మాటల తోటమాలి
ప్రొఫైల్
పూర్తి పేరు: కల్వకుంట్ల చంద్రశేఖరరావు
సొంతూరు: చింతమడక, మెదక్ జిల్లా
పుట్టిన తేదీ: 17.2.1954
తండ్రిపేరు: రాఘవరావు
తోబుట్టువులు: ఒక అన్న, 9 మంది
అక్కాచెల్లెళ్లు
భార్య: శోభ
పిల్లలు: కల్వకుంట్ల తారక రామారావు (ఎమ్మెల్యే), కవిత
(తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు)
విద్యార్హతలు: ఎమ్మే (తెలుగు)
అది సిద్దిపేట శివారు ప్రాంతం. భారీ బహిరంగ సభ. నేల ఈనిందా అన్నట్టు జనం. చీకటి పడుతోంది. జనంలో అసహనం. ఉన్నట్టుండి వేదిక పక్కగా గందరగోళం. చూస్తుండగానే పెరిగిపోతోంది. అంతలో ఓ బక్కపలచని వ్యక్తి లేచి మైకందుకున్నాడు. ‘అంతా మనోళ్లేనా? లేకుంటె ఎవడన్న మోపైండా?’ అన్నాడు.ఒక్కమాటతో అంతా గప్‌చుప్. తర్వాత అతను అరగంట పాటు అనర్గళంగా మాట్లాడాడు. ఒక్కమాటతో అంతమందినీ అదుపు చేసిన ఆ మాటల మాంత్రికుడు కేసీఆర్‌గా దేశమంతటికీ తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు.
బోరెడ్డి అయోధ్య రెడ్డి: 13 ఏళ్లంటే నేతల రాజకీయ జీవితంలో మరీ ఎక్కువ కాలమేమీ కాదు. కానీ కేసీఆర్ విషయం అలా కాదు. గడచిన పదమూడేళ్లకాలం ఆయనకు కొన్ని జీవితాలకు సరిపడా తీపి, చేదు అనుభవాలను, ఎత్తుపల్లాలను చవిచూపింది. అంత తక్కువ కాలంలో ఆయనన్ని దూషణ భూషణలు అందుకున్న నాయకుడు మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. పుష్కర కాలంగా రాష్ట్ర రాజకీయాలన్నీ తెలంగాణ చుట్టూ, కేసీఆర్ చుట్టే తిరిగాయి. ఎవరేమన్నా పట్టించుకోని విలక్షణ రాజకీయ శైలితో వివాదాలకు, విమర్శలకు, సంచలనాలకు కేంద్రబిందువుగా నిలిచారు. తెలంగాణ ప్రజల కలల ను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.
మాటలే పెట్టుబడి
కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ వారసత్వమూ లేదు. చిన్న వయసులోనే టీడీపీలో చేరి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. 1999లో కేసీఆర్‌కు చంద్రబాబు తన కేబినెట్‌లో చోటు కల్పించకుండా డిప్యూటీ స్పీకర్ పదవికి పరిమితం చేశారు. ఆ అవమానాన్ని కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆయనలో ‘తెలంగాణ సోయి’ రెక్కలు విప్పుకోవడం అప్పటినుంచే మొదలైంది. ఏడాదికి పైగా అన్ని కోణాల నుంచీ అధ్యయనం చేసి ప్రజల్లో నిద్రాణంగా ఉన్న ‘తెలంగాణ’ ఆకాంక్షలను తట్టి లేపడం సాధ్యమేనన్న అంచనాకు వచ్చిన కేసీఆర్ తదుపరి అడుగు వేశారు. బాబుపై తిరుగుబావుటా ఎగరేసి 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. ప్రజాకాంక్షలను రాజకీయాలతో ముడిపెడుతూ ఎన్నికలే ఉద్యమ పంథాగా నడిపించారు. మాటే మంత్రమని ఎందుకంటారో కేసీఆర్ ప్రసంగం వింటే తెలుస్తుంది. అద్భుతమైన వక్తల జాబితాలో ఆయన నిలుస్తారు. తెలుగులోనే గాకుండా ఉర్దూ, హిందీ భాషల్లోనూ అనర్గళంగా ప్రసంగించగలరు. ఆంగ్లంపై కూడా మంచి పట్టుంది. బద్ధ విరోధులు కూడా ఆసక్తిగా వినే శైలీవిన్యాసం, చమక్కులు కేసీఆర్ సొంతం. భాషపైనా యాసపైనా మాండలికాలపైనా లోతైన అవగాహన ఉంది. అలాగని తనను మాటల మరాఠీ అని ఎవరన్నా అంటే కేసీఆర్ కస్సుమంటారు.
‘దీక్ష’ తెచ్చిన ఊపు
2009 సెప్టెంబరులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ రూపురేఖలను మార్చేసింది. 2009 నవంబరు 29న ఆమరణ దీక్షకు దిగడం కేసీఆర్ ప్రస్థానంలో మరో కీలక మలుపు. పలు వివాదాలకు తావిచ్చిన ఆ దీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు డిసెంబరు 9న కేంద్రం ప్రకటించింది. అప్పుడది సాకారం కాకపోయినా టీఆర్‌ఎస్ పుంజుకునేందుకు కారణమైంది.
వ్యవసాయం..
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కేసీఆర్‌కు సాగుపై ఎంతో మక్కువ. రాష్ట్ర మంత్రిగా ఉండగా రంగారెడ్డి జిల్లాలో భూమి కొన్నారు. ఇప్పుడు మెదక్ జిల్లాలో వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక సేద్యం చేస్తున్నారు.
ఎగుడుదిగుళ్లు
2001లో పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మంచి ఫలితాలు సాధించింది. తరవాత సిద్దిపేట ఉప ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీ సాధించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో వచ్చిన 42 అసెంబ్లీ స్థానాలకు తోడు మరో 14 చోట్ల కూడా పోటీ చేసినా గెలిచింది 26 సీట్లే. ఆ సమయంలో కాంగ్రెస్ విసిరిన సవాలును అందిపుచ్చుకుని కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దాన్ని తెలంగాణవాదానికి రిఫరెండంగా ప్రచారం చేసి 2 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. పదేపదే రాజీనామా కార్డు ప్రయోగించడం అప్పుడప్పుడూ బెడిసికొట్టింది కూడా. 2008లో మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. 17 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల ఓటమి చవిచూశారు. ఆ ఫలితాలతో కేసీఆర్ కుంగిపోయారు. 2009 సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీతో కలిసి మహాకూటమిలో చేరి కేసీఆర్ మరో చేదు అనుభవం చవిచూశారు. 55 అసెంబ్లీ, 9 లోక్‌సభ ు స్థానాలకు పోటీ చేసిన టీఆర్‌ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే, 2 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది. రెండు లక్షల మెజారిటీతో కేసీఆర్‌ను గెలిపించిన కరీంనగర్ ఓటర్లు ఈసారి టీఆర్‌ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించారు.
‘తెలంగాణ వెనుకబాటుతనం పోవుటానికి నిధులు కావాన్నని కేంద్రానికి చంద్రబాబు ఉత్తరం రాసిండట. ఆ కార్డు ముక్క ఎటు పోయిందో? అడ్రసు గిట్ట తప్పు రాసిండా ఏంది?’
- కేంద్రానికి చంద్రబాబు రాసిన లేఖపై..
‘కరెంటు మీటర్లు చంద్రబాబు ఎక్కి తిరుగుతున్న హెలికాప్టరు పంకల కంటె స్పీడుగా తిరుగుతున్నయి’
- బాబు హయాంలో విద్యుత్ సంస్కరణల పేరుతో బిగించిన డిజిటల్ కరెంటు మీటర్లపై ఎద్దేవా