అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : వేరుశనగ కొనుగోలు కేంద్రాల్లో ఆయిల్‌ఫెడ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ‘అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో’ అన్న చందంగా వారి తీరు ఉంది. ఎవరికీ అన్యాయం జరగకుండా సీనియారిటీ ప్రకారం టోకెన్లు, రసీదులు ఇస్తున్నట్లు ఒకవైపు ఘనంగా చెబుతున్నా.. లోలోపల మాత్రం తమ వారిని పిలిచి మరీ తూకాలు వేసి పంపుతున్నారు. దీంతో ఇప్పటికే వారం, పది రోజులు పడిగాపులు కాస్తున్న రైతులు ఇంకా ఎదురుచూడాల్సి వస్తోంది. ఈ తంతును కళ్లారా చూస్తున్న రైతులు కన్నెర్ర చేస్తున్నారు.
ఇదేమిటని నిలదీసే ప్రయత్నం చేస్తున్నా అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్లు రైతులనే దబాయిస్తున్నారు. మరీ ఎక్కువ రభస చేస్తే ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందోనన్నఆందోళనతో రైతులు మిన్నకుండిపోతున్నారు. ఎవరికీ అనుమానం కలగకుండా ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు అనుకూలమైన వారికి, వ్యాపారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న వైనం బుధవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలనలో వెల్లడైంది. అనంతపురం మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో తమ వారికి తూకాలు వేయకుండా... పక్కనున్న పండ ్లమార్కెట్ ప్రాంగణంలోని మూడు షాపుల్లో రహస్యంగా కాటాలు పెట్టడం కనిపించింది. అక్కడున్న వందలాది వేరుశనగ బస్తాలను హమాలీలు తూకాలు వేస్తున్నా రైతులు మాత్రం కనిపించలేదు.
రాత్రిళ్లు కూడా అక్కడ తూకాలు వేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన రైతులు బుధవారం ఆయిల్‌ఫెడ్ మేనేజర్ ఏకాంబరరాజు, మరో అధికారి ప్రభాకర్‌రెడ్డిలను నిలదీశారు. ‘ఎవరికీ అన్యాయం చేయం... సీనియారిటీ ప్రకారం టోకెన్ల వారీగా తూకాలు వేస్తామన్నారు. అటువైపు షాపుల్లో వేరుశనగ బస్తాలు, కాటా మిషన్ ఉన్నాయి కదా’ అని అడిగితే నీళ్లు నమలడం వారి వంతైంది. రైతులకు సరైన జవాబు చెప్పకుండా పైగా వారినే దబాయించే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు రైతులు, అధికారుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పండ్ల మార్కెట్‌కు వెళ్లిన రైతులు షాపులను మూసేసి... కాటా మిషన్ బయటపడేశారు. పది రోజులవుతున్నా తూకాలు వేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని శింగనమల మండలం పెరవలికి చెందిన ఆదినారాయణ, రాప్తాడు మండలం బుక్కచెర్లకు చెందిన సంగాలప్ప, లింగనపల్లికి చెందిన హనుమంతరెడ్డి, అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన అంజినరెడ్డి తదితర రైతులు వాపోయారు.
గుత్తిలోనూ మార్కెట్ యార్డు
అధికారిపై రైతుల ఆగ్రహం
గుత్తి, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను అమ్ముకుందామని వస్తే, అధికారులు సైతం తమ జీవితాలతో ఆడుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుత్తి మార్కెట్ యార్డులో వేరుశనగ కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు లేవన్న కారణంగా అధికారులు వేరుశనగ కాయల తూకాలను నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు రెండు వారాలుగా తినీతినక పడిగాపులు కాస్తున్నా అధికారులకు కొంచెం కూడా దయ, కరుణ లేకుండాపోయిందన్నారు. అనంతరం మార్కెట్ యార్డు కార్యదర్శి గోవిందరెడ్డితో సుమారు అరగంట సేపు వాగ్వాదానికి దిగారు. రైతులకు బదులుగా వ్యాపారులు, దళారులకే ప్రాధాన్యమిస్తూ వారి సరుకును మాత్రమే తూకం వేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే తూకాలు వేయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు.
చేయి తడపాలట!
Published Thu, Feb 6 2014 2:23 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement