సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ గత కొద్ది రోజులుగా జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం జరుపుతున్న విచారణలో బుధవారం కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. గత విచారణ సందర్భంగా తనను బెదిరించారంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆరోపించడంపై ప్రభుత్వ న్యాయవాదులు చింతల సుమన్, వైఎన్ వివేకానంద, స్పెషల్ సీనియర్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పలు అభ్యర్థనలతో పిటిషన్లు దాఖలు చేయడం, కేసును వాయిదా వేయాలని కోరడం వంటి వాటిని బెదిరింపులని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వాస్తవానికి కోర్టు ద్వారా తామే బెదిరింపులకు గురవుతున్నామని తెలిపారు. సత్యనారాయణ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. సోమవారం నాటి విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) విషయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహరించిన తీరును ఎత్తిచూపారు. ఏజీ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించలేదని, వాదనలు వినిపించేందుకు, కోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు సైతం ఆయనను అనుమతించలేదని, దీనిని అందరూ గమనించారని వివరించారు.
న్యాయమూర్తులు మౌఖికంగా గానీ, తీర్పుల్లో గానీ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయరాదని, అలాగే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓ కేసు విచారణకు నిర్ధిష్టమైన విధి విధానాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా తమకు కౌంటర్ దాఖలుకు, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు, స్పెషల్ కౌన్సిల్ గట్టిగా చెప్పారు. వీరి వాదనతో ఒకింత వెనక్కి తగ్గిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. ఈ అంశం నుంచి వాదనలను మళ్లించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. చివరకు విచారణను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై విచారణ జరిపే పరిధి లేదని, అందువల్ల ఆ అంశంపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్న తమ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అందువల్ల విచారణను 21వ తేదీకి వాయిదా వేయాలన్న స్పెషల్ కౌన్సిల్ అభ్యర్థనను జస్టిస్ రాకేశ్ కుమార్ తోసిపుచ్చారు.
కేసు వాయిదా కోసం పలుమార్లు సత్యనారాయణ ప్రసాద్ అభ్యర్థనలు చేస్తుండటంతో, కోర్టు ప్రొసీడింగ్స్‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. కౌంటర్ దాఖలుకు అనుమతినివ్వని విషయాన్ని రికార్డ్ చేయాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఈ కోర్టు సహజ న్యాయ సూత్రాలను అను సరించలేదన్నారు. దీంతో ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ నెల 14న తామిచ్చిన ఉత్తర్వుల కాపీని ప్రభుత్వానికి అందచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.
సుమోటోగా విచారిస్తున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం
పోలీసులు చేసిన అరెస్టులపై పలువురు వ్యక్తులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని ప్రాంతంలో ఇతరులెవ్వరూ పోటీగా నిరసనలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామని తెలిపింది. వాస్తవానికి ఏ పిటిషనర్ కూడా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని కోర్టును కోరకపోయినా.. జస్టిస్ రాకేశ్ కుమారే సుమోటోగా తీసుకుని ఆ విషయాన్ని తేలుస్తామంటూ విచారణ మొదలుపెట్టారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే, తమ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు స్టే ఇస్తే మొత్తం విచారణ నిలిచిపోతుందని, అయితే సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు లేనందున విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
అభ్యర్థిస్తే బెదిరించినట్లా?
Published Thu, Dec 17 2020 3:52 AM | Last Updated on Thu, Dec 17 2020 11:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment