పెన్షన్లన్నీ పచ్చచొక్కాలకే
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లన్నీ టీడీపీ కార్యకర్తలకే కట్టబెడుతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. అర్హత ఉన్నప్పటికీ వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లేశారన్న కక్షతో పెన్షన్లు మంజూరు చేయడం లేదన్నారు. జన్మభూమి కమిటీలను రద్దు చేసి అర్హులందిరకీ పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
పోరుమామిళ్ల మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిత్తా విజయ్‌ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ మండలానికి చెందిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అద్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్హుందరికీ పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. పెన్షన్ల విషయంలో ఆయన పార్టీల బేధం చూపలేదన్నారు. కానీ చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకే పెన్షన్లు ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
కమిటీల ముసుగులో అనర్హులకు పెన్షన్లు ఇస్తూ అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులైనా న్యాయం చేయాలని కోరారు. నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ కడపలో 18,876 మందికి పెన్షన్లు వస్తుండగా, అందులో 8700 మందిని తొలగించారని పేర్కొన్నారు. ఇంకా నగరంలో 11 వేల మంది అర్హులు ఉన్నప్పటికీ పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. ఇలా మొత్తం 19 వేల మందికి పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో మూడు లక్షల మందికి పెన్షన్లు వస్తుండగా, లక్షా 72 వేల మందిని తొలగించారని వివరించారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. ఈ అంశంపై అవసరమైతే కలెక్టర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
నేనే పెన్షన్లు ఇస్తా : ఎంపీపీ
తన మండలంలో అర్హులై ఉండి పెన్షన్లు రాని వారందరికీ ప్రతినెలా తానే సొంత డబ్బుతో పెన్షన్లు ఇస్తానని పోరుమామిళ్ల ఎంపీపీ విజయ్‌ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. అర్హులకు పెన్షన్ల మంజూరుపై అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నిత్యానందరెడ్డి, షఫీ, సునీల్‌కుమార్, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.