస్టులు ఇవ్వాలని రంగారెడ్డి కోర్టుకు చెందిన న్యాయవాదులు పట్టుబడుతున్నారు. హైకోర్టులో జరిగిన ఉద్యమాల్లో ముందుండి పాల్గొన్నది తామేనని, అందువల్ల తమకు అగ్ర తాంబూలం ఇవ్వకతప్పదని వారు కోరుతున్నారు.