పింఛన్ల పంపిణీలో నకిలీనోట్లు
కర్నూలు(జిల్లా పరిషత్):
నగరంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి అధికమైంది. ఇప్పటిదాకా ఏటీఎంలలోనే బయటపడుతున్న ఈ నోట్లు ఇప్పుడు సామాజిక పింఛన్ల పంపిణీలోనూ కనిపిస్తున్నాయి. అచ్చుగుద్దినట్లు అసలు నోటును పోలి ఉండటంతో లబ్ధిదారులు వాటిని గుర్తించలేకపోతున్నారు. ఆదివారం స్థానిక దేవనగర్‌లోని సత్యనారాయణస్వామి దేవాలయం వద్ద జరిగిన పింఛన్ల పంపిణీలో నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చాయి.
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సామాజిక పింఛన్లు కలిపి 18వేలకు పైగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక సర్వేలు నిర్వహించి 4వేలకు పైగా పింఛన్లు తొలగించారు. మిగిలిన 14వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 4వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జన్మభూమి-మా ఊరు వార్డు సభల్లో మొక్కుబడిగా పది మందికి పింఛన్లు ఇచ్చి, ఆ తర్వాతి రోజు నుంచి మిగిలిన వారికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నగరంలో యాక్సిస్ బ్యాంకు ద్వారా పంపిణీ చేపడుతున్నారు.
పింఛన్లలో దొంగనోట్ల చలామణి
సామాజిక పింఛన్ల పంపిణీల్లో పలుచోట్ల నకిలీనోట్లు చలామణి అవుతున్నాయి. ప్రధానంగా రూ.500, రూ.1000 నోట్లు నకిలీగా తేలుతున్నాయి. ఆదివారం స్థానిక దేవనగర్‌లోని సత్యనారాయణస్వామి దేవాలయం వద్ద జరిగిన పింఛన్ల పంపిణీలో రెండు రూ.1000ల నోట్లు నకిలీవని లబ్ధిదారులు వెనక్కి తెచ్చి ఇచ్చారు. దీంతో పింఛన్లను పంపిణీ చేసే సీఎస్‌పీలు ఖంగుతిన్నారు.
పంపిణీ చేసిన నకిలీ నోట్లపై తెల్లగా ఉండే ప్రాంతంలో 1000 సంఖ్యతో పాటు నోటు ముద్రించిన సంవత్సరం లేకపోవడాన్ని వారు గుర్తించారు. దీంతో సీఎస్పీలు వారు పంపిణీ చేసిన ప్రతినోటుపై చిన్నగా వారి పేరు రాసి ఇస్తున్నారు.నకిలీ నోట్ల విషయమై స్థానికులు జిల్లా ఎస్‌పీ ఆకె రవికృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్థానిక మూడవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి నకిలీ నోట్లను పరిశీలించి వెళ్లిపోయారు. నగరంలో పలు చోట్ల ఇలాగే 5 నుంచి 10కి పైగా నకిలీ నోట్లు బయటపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే మీకెక్కడి నుంచి వచ్చాయి...పింఛన్లలోనే మీకిచ్చారని గ్యారంటీ ఏమిటి లాంటి ప్రశ్నలు వేస్తారని భయపడి ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారు. నగరంలోని పలు ఏటీఎంలలోనూ ఇలాగే నకిలీ నోట్లు బయటపడుతున్నా బ్యాంకు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. పైగా ఆయా నోట్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తుండటంతో జనం గుట్టుచప్పుడు గాకుండా వారికి అందిన నోట్లను ఏదో విధంగా వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు.