
'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారు'
హైదరాబాద్: అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైఎస్‌ఆర్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు.
సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వారు ప్రవిలేజ్ కమిటీ ముందు వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో గతంలో టీడీపీ సభ్యులు ఎలా వ్యవహరించారో తెలియజేశామని, చంద్రబాబు తీరుతో గతంలో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మారావు కన్నీళ్లు పెట్టుకున్నారని, కొంతమంది టీడీపీ సభ్యులైతే గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో పట్టుబట్టినందుకు ప్రవిలేజ్ కమిటీ 12 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.