తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర శూన్యం
తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర శూన్యమని కేంద్ర మంత్రి జైరాం రమేష్ మండిపడ్డారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దొరల తెలంగాణ కావాలనుకునేవారే టీఆర్ఎస్కు ఓటేస్తారని, టీఆర్ఎస్ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదని ఆయన అన్నారు. సర్వప్రాంత, సర్వజన అభివృద్ధి తమతోనే సాధ్యమని తెలిపారు.
తెలంగాణను లోక్సభ, రాజ్యసభ కలిసి ఏర్పాటుచేశాయని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాత్ర కూడా ఇందులో ఏమీ లేదని జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇందుకు సంబంధించిన క్రెడిట్ దక్కాలని చెప్పారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదేనని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్సే రావాలని, ఉద్యమ లక్ష్యం నెరవేరాలంటే బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే ప్రభుత్వం రావాలని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ దొరల రాష్ట్ర సమితిగా మారిపోయింది. అది ఇక్కడ పాలనను ఏమాత్రం కొనసాగించలేదని అన్నారు.