
రేపు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాక
విజయవాడ సెంట్రల్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14న దివంగత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకలను ఆంధ్రరత్నభవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడపా నాగేంద్ర బుధవారం తెలియజేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
ఈనెల 19న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నాగేంద్ర తెలిపారు. 7నుంచి 10 తరగతులు విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖుల పాత్ర’ అంశంపై పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని నాగేంద్ర పేర్కొన్నారు.