ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీ ఇంకా కుదురుకోలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి 40 రోజులు దాటుతున్నా పేషీలోని అధికారుల్లో ఎవరెవరూ ఏయే శాఖలు చూడాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
కార్యదర్శులకు ఇప్పటికీ శాఖలు కేటాయించని వైనం
ఫలితంగా ముందుకు కదలని ఫైళ్లు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేషీ ఇంకా కుదురుకోలేదు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి 40 రోజులు దాటుతున్నా పేషీలోని అధికారుల్లో ఎవరెవరూ ఏయే శాఖలు చూడాలన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీంతో ఫైళ్లన్నీ సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావుకు మినహా మిగిలిన కార్యదర్శులకు వెళ్లడంలేదు. ముఖ్యమంత్రి పేషీలోకి అధికారుల ఆలస్యంగా రావడం, ఇప్పటి వరకు వారికి ఎలాంటి శాఖలు కేటాయించకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. పేషీలో ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యకార్యదర్శిగా నర్సింగరావు వ్యవహరిస్తున్నారు.
స్మితా సబర్వాల్, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి ప్రత్యేక కార్యదర్శులుగా ఉన్నారు. కానీ వీరికింకా శాఖలు కేటాయించలేదు. వివిధ శాఖల నుంచి సీఎం కార్యాలయానికి వచ్చే ఫైళ్లను అధ్యయనం చేసి, వాటిని ముఖ్యమంత్రికి వివరించడం, అందుకు అనుగుణంగా ఫైళ్లపై సంతకాలు చేయించి తిరిగి పంపించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అయితే ఎవరెవరు ఏ శాఖలు చూడాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతో ఆ ఫైళ్లు ముందుకు కదలడంలేదు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు సంబంధించిన ఫైలు కూడా అలాగే ఉండిపోయింది.