ప్రసంగిస్తున్న రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చిత్రంలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు
కడప కోటిరెడ్డి సర్కిల్: డీఆర్‌డీఏ, వెలుగు ఉద్యోగులు అధైర్యపడొద్దని, వారి ఉద్యమానికి వైఎస్‌ఆర్‌సీపీ అండదండగా ఉంటుందని మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల జేఏసీ చేస్తున్న సమ్మెకు ఆయన, వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్న ఘనత డీఆర్‌డీఏ, వెలుగు ఉద్యోగులదేనన్నారు. వారి మనోస్థైర్యాన్ని ప్రభుత్వం దెబ్బతీయడం బాధాకరమన్నారు.నాలుగున్నరేళ్లుగా వారికి ఇచ్చిన మాట తప్పడమేగాక బ్లాక్ మెయిల్ చేస్తూ ఒత్తిడికి గురి చేయడం అన్యాయమన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబొస్తుందని ఊదరగొట్టారని, ఇప్పుడు ఉండే ఉద్యోగాలకు ఎసరు వస్తోందన్నారు. వైఎస్ జగన్ ఒక మాట చెప్పాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని, మాట చెబితే దానికి కట్టుబడి ఉంటారని అన్నారు. చంద్రబాబు మాత్రం చెప్పింది చేయరని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని, వారి సమస్యలను వైఎస్ జగన్ దృíష్టికి తీసుకెళతామని మని హామీ ఇచ్చారు.
మరో నాలుగు నెలల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆయువుపట్టులాంటి వెలుగు ఉద్యోగులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. పదిరోజులుగా సమ్మెచేస్తుంటే ఉన్నతాధికారులు వారి వద్దకి వచ్చి సమస్యలు వినకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగులు చేసే ఆందోళనకు వైఎస్‌ఆర్‌సీపీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 600 హామీలిచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం 22 సంక్షేమ పథకాల అమలుకు వెలుగు ఉద్యోగులను వాడుకుంటూ వారిని కరివేపాకులా తీసివేస్తోందన్నారు. ఐదువేలమంది ఉద్యోగులను పర్మినెంట్ చేయలేని ముఖ్యమంత్రి పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీఎం అనుభవం ఇక్కడ ఎందుకు పనిచేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వారికి ఉద్యోగ భద్రత కల్పించి, సరైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు బండి జకరయ్య, ఎస్‌ఏ సత్తార్ సమ్మెకు మద్దతు తెలిపి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మెన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, పంజం సుకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment