ప్రాజెక్టుల నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యమా..? | negligence in construction of projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టుల నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యమా..?

Published Wed, Apr 23 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

ప్రాజెక్టుల నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యమా..?

ప్రాజెక్టుల నిర్మాణంపై ఇంత నిర్లక్ష్యమా..?

  • విద్యుదుత్పత్తి అవుతున్నా జిల్లా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు
  • బంధనాలను తెంచుకోండి బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
  • టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
  • ఖమ్మం, న్యూస్‌లైన్ : ‘ఎడమ వైపు కృష్ణా నది, కుడి వైపు గోదావరి, ఇతర నదులు ఉన్నా జిల్లాలో కరువు తాండవిస్తోంది... పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణం’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహింరగ సభలో ప్రసంగిస్తూ... జిల్లాలో కేవలం 34 శాతం భూమి మాత్రమే సాగుకు అనుకూలంగా ఉందని, ఈ భూమికి కూడా సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
     
     జిల్లా రైతులకు సాగునీరు అందించే దుమ్ముగూడెం, రుద్రమకోట ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని గత పాలకులను ప్రశ్నించారు. కిన్నెరసాని నీరు ఎందుకూ ఉపయోగపడడం లేదని, భారీగా విద్యుదుత్పత్తి అవుతున్నా జిల్లా ప్రజలు చీకట్లో మగ్గుతున్నారని అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ నీళ్లు జిల్లాలోని గార్ల, బయ్యారం ప్రాంతాలకు రావాల్సి ఉండగా సీమాంధ్రకు చెందిన ఇంజనీర్ కెఎల్ రావు కుట్రతో ఆ ప్రాంతానికి తరలించారని ఆరోపించారు.

    తమ కళ్ల ముందునుంచే కృష్ణా నది నీరు వెళ్తున్నా వేంసూరు ప్రాంత రైతులు మాత్రం సాగునీటి కోసం లిప్టులు, ఇతర విద్యుత్ మోటర్లు పెట్టుకొని ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. తమను సీమాంధ్ర ప్రాంతం వారు చీటికి మాటికి బెదిరిస్తున్నారని వేంసూరు మండల రైతులు చెప్పినప్పుడు తాను తీవ్రంగా కలత చెందానని అన్నారు.

     మన ప్రాంతంలో మన పాలన వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని, ప్రాజెక్టు గట్టుమీద కుర్చీ వేసుకొని కూర్చొని నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. బంధనాలు  తెంచుకుని ఇబ్బందులు, మోసపూరిత మాటలను నమ్మకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికి హరిత తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
     
    ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎస్‌కె. బురహన్ భేగ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల కల సాకారమవుతున్న తరుణంలో బంగారు తెలంగాణ ఏర్పాటు టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని అన్నారు.  ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి జీ. కృష్ణ మాట్లాడుతూ అన్ని వనరులు, ఖనిజాలు ఉన్నా జిల్లాను అభివృద్ధి చేయకుండా పాలక పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఖమ్మం సభ అనంతరం కేసీఆర్ మణుగూరు బయల్దేరగా... హెలికాప్టర్ దారితప్పి భద్రాచలం వెళ్లడంతో అక్కడి నుంచి ఇల్లెందుకు వెళ్లి.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా కొత్తగూడెం వచ్చారు.
     
    అక్కడ బహిరంగసభలో పాల్గొని తిరిగి ఖమ్మం వచ్చి బస చేశారు. ఈ సభల్లో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్, మధిర, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, అభ్యర్థులు బొమ్మెర రామ్మూర్తి, రావెళ్ల రవీంద్ర, ఊకె అబ్బయ్య, జలగం వెంకట్రావు,  నాయకులు తవిడిశెట్టి రామారావు, అర్వపల్లి విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement