ప్రొద్దుటూరు/రాజుపాళెం, న్యూస్‌లైన్: శనగ పంట సాగు చేసిన రైతులు తుపాను ప్రభావం కారణంగా ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి విత్తనం సాగు చేసిన రైతులు వర్షం ప్రభావం కారణంగా మొలక వస్తుందా రాదా అని దిగులు చెందుతున్నారు.
జిల్లాలో జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోనే అత్యధికంగా శనగ పంట ప్రతి ఏటా రబీ సీజన్‌లో సాగవుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా పంట సాగుకు సిద్ధమయ్యారు. కాగా ఇటీవల వర్షాలు ఎక్కువగా పడటంతో గత వారం రోజులుగా ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేశారు.
అయితే అనుకోకుండా వచ్చిన తుపాను ప్రభావం కారణంగా భూమిలో తేమ శాతం పెరిగింది. దీంతో వేసిన విత్తనంపై రైతులు కలత చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా వరుసగా వర్షాలు పడుతుండటంతో భూమిలో వేసిన విత్తనం మొలక వస్తుందా రాదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క రాజుపాళెం మండలంలోనే 10వేల హెక్టార్లకుపైగా శనగ పంట సాగవుతుందని వ్యవసాయాధికారులు అంచనా వేయగా ఇప్పటికే ఈ మండలంలో 2వేల ఎకరాల వరకు రైతులు పంట సాగు చేశారు.
వర్షాలు ఆగకపోతే నష్టం తప్పదు
ప్రతి ఏటా శనగ పంటను సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కూడా 15 ఎకరాలు కౌలుకు తీసుకుని విత్తనం వేశాను. ప్రస్తుతం కురుస్తున్న వర్షం ఆగకపోతే వేల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట మొలక వస్తుందో రాదోనని ఆందోళనగా ఉంది.
- నరసింహా రెడ్డి. అర్కటవేముల
రాజుపాళెం మండలం
7 ఎకరాల్లో పంట సాగు చేశాను
ఇటీవల పడిన వర్షాల కారణంగా ముందుగానే శనగ పంటను 7 ఎకరాల్లో సాగు చేశాను. విత్తనం వేశాక వర్షాలు ఎక్కువయ్యాయి. వర్షం ఇంతటితోనైనా ఆగకపోతే సాగు చేసిన విత్తనం మొలకరావడం కష్టం.
పాపిరెడ్డి, రైతు, అర్కటవేముల గ్రామం
మొలక వస్తుందో.. రాదో..
Published Wed, Oct 23 2013 2:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement