ఒకేరోజు ‘త్రీ స్టార్స్’
- నేడు జిల్లాకు రానున్న కేసీఆర్, జైరాం రమేష్, ఏచూరి
- హెలికాప్టర్‌లో సుడిగాలి పర్యటన చేయనున్న గులాబీ బాస్
- మధిర, ఖమ్మంలో జైరాం.. మధిర, భద్రాచలంలో సీతారాం
సాక్షి, ఖమ్మం: జిల్లాలో రాజకీయ ప్రచారం వేడెక్కింది. పార్టీల అగ్రనేతలను రప్పించి ప్రచార జోరు పెంచేందుకు అన్ని పార్టీలు సై అంటున్నాయి. మంగళవారం ఒక్కరోజే మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు స్టార్ క్యాంపెయినర్లు జిల్లాకు రానున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి, కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి జైరాం రమేష్ జిల్లాలో నేడు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న పార్టీలు అగ్రనేతలు వస్తుండడంతో వారి ప్రచార పర్యటనను విజయవంతం చేయడంలో నిమగ్నమయ్యాయి.
నాలుగు చోట్ల ‘గులాబీ’ సభలు..
జిల్లాలో టీఆర్‌ఎస్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. చాలా కాలం తర్వాత గులాబీ దళపతి కేసీఆర్ జిల్లాకు వస్తుండడం, ఆ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగడంతో.. శ్రేణులంతా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందులో కేసీఆర్ సభలకు నేతలు ఏర్పాట్లు చేశారు. అలాగే కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు ప్రచారానికి చరిష్మా ఉన్న నాయకుడు లేకపోవడంతో చివరకు కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను తెలంగాణలో ప్రచారానికి టీపీసీసీ రంగంలోకి దింపింది.
ఆయన జిల్లాలోని మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి మధిర, భద్రాచలంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారానికి ఆరు రోజులు మాత్రమే ఉండడంతో అన్ని పార్టీల అగ్రనేతలు తమ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
కేసీఆర్ టూర్ షెడ్యూల్ ఇలా..
మధ్యాహ్నం 3.20 గంటలకు హెలికాప్టర్ ద్వారా వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం చేరుకుంటారు. ఇక్కడ పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తారు.
సాయంత్రం 4 గంటలకు మణుగూరు చేరుకొని అక్కడ సభలో పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రం 5 గంటలకు ఇల్లెందు, 6 గంటలకు కొత్తగూడెం సభలలో ప్రసంగిస్తారు. అనంతరం కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం చేరుకొని ఇక్కడే రాత్రి బస చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
సీతారాం ఏచూరి పర్యటన ఇలా..
ఉదయం 8 గంటలకు మధిర చేరుకుం టారు. అక్కడ వైఎస్సార్‌సీపీ, సీపీఎం ఆ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధిర నియోకజవర్గ స్థాయి సెమినార్‌లో ప్రసంగిస్తారు.
ఆ తర్వాత భద్రాచలంలో ప్రచారంలో పాల్గొంటారు.
జైరాం రమేష్‌పర్యటన ఇలా..
సాయంత్రం 4 గంటలకు మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం నాగులవంచలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం 6 గంటలకు ఖమ్మం నగరంలో రోడ్ షో నిర్వహిస్తారు.