ఆశల సంతకం | Pension Holders Happy With YSR Pension Kamuka | Sakshi
Sakshi News home page

ఆశల సంతకం

Published Fri, May 31 2019 1:29 PM | Last Updated on Fri, May 31 2019 1:29 PM

Pension Holders Happy With YSR Pension Kamuka - Sakshi

వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జిల్లాలో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. కేక్‌లు కట్‌ చేస్తూ, బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుతూ అభిమానులు కేరింతలు కొట్టారు. ఒంగోలు చర్చి సెంటర్‌లోని భారీ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విజయవాడలో జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి బాలినేని, మాగుంట, వైవీ సహా వైఎస్సార్‌ సీపీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘‘మ్యానిఫెస్టోను నేను బైబిల్, ఖురాన్, భగవద్గీత గా భావిస్తాను. మ్యానిఫెస్టో ఎన్నికల తరువాత చెత్త బుట్టలో  వేసేదిగా ఉండకూడదని భావిస్తాను. మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తాం.’’ గురువారం ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా  వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలు ఇవి. అవినీతికి, వివక్షకు  తావులేని పారదర్శక పాలన అందిస్తామని చెప్పిన జగన్‌ గ్రామ వాలంటీర్‌ తో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా  పాలన అందిస్తామన్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో డోర్‌ డెలివరీద్వారా పథకాలు అందిస్తామని చెప్పడం సంచలనం రేకెత్తించింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌  సరికొత్త పాలనకు తెరతీయబోతున్నారని తొలిరోజే అందరికీ అర్థమైంది. సీఎంగా తొలిరోజు  తొలి సంతకంతో పెన్షన్ల పెంపు చేపట్టి ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టి మాట తప్పని మడమ తిప్పని నేతగా జగన్‌ జనం మదిలో నిలిచారు.  

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో   ప్రమాణ స్వీకారం  చేసిన మరుక్షణమే ఇచ్చిన మాట మేరకు వైఎస్‌ జగన్‌ పెన్షన్‌ మొత్తాన్ని పెంచుతూ  తొలి సంతకం చేశారు. దీంతో జిల్లాలో  లక్షలాది మంది పెన్షన్‌దారులు ఆనందంలో మునిగిపోయారు. సంబరాలు చేశారు. దివంగత నేత  వైఎస్‌ తనయుడుగా  జగన్‌ సీఎం హోదాలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు  గ్రామస్థాయిలో  గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా అవినీతికి తావులేని  పారదర్శక పాలన అందిస్తామని, వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించడంతో నిరుద్యోగులు ముఖ్యంగా యువత సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొంది. జగన్‌ ప్రసంగంలో ఈ రాష్ట్రంలో  సరికొత్త పాలనను అందించనున్నట్లు  అందరికీ అర్థమైంది. సీఎం ప్రకటించిన పెన్షన్ల పెంపుతో జిల్లాలో 3,80,903 మంది లబ్ధిపొందనున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 1,76,385 మంది వృద్ధాప్య పెన్షన్లు ఉండగా, 1,32,560 వితంతు పెన్షన్లు, 39,370 వికాలంగ పెన్షన్లు ఉన్నాయి. మొత్తం పై మూడు విభాగాలకు సంబంధించి  3,48,315 పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్లకు సంబంధించి  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు  వైఎస్‌ జగన్‌ రూ.వెయ్యి పెంచి మూడు వేలు చేయాలని జగన్‌ నిర్ణయించారు. ఈ లెక్కన జిల్లాపై  రూ.34,83,15,000 కోట్లు అదనపు భారం పడనుంది.

అయితే వెయ్యి మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఈ జూన్‌ నుంచి రూ.2,250 చొప్పున పెంచి ఇస్తున్నట్లు  గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్‌  ప్రకటించారు. ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని మూడు విడతల్లో పెంచి పెన్షన్‌దారులకు ఇవ్వనున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఒక్క నెలలోనే  3,48,315 పెన్షన్లపై రూ.8,70,78,750 భారం పడనుంది.  ప్రతినెలా ప్రభుత్వానికి  అక్షరాలా రూ.8.70 కోట్ల ఆర్థిక భారం పెరిగింది. అయినా ఇచ్చిన మాటను నిలుపుకొనేందుకు  వైఎస్‌ జగన్‌  ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలో ఇప్పటి వరకూ మొత్తం 3,80,903 పెన్షన్లు ఉండగా ప్రతినెల రూ.81,75,69,500  మొత్తాన్ని ప్రభుత్వం పెన్షన్‌ దారులకు చెల్లిస్తోంది.  సీఎం ప్రకటనతో అదనపు భారం తప్పని పరిస్థితి. దీంతోపాటు  గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు  జగన్‌ ప్రకటించారు. గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌తో పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులుగా  మరో 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు  చెప్పారు. ఒక్కొక్కరికి రూ.5 వేలు జీతం ఇస్తామన్నారు. ఈ లెక్కన జిల్లాలోని 1028 గ్రామ పంచాయతీల పరిధిలో 10,280 మంది  నిరుద్యోగులకు ఉద్యోగాలు  దక్కనున్నాయి. అదే తరహాలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో 2,457 గ్రామాల పరిధిలో  తెల్లరేషన్‌ కార్డుల పరంగా 9 లక్షల కుటుంబాలు ఉండగా అనధికారికంగా దాదాపు 13 లక్షల వరకూ కుటుంబాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన లక్ష కుటుంబాలకు  రెండు వేల వాలంటీర్‌ పోస్టులు అనుకున్నా 13 లక్షల కుటుంబాలకు సంబంధించి 26 వేల వాలంటీర్‌ పోస్టులు జిల్లాకు దక్కనున్నాయి.  రెండూ కలిపితే  36 వేల పైచిలుకు  ఉద్యోగాలు నిరుద్యోగులకు రానున్నాయి. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో జిల్లాలో  పట్టుమని ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  మరుక్షణమే వైఎస్‌ జగన్‌ జిల్లాకు దాదాపు 40 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక అవినీతికి తావులేని పాలనను అందిస్తామని చెప్పిన జగన్‌  గతంలో జరిగిన అవినీతిని వదలి పెట్టేది లేదన్నారు. విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గతంలో టీడీపీ నేతల అక్రమాలకు సహరించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  ప్రధానంగా ఇరిగేషన్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలతో పాటు పలు విభాగాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశముంది. మొత్తంగా సీఎంగా  వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే సంచలనం సృష్టించారు. ఆయన ప్రసంగం మరింత చర్చనీయాంశంగా మారింది.  

పెన్షన్‌ నిధులు రూ.81.75 కోట్లు విడుదల
ఒంగోలు టూటౌన్‌: వైఎస్సార్‌ పెన్షన్‌ నిధులను ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. మొత్తం రూ.81.75 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన నిధులను జూన్‌ ఒకటో తేదీ నుంచి పెన్షన్‌దారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌కు తొలి విడతలో రూ.250 పెంచి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. అభయ హస్తం పెన్షనర్లు 4,589 మంది, డప్పు కళాకారులు 3,102 మంది, దివ్యాంగులు 39,370 మంది, ఫిషర్‌మేన్స్‌ 3,452 మంది, ఓఏపీ పెన్షన్‌దారులు 1,76,385 మంది, ఒంటరి మహిళలు 8,531 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ 100 మంది, చేనేతలు 8, 849 మంది, వితంతువులు 1,32,560 మంది, సీకేడీయూ 370 మంది, ఇతరులతో కలిపి మొత్తం 3,80,903 మంది పెన్షన్‌దారులకు మే నెల పెన్షన్‌ను జూన్‌ ఒకటో తేదీ నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో పంపిణీ చేయనున్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నప్పటికీ పెన్షన్‌దారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే పెన్షన్‌ నిధులను పెంచి వెంటనే విడుదల చేశారని డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement