
తుపాను ముందు ప్రశాంతత
విశాఖపట్నం: కోస్తా జిల్లాలలకు హెలెన్ తుపాను ప్రభావం పొంచి ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలలో వాతావరణం తుపాను ముందు ప్రశాంతతలా ఉంది. ఓ పక్కన సముద్రపు అలలు ఎగిసిపడుతున్నా కొన్ని జిల్లాలలో ఎండకాస్తూనే ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లా అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో హెలెన్ తుపాన్ కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఓడ రేవులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణపట్నం, మచీలిపట్నం, నిజాంపట్నంలలో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, విశాఖ, గంగవరం పోర్టులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. కలెక్టర్ సౌరబ్ గౌర్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడతీరంలో అలజడి మొదలైంది. తుపాన్ ప్రభావంతో అలలు ఎగిసిపడుతున్నాయి. అలలు రాతిగోడ ఢీకొని బీచ్ రోడ్డుపై ఎగిసిపడుతున్నాయి. కాకినాడ ఓడలరేవు వద్ద అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఓ బోటు సముద్రంలో చిక్కుకుంది. బోటులో అమీనాబాద్‌కు చెందిన ఆరుగురు మత్స్యకారులు ఉన్నారు.
గుంటూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం, సూర్యలంక బీచ్‌లలో అలలు ఎగిసిపడుతున్నాయి. గుంటూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నంబర్లు: 0863 2234070, 2234301.
ప్రకాశం జిల్లా చీరాల, కొత్తపట్నం, పాకల సముద్రతీరాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. పాకలలో సముద్రం 50 మీటర్లు ముందుకొచ్చింది. కలెక్టర్ విజయ్‌కుమార్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రకాశం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నంబర్ 08592 281400. ఒంగోలుకు
సముద్ర తీరం వెంబడి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వాడరేవులో 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నెల్లూరు సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. జిల్లాలోని తుమ్మలపెంట వద్ద సముద్రం 35 అడుగుల మేర ముందుకు వచ్చింది. జిల్లాలోని సముద్ర తీరంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఇప్పటికే నెల్లూరు చేరుకుంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఫోన్ నంబర్లు: 08612331477, 2331261.
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
గుంటూరు: 0863 2234070, 2234301
నెల్లూరు: 0861 2331477, 2331261
ఒంగోలు : 08592 281400