సాక్షి, అమరావతి : తీర ప్రాంతాలలో జరిపే తవ్వకాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని పంచాయతీరాజ్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సచివాలయంలో ఓఎన్‌జీసీ, గెయిల్ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలను వెలికి తీస్తున్న సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మత్స్యకారుల సంక్షేమానికి తాము చేస్తున్న పనుల్లో రెండు శాతం తప్పని సరిగా చెల్లించాలని కోరారు. ఓఎన్‌జీసీ, గెయిల్ గతంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. 150 కోట్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిపారు. దానిలో చెల్లించాల్సిన బకాయిలు రూ.82.12 కోట్లు వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఆయిల్ నిక్షేపాల వెలికితీత కారణంగా ఏర్పడే కాలుష్యం వల్ల మత్స్యకారుల వేటకు, వారు వేటాడే ప్రాంతాల్లోని మత్స్య సంపదకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment