ద్వారకాతిరుమల : ఇక పింఛను రాదు.. జీవితాంతం కుటుంబ సభ్యులపై ఆధారపడుతూ.. వారికి భారం కావడాన్ని జీర్ణించుకోలేని ఆ వికలాంగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త ప్రభుత్వం తన జీవితంలో వెలుగులు తెస్తుందని కొండంత ఆశపడ్డ ఆ వికలాంగ యువకుని జీవితం అంతమయింది. అర్హుడైనా పింఛను రాక తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ యువకుడు చివరకు పురుగుల మందు తాగి విగతజీవుడయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రమైన ద్వారకాతిరుమల బస్టాండులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొరసానిపాడు గ్రామానికి చెందిన ముంగమూరి నాగరాజు(32)కు పుట్టుకతోనే పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి.
నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలకు ముగ్గురు కుమారులు కాగా, ఇతను రెండవ సంతానం. నడవలేని ఇతడిని ఇప్పటి వరకు తల్లితండ్రులే పోషించారు. అయితే సైకిల్ రిపేరు షాపు నిర్వహిస్తూ కుటుంబానికి తన వంతు ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ఈ పనులకు ఆదరణ లేకపోవడంతో నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతనికి వికలాంగ పింఛను రూ.500 మంజూరయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పది నెలల క్రితం పింఛను అర్ధాంతరంగా నిలిచిపోయింది.
ఇదేంటని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. ఏప్రిల్ నెలలో పింఛన్ వచ్చింది. తర్వాత మళ్లీ ఆగిపోయింది. వారం రోజుల క్రితం తన తల్లితండ్రులతో చెప్పి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం రాత్రి ద్వారకాతిరుమలకు చేరుకున్న నాగరాజు బస్టాండులో విగత జీవుడై పడిఉన్నాడు. అతని పక్కనే పురుగుమందు డబ్బా, పింఛనుకోసం తిరిగిన కాగితాలు పడి ఉన్నాయి. సోమవారం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి మృతుని బంధువులకు సమాచారమిచ్చారు.
పింఛను రాకే...
బస్టాండుకు చేరుకున్న నాగరాజు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పింఛను అందకపోవడం వల్లే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని, దీనికి ప్రభుత్వం, అధికారులు, ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తారు. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు సకాలంలో రాలేదంటూ వారు బస్టాండు వద్ద ఆందోళనకు దిగారు. ఇక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బుసనబోయిన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకలపాటి త్యాగభీమేశ్వరరావు, నాయకులు యాచమనేని నాగేశ్వరరావు తదితరులు ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఉండని వారి పింఛన్లు తొలగిస్తారా.. అని తహసిల్దారు ఎల్.దేవకీదేవిని వారు నిలదీశారు.
దీనికి ఆమె సమాధానమిస్తూ సాంకేతిక సమస్య కారణంగా ఇతనికి పింఛన్ నిలిచిపోయిందని, జూన్ నెలలో పింఛను వచ్చిందని చెప్పారు. దీనికి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలపలేదని, ఈ నెలలో మళ్లీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి తహసిల్దారు సమాధానమిస్తూ సంబంధిత అధికారి ఎంపీడీవో పురుషోత్తమరావు అనారోగ్య కారణంగా ఈరోజు విధులకు రాలేదన్నారు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, తక్షణమే నష్టపరిహార విషయాన్ని తేల్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్డీవో తేజ్ భరత్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం నాయకులు స్థానిక తహసిల్దారు ఎల్.దేవకీదేవి, ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్‌లతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కుటుంబ సభ్యులకు భారం కాలేను
నెలకు రూ. 1500 వస్తాయని, వాటితో జీవిద్దామని ఆశపడ్డ నాగరాజు ఆ పింఛను కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు, తన తల్లితండ్రులపై ఆధారపడి జీవించలేక పోతున్నానని అనేకసార్లు తమ వద్ద మొరపెట్టుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. చివరికి ఇంక పింఛను రాదని తెలిసిందో.. ఏమో.. ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని అంటున్నారు.
ఇది ప్రభుత్వ హత్యే
నాగరాజుది ప్రభుత్వ హత్యేనని, లబ్ధిదారులను తగ్గించేందుకు కమిటీల పేరుతో వడబోత పెట్టి ఇలాంటి అర్హుల ఉసురును టీడీపీ ప్రభుత్వం తీస్తోందని వైఎస్సార్సీపీ నేత గంటా మురళీరామకృష్ణ అన్నారు. అంగవైకల్యం 90 శాతం ఉన్న నాగరాజుకే ఇవ్వకుంటే.. మరి పింఛన్లు ఎవరికిస్తున్నట్టని ఆయన ప్రశ్నించారు.
పాదయాత్రలో షర్మిలను కలసిన నాగరాజు
గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర దొరసానిపాడుకు చేరుకున్న సమయంలో నాగరాజు ఆమెను కలుసుకుని తన కష్టాలను చెప్పుకున్నాడు. తనకు వికలాంగ రిక్షాను ఇప్పించాలని ఆమెను కోరాడు. దీనికి స్పందించిన షర్మిల వైఎస్సార్సీపీ పాలనలోకి వచ్చిన తరువాత అంతా మంచి జరుగుతుందని చెప్పి, పాదయాత్ర ముగియగానే అప్పటి ఎమ్మెల్యే తానేటి వనిత ద్వారా రిక్షాను నాగరాజుకు అందించారు. దీంతో అతడు ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేశాడు. దీని కారణంగానే ఇప్పుడు టీడీపీ నాయకులు తన కుమారుడికి పింఛను రాకుండా చేశారని నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలు ఆవేదన చెందారు.
పింఛను రాదన్న వేదనతో ఆత్మహత్య
Published Tue, Aug 4 2015 3:09 AM | Last Updated on Mon, Aug 27 2018 8:31 PM
Advertisement
Advertisement