సీతానగరం, బొబ్బిలి: ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం చెల్లించాల్సిన బకాయిల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్నదాతల సంకల్పం జోరు వానలోనూ సడలలేదు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ శనివారం ఉదయం కర్మాగారం ముందు మహాధర్నా చేపట్టారు. ఇంతలో బొబ్బిలి డీఎస్‌పీ బీవీ.రమణమూర్తి యాజమాన్యంతో మాట్లాడించడంతో సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ సంగతి..
గత రెండు సీజన్లకు సంబంధించి ఎన్‌సీఎస్ యాజమాన్యం 18 కోట్ల రూపాయల మేర బకాయి ఉండడంతో అన్నదాతలు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావటంతో అప్పులు చేయలేక చెరకు బకాయిల కోసం పోరాటం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం ఉదయం ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు పెద్దసంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు వర్షంలో తడిసి ముద్దవుతున్నా, మరో వైపు అధిక సంఖ్యలో పోలీసులు మోహరించినా వెనుకంజ వేయలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మహాధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమస్యపై యాజమాన్యానికి వినతి ఇవ్వాలని వారు సూచించారు.
దీంతో ఏపీ చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ రైతులనుద్దేశించి మాట్లాడుతూ శుక్రవారం బొబ్బిలిలో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశంలో కోటి రూపాయలు చె ల్లిస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ధర్నాకు వచ్చినవారికి ఆ సొమ్ము చెల్లిస్తే ఆందోళన విరమిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యేలోగా పార్వతీపురం ఏఎస్‌పీ సిద్ధార్థ కౌశిల్, బొబ్బిలి డీఎస్‌పీ బీవీ.రమణమూర్తి వచ్చి మొత్తం పరిస్థితిని రైతులకు వివరించారు. యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎండీ నాగేశ్వరరావు, డైరక్టరు శ్రీనివాసులను తీసుకువచ్చారు. మహాధర్నాకు వచ్చిన రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చెల్లింపులు చేస్తామని, జూలై 15 నాటికి బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లిస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
మహాధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్‌పీ ఆధ్వర్యంలో సీఐ, ఎస్‌ఐ, ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లను నియోగించారు. ఎన్‌సీఎస్ సుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్లకు భారీ భద్రత కల్పించారు. పోలీసులు వలయంగా ఏర్పడి నలుగురు రైతు ప్రతినిధులనే లోపలకు పంపి చర్చలు జరిపించారు. పాతబొబ్బిలి జంక్షను వద్ద కూడా భారీగా పోలీసులను ఉంచారు.
వర్షంలోనూ సడలని సంకల్పం
Published Sun, Jun 21 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement
Advertisement