విమర్శలు.. దూషణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతానికి అనుగుణంగా మాట్లాడాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఆ పార్టీ రెండు ప్రాంతాల నే తలు పరస్పర విమర్శలు, వాగ్వివాదాల స్థాయిని దాటి దూషణల పర్వంలోకి దిగుతున్నారు. కొద్దిరోజుల కిందట సీమాంధ్రకు చెందిన పయ్యావుల కేశవ్, తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకరినొకరు వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఇదేతీరులో కోడెల శివప్రసాదరావు, మోత్కుపల్లి నర్సింహులు మధ్య ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే వాగ్వాదం జరిగింది.
తాజాగా శుక్రవారం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, తెలంగాణ టీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి మధ్య మాటల యుద్ధం సాగింది. విభజనపై రమేష్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడాన్ని నిజామాబాద్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి తప్పుబట్టారు. దానిపై స్పందించిన రమేష్ తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయలేని ఎర్రబెల్లి తనపై మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తి రాజ్యసభ సభ్యుడు కావొచ్చన్న కనీస పరిజ్ఞానం కూడా లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లో ఉన్న ఎర్రబెల్లి శుక్రవారం రమేష్ వ్యాఖ్యలపై స్పందించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే ఇలాగే ఉంటుందని, రమేష్‌లాంటి దళారులు, మోసగాళ్లు, వ్యాపారవేత్తలకు చంద్రబాబు రాజ్యసభ టికె ట్లిచ్చారని దుమ్మెత్తిపోశారు.
అంతటితో ఆగకుండా పార్టీలో ఇలాంటి వారుండాలో తాముండాలో చంద్రబాబు తేల్చుకోవాలని కూడా సవాలు చేశారు. అయితే నేతలు తమ సొంత ఇమేజీ కోసం ఇలా మాట్లాడుతున్నారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. అంతకుముందు వీరి మధ్య వాగ్వాద అంశం చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నట్టు చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకుంటే కిరణ్ ప్రభుత్వం కూలిపోతుందని, తద్వారా తెలంగాణ బిల్లును అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవచ్చని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ .. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తే ఆయన బలం నిరూపించుకోవాల్సిందిగా సీఎంను కోరతారని అప్పుడు ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. పొలిట్‌బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం రమేష్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రబాబును కోరతామని ఎర్రబెల్లి చెప్పారు. హన్మకొండలో విలేకరులతో మాట్లాడుతూ రమేష్ తెలంగాణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లడం సరికాదన్నారు.