సాక్షి, అనంతపురం: అర్హులైన సామాజిక పింఛన్‌దారులను కాదంటూ అనర్హులకు అధికారపార్టీ నేతలు న్యాయం చేశారు. ఈ ఐదేళ్ల వ్యవధిలో తమకు అనుకూలంగా ఉన్న వారికి ఏ అర్హత లేకున్నా పింఛన్ ఇప్పించేశారు. సామాన్యులను ఇబ్బందుల పాలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందజేస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే పథకం ప్రకారం పింఛన్‌దారులను జాబితా నుంచి తొలగిస్తూ వచ్చారు.
పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారిని ఎందుకమ్మా తిరగడం అర్హత ఉన్నా.. మీకు పింఛన్ రాదు అంటూ అధికారులే తెగేసి చెబుతూ వచ్చారు. అన్ని అర్హతలు ఉన్న వారు ఎన్ని దఫాలు దరఖాస్తు చేసుకున్నా.. బుట్ట దాఖలు చేస్తూ వచ్చారు. ఆరు దఫాలుగా జిల్లాలో నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో తీసుకున్న అర్జీల్లో 8,500 అపరిష్కృతంగానే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
పించన్ ఇవ్వడం లేదు
నాకు గతంలో పింఛన్ వచ్చేది. కొన్ని నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. నాకు వయసు మీదపడడంతోపాటు కళ్లు పూర్తిగా కనిపించవు. వినికిడి సమస్య కూడా ఉంది. ఇతరుల సహాయం లేనిదే నేను ఏ పనీ చేసుకోలేను. పింఛన్ ఇవ్వాలని జన్మభూమి గ్రామసభలో దరఖాస్తు చేశా. అధికారులు ఇదిగో అదిగో అంటున్నారే తప్ప పింఛన్ ఇవ్వడం లేదు.
– బి.అక్కులప్ప, గాడ్రాళ్లపల్లి
పింఛన్ రాకుండా అడ్డుకున్నారు
ఐదేళ్లుగా వితంతు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జన్మభూమి, మీ కోసం కార్యక్రమాల్లో దరఖాస్తులు అందజేస్తున్నా ప్రయాజనం లేకుండా పోయింది. జన్మభూమి కమిటీ సభ్యులు నాకు పింఛన్ రాకుండా అడ్డుకున్నారు. ఈప్రభుత్వంలో పేదోళ్లకు న్యాయం జరగడం లేదు. డబ్బిచ్చినోళ్లకే పథకాలు అందుతున్నాయి.
–ఓబులమ్మ చండ్రాయనిపల్లి
Comments
Please login to add a commentAdd a comment