సమరోత్సాహం
- కేసీఆర్ సుడిగాలి ప్రచారం... హెలికాప్టర్ ద్వారా పర్యటన
- ఒకే రోజు ఐదు సెగ్మెంట్లలో సభలు... అధిక సంఖ్యలో హాజరైన జనం
- గులాబీ బాస్ మాటల తూటాలు... ప్రత్యర్థులపై విమర్శల బాణాలు
- పిచ్చికూతలు మానుకోవాలని రాహుల్‌కు హితవు
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో ‘కారు’ రయ్.. రయ్ మంటూ దూసుకెళ్తోంది. గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సుడిగాలి పర్యటనతో ఓరుగల్లులో ప్రచారపర్వాన్ని వేడెక్కిం చారు. మంగళవారం ఒకే రోజు ఐదు శాసనసభ నియోజకవర్గాలను చుట్టేసి ప్రత్యర్థి పక్షాలకు అందనంత దూరంలో నిలిచారు. బహిరంగ సభలకు భారీగా జనం తరలిరావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులతోపాటు ఆ పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లిలో బహిరంగ సభ ప్రారంభం కాగా, ములుగు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడలో సాగింది. సాయం త్రం ఐదు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఖమ్మం జిల్లాలో ప్రచారానికి వెళ్లారు.
వ్యంగ్యాస్త్రాలు.. విమర్శలు
బహిరంగ సభల్లో కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధిం చారు. విమర్శలు వాడీ పెంచుతూ ప్రత్యర్థి పార్టీలపై దుమ్మెత్తిపోశారు. అదేసమయంలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యమం నడిపినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామంటూ వరాల వర్షం కురిపించారు.అసంతృప్తులకు అవకాశాలు ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ వారికి కేసీఆర్ భరోసా కల్పించారు. పరకాల టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని భూపాలపల్లి సభలో హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగుర్ల ఆనందంతో కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. ఇక మహబూబాబాద్ ఎంపీ టికెట్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామచంద్రుడికి ఇస్తారని భావించినప్పటికీ... ఆయన పోటీకి విముఖత చూపిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ సభలో ఆయన గురించి ప్రస్తావిస్తూ రామచంద్రుడికి రాజ్యసభ, ఎమ్మెల్సీల్లో ఏదో ఒక అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఇప్పటికే ఈ లైన్‌లో పరకాల సిట్టింగ్ ఎమ్మె ల్యే బిక్షపతి కూడా ఉన్న విషయం తెలిసిందే.
సరాసరి ప్రసంగంలోకి...
సభాస్థలికి సమీపంలోనే హెలికాప్టర్‌లో దిగిన ఆయన సరాసారి వేదికపైకి వెళ్లి ప్రజలకు అభివాదం చేసి... సరాసరి ప్రసంగంలోకి వెళ్లిపోయూరు. ఆయన ప్రసంగం 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే సాగింది. 40 నిమిషాల వ్యత్యాసంతోనే సభలు సాగారుు. తొలి సభ తర్వాత మలి సభలు కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో తన ప్రసంగ సమయూన్ని తగ్గించుకున్నారు. ఎక్కువ సభల్లో పాల్గొనడమే లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. జిల్లాలో ఇప్పటికే రెండు దశల్లో ప్రచారం చేపట్టిన కేసీఆర్ మూడో విడతగా మరోసారి ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది.