
పేదలంటే అంత చులకనా?
- మాజీమంత్రి పార్థసారథి
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
- పట్టాలివ్వాలని డిమాండ్
- కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ
ఉయ్యూరు : ఎన్నో ఏళ్లుగా ఇళ్లస్థలాల కోసం ఎదురుచూస్తున్న పేదల పట్ల చులకన భావంతో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని వైఎస్సార్ సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కొలుసు పార్థసార థి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండిగుంటలో పేదలకు పంపిణీ చేసిన నివేశనా స్థలాల పట్టాలను అందించి స్థలాలకు హద్దులు చూపాలని డిమాండ్ చేస్తూ ఆయన నేతృత్వంలో మహిళలు శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
తహసీల్దార్ నిర్బంధం..
సమస్యపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహసీల్దార్ రోహిణీ దేవి తీరుకు నిరసనగా మహిళలంతా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నూజివీడు సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబుకు సమస్యను విన్నవించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినా... ఆ దిశగా చర్యలు చేపట్టకుండా దాటవేత ధోరణి అవలంభించారని సారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం బయట ఉన్న మహిళలను పోలీసులు లోనికి రాకుండా అడ్డుకోవడంతో సార థి తలుపు గడియ తీసేందుకు ప్రయత్నం చేశారు. రూరల్ ఎస్‌ఐ యువకుమార్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా పేదల సమస్య చెప్పుకునే హక్కు లేదా అంటూ నిలదీశారు.
తలుపు గడియ తీయడంతో ఒక్కసారిగా మహిళలంతా తహసీల్దార్ ఛాంబర్‌లోకి వెళ్లి ఆమె ఎదుట కూర్చుని ఆందోళన చేపట్టారు. సీఐ మురళీరామకృష్ణ వచ్చి మాజీ మంత్రి సార థి, తహసీల్దార్‌తో వేరువేరుగా చర్చలు జరిపినా మహిళలు పట్టువీడలేదు.అయితే పొద్దుపోయిన తరువాత కలెక్టర్ ఫోన్‌లో మాట్లాడుతూ సోమవారం ఉదయం సమస్యను పరిష్కరిస్తామని పార్థసారథికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అసలు కథ ఇదీ..
గండిగుంట గ్రామంలో దశాబ్దాలుగా ఇళ్లస్థలాలకోసం ఎదురుచూస్తున్న పేదల కోసం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మాథ్యమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కొలుసు పార్థసారథి సుమారు 10 ఎకరాల భూమిని రూ.2.50 కోట్లకుపైగా వెచ్చించి రైతుల నుంచి సేకరించారు. స్థలాల కోసం 650కుపైగా పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి తహసీల్దార్ మహేశ్వరరావు విచారణ చేపట్టి 250 మంది మాత్రమే అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించి పంపిణీకి చర్యలు చేపట్టారు.
వంద మందికి పట్టాలు అందించారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో మిగిలిన 150 మందికి పట్టాలు పంపిణీ చేయడంలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో మహేశ్వరరావు పమిడిముక్కలకు బదిలీ అయ్యారు. మిగిలిన లబ్ధిదారుల పట్టాలను మూలన పడేశారు. ఈ స్థలాలపై టీడీపీ నేతల కన్ను పడింది. లబ్ధిదారులకు కేటాయించిన 150 పట్టాలతో పాటు మిగిలిన 170 ప్లాట్లను తమ అనుయాయులకు ఇప్పించుకునేందుకు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
ఎలాంటి ఉత్తర్వులూ లేకుండానే !
స్థలాల పంపిణీ ఆపాలని టీడీపీకి చెందిన ఆ గ్రామ సర్పంచి గుండే రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే వ్యక్తి కలెక్టర్‌ను కలిసి స్థలాలు పంపిణీ చేయాల్సిందిగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇతని వెనుక దేశం నేతల హస్తముందనే విమర్శలున్నాయి.