Government lawyers
-
హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం
సాక్షి, అమరావతి: హైకోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకుగాను పలువురిని ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), ప్రభుత్వ సహాయ న్యాయవాదులు(ఏజీపీ)గా నియమిస్తూ అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జీపీగా నియమితులైన వారిలో గోడ రాజాబాబు, ఎల్వీఎస్ నాగరాజు, టీఎంకే చైతన్య, వేగి కొండయ్య నాయుడు, జీఎల్.నర్సింహారెడ్డి ఉన్నారు. వీరిలో టీఎంకే చైతన్య సీఐడీ స్టాండింగ్ కౌన్సిల్‌గా, రాజాబాబు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. జీఎల్ నర్సింహారెడ్డి ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేయగా, ఆయనకు ఇప్పుడు జీపీ పోస్టు ఇచ్చారు. ఏజీపీలుగా నియమితులైన వారిలో కుంచె ఆనందరావు, బొల్లవరపు సత్యేంద్ర మణికుమార్, గటల రాజశ్రీ, టి.రాధారాణి, కరగంజి హేమంత్ కుమార్, వై.సుబ్బారావు, బి.ధరణీ కుమార్, షేక్ ఆసిఫ్, తాయి లక్ష్మీ పద్మజ, జి. ప్రశాంతి, విశ్వనాధ శక్తిధార్, వేలూరి భరత్ సురేందర్‌రెడ్డి ఉన్నారు. వీరు మూడేళ్ల పాటు ఆయా పోస్టుల్లో కొనసాగుతారు. జీపీలకు నెలకు రూ.1 లక్ష, ఏజీపీలకు రూ.44 వేలు గౌరవ వేతనంగా చెల్లిస్తారు. కాగా, జీపీలకు శాఖలను కేటాయిస్తూ ఏజీ ఎస్.శ్రీరామ్ బుధవారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ, హోం శాఖలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు చెందిన హోం శాఖ కేసులను మహేశ్వర్‌రెడ్డికి, మరికొన్ని జిల్లాలను చైతన్యకు అప్పగించారు. రెవెన్యూ అసైన్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆంధ్ర ప్రాంతం నాగేశ్వరరావుకు, రాయలసీమ ప్రాంతాన్ని నర్సింహారెడ్డికి కేటాయించారు. రెవెన్యూ జనరల్ ఆంధ్ర ప్రాంతాన్ని సుభాష్‌కు, రాయలసీమ ప్రాంతాన్ని బాలస్వామికి అప్పగించారు. వేగి కొండయ్యనాయుడికి వ్యవసాయం, సహకార శాఖ, రాజాబాబుకు గ్రామ, వార్డు సచివాలయాలు, నాగరాజుకు పాఠశాల విద్యాశాఖను కేటాయించారు. -
అభ్యర్థిస్తే బెదిరించినట్లా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ గత కొద్ది రోజులుగా జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం జరుపుతున్న విచారణలో బుధవారం కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. గత విచారణ సందర్భంగా తనను బెదిరించారంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆరోపించడంపై ప్రభుత్వ న్యాయవాదులు చింతల సుమన్, వైఎన్ వివేకానంద, స్పెషల్ సీనియర్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పలు అభ్యర్థనలతో పిటిషన్లు దాఖలు చేయడం, కేసును వాయిదా వేయాలని కోరడం వంటి వాటిని బెదిరింపులని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వాస్తవానికి కోర్టు ద్వారా తామే బెదిరింపులకు గురవుతున్నామని తెలిపారు. సత్యనారాయణ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. సోమవారం నాటి విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) విషయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహరించిన తీరును ఎత్తిచూపారు. ఏజీ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించలేదని, వాదనలు వినిపించేందుకు, కోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు సైతం ఆయనను అనుమతించలేదని, దీనిని అందరూ గమనించారని వివరించారు. న్యాయమూర్తులు మౌఖికంగా గానీ, తీర్పుల్లో గానీ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయరాదని, అలాగే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓ కేసు విచారణకు నిర్ధిష్టమైన విధి విధానాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా తమకు కౌంటర్ దాఖలుకు, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు, స్పెషల్ కౌన్సిల్ గట్టిగా చెప్పారు. వీరి వాదనతో ఒకింత వెనక్కి తగ్గిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. ఈ అంశం నుంచి వాదనలను మళ్లించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. చివరకు విచారణను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై విచారణ జరిపే పరిధి లేదని, అందువల్ల ఆ అంశంపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్న తమ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అందువల్ల విచారణను 21వ తేదీకి వాయిదా వేయాలన్న స్పెషల్ కౌన్సిల్ అభ్యర్థనను జస్టిస్ రాకేశ్ కుమార్ తోసిపుచ్చారు. కేసు వాయిదా కోసం పలుమార్లు సత్యనారాయణ ప్రసాద్ అభ్యర్థనలు చేస్తుండటంతో, కోర్టు ప్రొసీడింగ్స్‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. కౌంటర్ దాఖలుకు అనుమతినివ్వని విషయాన్ని రికార్డ్ చేయాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఈ కోర్టు సహజ న్యాయ సూత్రాలను అను సరించలేదన్నారు. దీంతో ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ నెల 14న తామిచ్చిన ఉత్తర్వుల కాపీని ప్రభుత్వానికి అందచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సుమోటోగా విచారిస్తున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం పోలీసులు చేసిన అరెస్టులపై పలువురు వ్యక్తులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని ప్రాంతంలో ఇతరులెవ్వరూ పోటీగా నిరసనలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామని తెలిపింది. వాస్తవానికి ఏ పిటిషనర్ కూడా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని కోర్టును కోరకపోయినా.. జస్టిస్ రాకేశ్ కుమారే సుమోటోగా తీసుకుని ఆ విషయాన్ని తేలుస్తామంటూ విచారణ మొదలుపెట్టారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే, తమ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు స్టే ఇస్తే మొత్తం విచారణ నిలిచిపోతుందని, అయితే సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు లేనందున విచారణ కొనసాగిస్తామని తెలిపారు. -
విచారణలకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా విషయంలో కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులను కట్టడి చేసే దిశగా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు ప్రారంభించింది. కోర్టుల విధులకు ఆటంకం కలగకుండా కార్యకలాపాలు సజావుగా సాగిపోయేందుకు వీలుగా పలు చర్యలు చేపట్టింది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు మొదలుకుని ఆందోళనలు చేస్తున్న లాయర్లకు సహాయ సహకారాలు అందకుండా చేసేందుకు అడ్వకేట్ జనరల్‌కు కూడా స్పష్టమైన సూచనలు చేసింది. కోర్టుల్లో కేసుల విచారణకు విధిగా హాజరువాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్స్ కౌన్సిల్స్ అందరికీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రెండు రోజుల క్రితం ఓ మెమో జారీ చేశారు. దానిపై తక్షణమే స్పందించిన ఏజీ, ఈ విషయాన్ని హైకోర్టులోని ప్రభుత్వ న్యాయవాదులందరికీ రాతపూర్వకంగా తెలియచేశారు. కింది కోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారులందరికీ అవసరమైతే సాయుధ రక్షణ కల్పించైనా కోర్టు కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ మెమోలో పోలీసులకు స్పష్టం చేసింది. విచారణ జాబితాలో పేరున్న లాయర్లనే కోర్టుల్లోకి అనుమతించేలా చూడాలంది. ‘‘కోర్టుల ప్రాంగణంలో, కోర్టు హాళ్లలో ఊరేగింపుల వంటివి చేసిన, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. తోటి న్యాయవాదులు వాదనలు విన్పించకుండా అడ్డుకునే, కోర్టు హాళ్లలో, ప్రాంగణాల్లో డ్రమ్ములు వాయించే, నినాదాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించింది. అవసరమైన ప్రతి చోటా వీడియో, వాయిస్ రికార్డింగ్ చేయాలని, కెమెరాలూ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. దీనిపై పోలీసులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలిస్తూ ఉండాలని డీజీపీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తూచా తప్పకుండా అమలు చేయాలంది. తీసుకున్న చర్యలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆందోళనకారుల కట్టడికి నిన్నటిదాకా హైకోర్టే పాలనాపరంగా పలు చర్యలు తీసుకోగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా రంగంలోకి దిగి ఇలా ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమో ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రార్ జనరల్ లేఖతో కదిలిన ప్రభుత్వం లాయర్లు ఈ నెల 6 నుంచి అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో విధుల బహిష్కరణ చేపట్టడం తెలిసిందే. ఈ నెల 13న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యవహరించడాన్ని, ముఖ్యంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు, ఆయన చాంబర్ ముందు బైఠాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హైకోర్టుతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నెలకొన్న పరిస్థితులను, కక్షిదారుల ఇబ్బం దులను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ నెల 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాయర్లకు సమ్మె చేసే హక్కు లేదని, విధులను అడ్డుకోవడానికి కూడా వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని సీఎస్‌కు గుర్తు చేశారు.‘‘లాయర్లు దూకుడుగా వ్యవహరిస్తూ, గేట్లకు, కోర్టు హాళ్లకు తాళాలు వేస్తున్నారు. పలువురు న్యాయాధికారులను, ముఖ్యంగా మహిళా న్యాయాధికారులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. కక్షిదారులనూ విడిచిపెట్టడం లేదు’’ అని వివరించారు. ఈ లేఖ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ఆందోళనకారుల కట్టడికి చర్యలు ప్రారంభించింది. -
జీపీల సంగతి నాకొదిలేయండి: కేసీఆర్
హైదరాబాద్: హైకోర్టు, వివిధ కోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే న్యాయవాదుల నియామక వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ న్యాయవాదుల (జీపీల) నియామకాల్లో పార్టీ నేతలు, మంత్రులు, న్యాయవాదుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నందున ఆ వ్యవహారాన్ని తానే పర్యవేక్షించడం మేలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. ఈ విషయాన్ని ఇటీవల అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కొండం రామకృష్ణారెడ్డికి తెలిపారు. దీనికి ఏజీ రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ జె.రామచంద్రరావులు ఏ మాత్రం అభ్యంతరం లేదన్నారు. పదిశాతం వాటా కోరుతున్న రంగారెడ్డి లాయర్లు... ఇదిలా ఉండగా, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తమకు 10 శాతం పోస్టులు ఇవ్వాలని రంగారెడ్డి కోర్టుకు చెందిన న్యాయవాదులు పట్టుబడుతున్నారు. హైకోర్టులో జరిగిన ఉద్యమాల్లో ముందుండి పాల్గొన్నది తామేనని, అందువల్ల తమకు అగ్ర తాంబూలం ఇవ్వకతప్పదని వారు కోరుతున్నారు.