Dvarakatirumala
-
భూ బాగోతంలోఇద్దరు ఎమ్మెల్యేలకూ పాత్ర
ద్వారకాతిరుమల: కొందరు ప్రజాప్రతినిధులు భూ బకాసురుల పాత్రలను పోషిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పోరంబోకు భూములు కనుమరుగవుతున్నాయి. పేద ప్రజల నివాసాలకు ఇవ్వాల్సిన స్థలాలను వారు దళారుల ద్వారా దర్జాగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా అక్రమాలకు పాల్పడటం పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ద్వారకాతిరుమలలోని వసంత్‌నగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూముల కబ్జాలు, క్రయ విక్రయాలపై సాక్షి ప్రచురిస్తున్న వరుస కథనాలతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ భూబాగోతంలో ఉంది చిన్నచితకా ప్రజాప్రతినిధులు అయితే ఈ విషయం అంత హాట్ టాపిక్ అయ్యేది కాదు. సాక్షాత్తు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు ఇందులో పాత్ర ఉండటం సంచలనంగా మారింది. ఇందులో ఒక ఎమ్మెల్యే 25 సెంట్ల భూమిని తన అనుయాయుల ద్వారా విక్రయాలు సాగించి సొమ్ములు దండుకోగా... మరో ఎమ్మెల్యే తన కుమారుడి రియల్ ఎస్టేట్ వెంచర్లో అరెకరం భూమిని కలిపి దర్జాగా అమ్ముకుంటున్నారు. తేలుకుట్టిన దొంగల్లా వసంత్‌నగర్ కాలనీలోని ఆర్ఎస్ నంబర్ 1/2 లో మొత్తం 10.20 ఎకరాల భూమి ఉండగా అందులో 2.50 ఎకరాల భూమికి సంబంధించి తమకు డి ఫారం పట్టాలు ఇచ్చారని వర్దినీడి బసవరాజు అతని కుమార్తె ఎర్రంశెట్టి కరుణలు చెబుతున్నారు. అయితే ఇందులో అవకతవకలను గుర్తించిన నేతలు ఈ భూమిని ఆన్లైన్ కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడే ఎమ్మెల్యే పాత్ర రంగప్రవేశం చేసింది. అధికారులను ఒప్పించి ఎలాగోలా ఆన్లైన్ చేయించారు. ఈ సెటిల్మెంట్ చేసినందుకు ఆ ఎమ్మెల్యేకు 25 సెంట్ల భూమిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు నమ్మకంగా ఉన్న కొందరు నేతలు, దళారుల ద్వారా ఆ భూమిని విక్రయించినట్లు స్పష్టమౌతోంది. 25 సెంట్ల భూమిని పలు భాగాలుగా విభజించి రూ.16.80 లక్షల వరకు అమ్మకాలు జరిపినట్లు సమాచారం. కొనుగోలుదారులకు స్థలంలో ఉన్న వారి పేరున ఎంజాయ్మెంట్, పంచాయతీ మంచినీటి కుళాయిల ఏర్పాటు ఇలా అన్ని అనుమతులు ఇప్పిస్తామని దళారులు హామీలు గుప్పించడంతో, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ పలువురు వాటిని కొన్నారు. ఇప్పుడు ‘సాక్షి’ ఆ బాగో తాలను బట్టబయలు చేయడంతో అంతా తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు. ఇదిలా ఉంటే మరో ఎమ్మెల్యే కుమారుడు వసంత్‌నగర్ కాలనీకి ఆనుకుని ఉన్న ఆర్ఎస్ నంబర్ 11లోని అరెకరం ప్రభుత్వ పోరంబోకు భూమిని తన రియల్ వెంచర్లో కలుపుకున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా.. అప్పటి తహసీల్దారు అన్ని విధాలా ఆక్రమిత దారులకు సహకరించి ఆ భూమిని వారికి కట్టబెట్టినట్లు తెలిస్తోంది. మణి పాత్ర ఎంత ద్వారకాతిరుమలలో ఒక తహసీల్దారు పనిచేసిన సమయంలో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమౌతోంది. 2016 నుంచి 2017 వరకు ఎంహెచ్. మణి ఇక్కడ తహసీల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో అనర్హుల వద్ద ఉన్న దొంగ పట్టాలను ఒక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆన్లైన్ చేసినట్లు తెలు స్తోంది. అలాగే అరెకరం ప్రభుత్వ భూమిని ఒక ఎమ్మెల్యే కుమారుడికి కట్టబెట్టినట్లు స్పష్టమౌతోంది. ఆయన ఇంకెంత మందికి ఇలా ఆన్లైన్లో మార్పులు చేశారన్నది తెలియాల్సి ఉంది. అడుగు ముందుకెయ్యలేని అధికారులు: ఈ భూ బాగోతంలో ఎమ్మెల్యేల పాత్ర ఉండటం వల్లే అధికారులు ముందుకు అడుగు వేయలేక పోతున్నారన్నది బహిరంగ సత్యం. సాదా సీదా టీడీపీ నేతలకే బెదిరిపోతున్న అధికారులు ఏకంగా ఎమ్మెల్యేలను ఎలా ధిక్కరిస్తారు..? ఒక వేళ ధిక్కరిస్తే వనజాక్షికి పట్టిన గతే తమకు పడుతుందన్న భయం వారిలో కలుగదా..? ఇలా సవాలక్ష భయాలతో అధికారులు ముందుకు అడుగేయలేక పోతున్నారు. దీంతో పాలకులకు అడ్డూ అదుపు లేక రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగింది వసంత్‌నగర్ కాలనీలో ప్రభుత్వ భూమి క్రయ, విక్రయాలు గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కనుసన్నల్లో జరిగాయన్న విషయం అందరికీ తెలుసు. అయితే అధికార పార్టీ వారితో ఎందుకని ఎవరికి వారు పట్టించుకోవడం లేదు. పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు సైతం ఇక్కడకొచ్చి భూములను ఆక్రమిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా అమ్మి, సొమ్ము చేసుకుంటూనే నీతిపరులమని నేతలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎమ్మెల్యేలకు భయపడి అధికారులు కూడా ఈ భూ బాగోతాన్ని కప్పేస్తున్నారు. పేద ప్రజలకు ఇవ్వడానికి లేని భూమి, అమ్ముకోవడానికి ఎలా వచ్చిందో. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి వసంత్‌నగర్‌లోని భూవివాదానికి సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించాల్సి ఉంది. వారి ఆదేశానుసారం అవసరమైతే ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం. సర్వేకు సంబంధించి ఇప్పటికే సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలకు నోటీసులిచ్చాను. అలాగే పాత రికార్డులను చూస్తున్నాం. – టీడీఎల్ సుజాత, తహసీల్దారు, ద్వారకాతిరుమల -
వానర ప్రీతి.. సంభావన చేసి..
ద్వారకాతిరుమల : కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. ఇది మనందరికీ తెలిసిందే. మనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతాం. ఇదీ సాధారణమే. అయితే వనాల్లో తిరిగే మూగజీవాలైన వానరాల (కోతులు) కోసమే కార్తీక వన సమారాధన చేస్తే..? ఈ ఆలోచనే వచ్చింది జంగారెడ్డిగూడేనికి చెందిన ఎ.శ్రీరంగరాజ అనే వ్యక్తికి. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ వానర కార్తీక వన సమారాధన ద్వారకాతిరుమల మండలంలోని జి.కొత్తపల్లిలో కార్తీక మాస చివరిరోజైన శుక్రవారం జరిగింది. వనాల్లోంచి వందలాదిగా రహదారిపైకి వచ్చిన వానరాలకు ఫలాలు, తినుబండారాలను అందించి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మూగజీవాలు బతకాలని.. జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యాపారి శ్రీరంగరాజ ఆంజనేయ స్వామి భక్తుడు. వానరాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అడవులు నశించిపోతుండటం వల్ల మూగజీవాలన్నీ రోడ్డున పడుతున్నాయి. సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. దీన్ని చూసి ఆవేదనకు గురైన శ్రీరంగరాజ ఒక్కరోజైనా వాటికి కడుపునిండా ఆహారాన్ని అందించాలనుకున్నారు. ప్రస్తుతం కార్తీక వన సమారాధనలతో అన్ని కుల, మత వర్గాల వారు హడావుడిగా ఉన్నారు. వీటిని చూసింది తడవు ఆయన ఇలా జి.కొత్తపల్లిలోని అటవీ ప్రాంతం వద్ద వానర కార్తీక వస నమారాధనను జరిపారు. దాతకు జంగారెడ్డిగూడెంకు చెందిన కుక్కునూరి కృష్ణకుమార్, కోడూరి ఆంజనేయశర్మలు సహకరించి, వానరాలకు తినుబండారాలను అందించారు. ఆహారం పెడుతున్నారని తెలిసి.. తినుబండారాలను తీసుకొచ్చిన దాత ముందుగా కారు వద్ద ఆంజనేయుని చిత్రపటానికి పూజలు నిర్వహించారు. తరువాత పండ్లు, తినుబండారాలను వానరాలకు అందించడాన్ని మొదలు పెట్టారు. దీన్ని గ్రహించిన వానరాలు రోడ్డుపైకి పరుగులు తీస్తూ వచ్చాయి. మొదట నాలుగైదు వచ్చినా తరువాత వాటి సంఖ్య వంద వరకు వెళ్లింది. అవన్నీ పండ్లను అందుకున్నాయి. రోడ్డు వెంబడి మూడు నాలుగు ప్రాంతాల్లో ఈ తినుబండారాలను అందించారు. రహదారిపై వెళుతున్న ఆ కారు హారన్ విన్న వానరాలు.. పరుగు పరుగున కారు దగ్గరకు వచ్చి, వారందించిన పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి అందుకున్నాయి. వాటిని ఆరగించిన తరువాత అడవిలోకి పరుగులు తీశాయి. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి చాలా మంది మూగజీవాలను పట్టించుకోరు. మానవ మనుగడకు అవి ఎంతగానో దోహద పడతాయి. ముఖ్యంగా జంతువులకు సేవ చేస్తే నేరుగా ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. నానాటికీ అడవులు నశించి పోతున్నాయి. ఉన్న కొద్ది పాటి అటవీ ప్రాంతాలను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇస్తోంది. దీని వల్ల మూగజీవాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అటవీశాఖ అధికారులు దీన్ని గ్రహించాలి. మూగజీవాలకు ఆహారాన్ని అందించేందుకు ఎవరికి వారు ముందుకు రావాలి. అదే నా ఆశయం. – ఎ.శ్రీరంగరాజ, జంగారెడ్డిగూడెం, దాత వానరాలకు సేవ చేయడం ఆనందం మూగజీవాలైన వానరాలకు ఇలా ఆహార పదార్థాలు అందించడం నాకెంతో ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో ఇలా వీటికి సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో ఆకలితో అవి పరుగు పరుగున వచ్చి తినుబండారాలను అందుకున్నాయి. – కుక్కునూరి కృష్ణకుమార్, జంగారెడ్డిగూడెం నరుడా నీ ఉనికి తెలుసుకో మనం వానర జాతి నుంచి ఉద్భవించి, నరుడిగా జ్ఞానోదయం పొంది, సమాజంలో జీవిస్తున్నాం. కానీ చాలా మంది వానరాలపై ప్రేమ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వానరులు వనాధిపతులు. అవి తల్లిదండ్రులతో సమానం. వాటిని మనం రక్షించుకోవాలి. వాటికి ఆహారాన్ని అందించే మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. ప్రతి ఒక్కరూ మూగజీవాలపై ప్రేమ చూపి, వాటికి ఆహారాన్ని అందించాలి. – కోడూరి ఆంజనేయ శర్మ, జంగారెడ్డిగూడెం -
వెయ్యి నోట్లు విసిరేశాడు
- కారులోంచి విసురుకుంటూ వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి - తీసుకొనేందుకు పరుగులు పెట్టిన జనం ద్వారకాతిరుమల: వచ్చీపోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి రూ.వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన రూ.వెరుు్య నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపుకు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు. -
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. మౌనరాగాలు ఎన్నినాళ్లూ.. అంటూ ఎదురుచూసిన కొత్త జంటలు ఒక్కటయ్యే సమయం వచ్చేసింది. మంగళవారం నుంచి మాఘమాసం మొదలుకావడంతో జిల్లావ్యాప్తంగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నెలరోజులపాటు వేలాది వివాహాలు జరుగనున్నాయి. వీటిలో వందలాది పెళ్లిళ్లకు చినవెంకన్న క్షేత్రం వేదికకానుంది. ఇప్పటికే క్షేత్రంలోని కల్యాణ మండపాలు, సత్రాలు బుక్ అయిపోయాయి. పెళ్లి బాజాలు, పచ్చిపూల మండపాలు, పురోహితులు, వంట మనుషులు, షామియానాలకు ముందస్తు బుకింగ్‌లు జరిగిపోయాయి. ఈనెల 11వ తేదీ నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. - ద్వారకాతిరుమల మాఘమాసంలో నెల పొడవునా ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో బలమైన ముహూర్తాలకు పలువురు ప్రాధాన్యమిస్తున్నారు. ముహూర్తాలకు తగ్గట్లు వివాహాలు కూడా వేల సంఖ్యలో జరగనుండటంతో ఇప్పటికే జిల్లాలోని అన్ని కల్యాణ మండపాలు, సత్రాలు బుక్ అయిపోయాయి. ద్వారకాతిరుమల క్షేత్రంలో నెలరోజులపాటు భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా వరకు గదులు, సత్రాలు, కాటేజీలు, కల్యాణ మండపాలు రిజర్వు అయ్యాయి. కేటరింగ్, పచ్చిపూల మండపాల అలంకరణ, లైటింగ్, బాజాభజంత్రీలు, ట్రావెల్స్, పురోహితులకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. పెళ్లి బృందాల వారు ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే క్షేత్రంలోని పలు కల్యాణ మండపాలు విద్యుద్దీప అలంకరణలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. మండపాలకు యమ డిమాండ్ వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి పచ్చిపూల మండపాలు. వీటి ధరలు ఈ ఏడాది ఆకాశాన్నంటడంతో పాటు మంచి గిరాకీ ఏర్పడింది. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు వీటి ధర పలుకుతోంది. ఈ క్రమంలో శేషాచలకొండపైన వివాహ వేడుకలకు సర్వం సిద్ధమవుతున్నాయి. మధ్య, పేద వర్గాల వారు ఆలయ ఆవరణలో వివాహాలు చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఆల్ ఫుల్ ఈనెల 12, 13, 24, 27వ తేదీల్లో జరుగనున్న వివాహాలను పురస్కరించుకుని ఆయా రోజులకు సంబంధించి ఇప్పటికే క్షేత్రంలోని దేవస్థానం, ప్రైవేటు సత్రాలు, గదులు, కాటేజీలు, కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. ముహూర్తాలు ఇలా ఈ ఏడాది మాఘమాసంలో ముహూర్తాల వివరాలను ద్వారకాతిరుమల చెందిన ప్రముఖ పురోహితుడు గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ వివరించారు. ఈనెల 11వ తేదీ రాత్రి 09.13 గంటలకు, 12న వేకువజాము 04.11కు, రాత్రి 07.34కు, 09.09 గంటలకు ముహూర్తాలు ఉన్నాయి. 13న వేకువజాము 04.07కు, 14న వేకువజాము 04.03, 05.34కు, 17న వేకువజాము 03.51, రాత్రి 08.49కు, 18న వేకువజాము 03.47కు ముహూర్తాలు ఉన్నాయి. 24వ తేదీన రాత్రి 8.21కు, 11.13కు, 25న వేకువజాము 04.50, ఉదయం 07.47కు, 26న ఉదయం 07.43, రాత్రి 08.13కు, 27న వేకువజాము 03.11, రాత్రి 8.09కు, 28న వేకువజాము 03.07కు, ఉదయం 07.35కు ముహూర్తాలు ఉన్నాయి. మార్చి 2న వేకువజాము 04.24, 3న ఉదయం 07.22, 5న రాత్రి 02.43, 6న వేకువజాము 04.14 గంటలకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో ఈనెల 11, 12, 17, 25, 26, 27వ తేదీలు, వచ్చేనెల 3, 6 తేదీల్లో ముహూర్తాలు బలమైనవివని వెంకటరమణమూర్తి శర్మ తెలిపారు. నెల పొడవునా ముహూర్తాలు ఈ మాఘమాసంలో వివాహాలకు అధిక ముహూర్తాలు ఉండటంతో పాటు, అన్ని నక్షత్రాల వారికి తగిన బలమైన ముహూర్తాలొచ్చాయి. ఏటా ఈ మాసంలో నాలుగైదు ముహూర్తాలు మాత్రమే వచ్చేవి. దీంతో పెళ్లి బృందాల వారు త్వరపడాల్సి వచ్చేది. అయితే ఈ సారి ఆ పరిస్థితులు లేవు. నెల పొడవునా బలమైన ముహూర్తాలు ఉన్నాయి. ఒక్క ద్వారకాతిరుమల క్షేత్రంలోనే వందలాది వివాహాలు జరగనున్నాయి. ఇప్పటికే పురోహితులందరూ పెళ్లిళ్లను ఒప్పుకుని బిజీగా ఉన్నారు. - గోవిందవఝుల వెంకటరమణమూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
భార్యలా చూడమందని చంపేశాడు
రామసీత హత్య కేసులో నిందితుడి లొంగుబాటు ద్వారకాతిరుమల : మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజు ఆమెను వదిలించుకోవటానికి హత్య చేశాడని భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో శనివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా ఐ.రుద్రవరానికి చెందిన పడమటి రామసీత(28)కు కైకలూరుకు చెందిన వెలివల రవికుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహానంతరం వారు ద్వారకాతిరుమలలో స్థిరపడ్డారు. వీరికి తొమ్మిదేళ్ల వయసు కుమార్తె ఉంది. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజుకు, రామసీతకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో రామసీత దంపతుల మధ్య వివాదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. అప్పటి నుంచి రామసీత పోషణను నాగరాజే చూస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు గుండుగొలనుకుంట కాలనీలో రామసీతకు చెందిన 3 సెంట్ల ఇంటి స్థలాన్ని, ఆమె కుమార్తెకు చెందిన బంగారు గొలుసును అమ్ముకున్నాడు. ఏం జరిగిందంటే.. భార్యతో సమానంగా తననూ చూడాలని రామసీత కొద్దిరోజుల నుంచి నాగరాజుపై ఒత్తిడి తీసుకొస్తోంది. తనను ఆలయాలకు తీసుకెళ్లాలని అడుగుతోంది. మరోపక్క వీరి విషయం తెలిసి నాగరాజు కుటుంబంలో కలహాలు రేగాయి. రామసీత వల్ల తన పరువు దెబ్బతిని మనుగడకే ముప్పు వాటిల్లుతోందని నాగరాజు భావించాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 1న ఉదయం దేవస్థానం కార్యాలయానికి వెళుతున్నానని ఇంటి దగ్గర చెప్పిన నాగరాజు నేరుగా రామసీత ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె కుమార్తెను పిలిచి మీ అమ్మకు, నాకు ఏ విధమైన సంబంధం లేదని తన భార్యతో చెప్పమని లక్ష్మీపురంలోని తన ఇంటికి పంపించాడు. అనంతరం నాగరాజు ఒక చీరను ఒడిచుట్టి రామసీత మెడకువేసి బిగించాడు. ఆమె కేకలు వేయకుండా అదే చీరను నోటిపై చుట్టి హత్య చేసి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న రామసీత కుమార్తె తన తల్లి ఎంతకీ కదలకుండా పడి ఉండటంతో చుట్టుప్రక్కల వారికి తెలిపింది. స్థానికులు పోలీస్టేషన్‌కు సమాచారం అందించడంతో భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలింపు చేపట్టారు. శనివారం ఉదయం ద్వారకాతిరుమల వీఆర్వో లక్ష్మీపతి సమక్షంలో నాగరాజు లొంగిపోయి, తన తప్పు ఒప్పుకున్నాడని సీఐ వివరించారు. అతడిని భీమడోలు కోర్టులో హాజరు పరచగా జడ్జి ఎస్.వెంకటేశ్వరరెడ్డి రిమాండ్ విధించారు. రామసీత ఫోన్ తీసుకెళ్లిన నాగరాజు అందులోని సిమ్ కార్డులు, మెమొరీ కార్డును రాజమండ్రి వద్ద గోదావరిలో పడేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను రద్దు చేయాలి
ద్వారకాతిరుమల : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ విద్యుత్ సంస్థను ఆర్థికంగా దిగజారుస్తోందని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్ అన్నారు. ద్వారకాతిరుమలలోని ఓ కల్యాణమండపంలో గురువారం విద్యుత్ ఉద్యోగ సంఘం నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని, అదనపు పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లకు ఒకసారి చేసే వేతన సవరణను ప్రభుత్వం సక్రమ పద్ధతిలో నిర్వహించాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల అర్హత ప్రకారం వారిని రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్రంలో కోటి 65 లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా, ఇవి గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలకు 35 వేల మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, దీంతో పనిభారం పెరిగిపోయిందన్నారు. వెయ్యి మంది వినియోగదారులకు నిబంధనల ప్రకారం నలుగురు ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 1.91 మంది మాత్రమే ఉన్నారన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాన్ని 15 శాతం పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు దాన్ని అమలు చేయలేదన్నారు. యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు సూచనలిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన 60 ఏళ్ల పదవీ విరమణ వయసును తమకు వర్తింప చేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లా డి 8 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. దీనిపై స్పందించకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్లకు ప్రమాద బీమా రూ.5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం, నిత్యం ప్రమాదపుటంచున పని చేస్తున్న తమ శాఖ ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందన్నారు. విద్యుత్‌శాఖలో ఖాళీ అయిన పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థల్లో పనిచేసే అన్‌స్కిల్డ్ కార్మికులకు రూ. 2,500 పెంచిన ప్రభుత్వం, తమ శాఖలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు రూ. 3,500 లను పెంచి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు. సంఘ రాష్ట్ర సలహాదారుడు ఎస్.శోభనాద్రి, రాష్ట్ర, జిల్లా ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
పింఛను రాదన్న వేదనతో ఆత్మహత్య
ద్వారకాతిరుమల : ఇక పింఛను రాదు.. జీవితాంతం కుటుంబ సభ్యులపై ఆధారపడుతూ.. వారికి భారం కావడాన్ని జీర్ణించుకోలేని ఆ వికలాంగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్త ప్రభుత్వం తన జీవితంలో వెలుగులు తెస్తుందని కొండంత ఆశపడ్డ ఆ వికలాంగ యువకుని జీవితం అంతమయింది. అర్హుడైనా పింఛను రాక తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ యువకుడు చివరకు పురుగుల మందు తాగి విగతజీవుడయ్యాడు. ఈ ఘటన మండల కేంద్రమైన ద్వారకాతిరుమల బస్టాండులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొరసానిపాడు గ్రామానికి చెందిన ముంగమూరి నాగరాజు(32)కు పుట్టుకతోనే పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలకు ముగ్గురు కుమారులు కాగా, ఇతను రెండవ సంతానం. నడవలేని ఇతడిని ఇప్పటి వరకు తల్లితండ్రులే పోషించారు. అయితే సైకిల్ రిపేరు షాపు నిర్వహిస్తూ కుటుంబానికి తన వంతు ఆసరాగా నిలిచాడు. ప్రస్తుతం ఈ పనులకు ఆదరణ లేకపోవడంతో నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతనికి వికలాంగ పింఛను రూ.500 మంజూరయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పది నెలల క్రితం పింఛను అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇదేంటని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. ఏప్రిల్ నెలలో పింఛన్ వచ్చింది. తర్వాత మళ్లీ ఆగిపోయింది. వారం రోజుల క్రితం తన తల్లితండ్రులతో చెప్పి హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం రాత్రి ద్వారకాతిరుమలకు చేరుకున్న నాగరాజు బస్టాండులో విగత జీవుడై పడిఉన్నాడు. అతని పక్కనే పురుగుమందు డబ్బా, పింఛనుకోసం తిరిగిన కాగితాలు పడి ఉన్నాయి. సోమవారం ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి మృతుని బంధువులకు సమాచారమిచ్చారు. పింఛను రాకే... బస్టాండుకు చేరుకున్న నాగరాజు బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు పింఛను అందకపోవడం వల్లే నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడని, దీనికి ప్రభుత్వం, అధికారులు, ఇక్కడి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజమెత్తారు. ఘటనా స్థలానికి పోలీసులు, అధికారులు సకాలంలో రాలేదంటూ వారు బస్టాండు వద్ద ఆందోళనకు దిగారు. ఇక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బుసనబోయిన సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకలపాటి త్యాగభీమేశ్వరరావు, నాయకులు యాచమనేని నాగేశ్వరరావు తదితరులు ఎన్నికలలో టీడీపీకి అనుకూలంగా ఉండని వారి పింఛన్లు తొలగిస్తారా.. అని తహసిల్దారు ఎల్.దేవకీదేవిని వారు నిలదీశారు. దీనికి ఆమె సమాధానమిస్తూ సాంకేతిక సమస్య కారణంగా ఇతనికి పింఛన్ నిలిచిపోయిందని, జూన్ నెలలో పింఛను వచ్చిందని చెప్పారు. దీనికి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలపలేదని, ఈ నెలలో మళ్లీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి తహసిల్దారు సమాధానమిస్తూ సంబంధిత అధికారి ఎంపీడీవో పురుషోత్తమరావు అనారోగ్య కారణంగా ఈరోజు విధులకు రాలేదన్నారు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, తక్షణమే నష్టపరిహార విషయాన్ని తేల్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు ఆర్డీవో తేజ్ భరత్‌తో ఫోన్లో మాట్లాడిన అనంతరం నాయకులు స్థానిక తహసిల్దారు ఎల్.దేవకీదేవి, ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్‌లతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు భారం కాలేను నెలకు రూ. 1500 వస్తాయని, వాటితో జీవిద్దామని ఆశపడ్డ నాగరాజు ఆ పింఛను కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నాడు. కుటుంబ సభ్యులు, తన తల్లితండ్రులపై ఆధారపడి జీవించలేక పోతున్నానని అనేకసార్లు తమ వద్ద మొరపెట్టుకున్నాడని అతని స్నేహితులు చెబుతున్నారు. చివరికి ఇంక పింఛను రాదని తెలిసిందో.. ఏమో.. ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇది ప్రభుత్వ హత్యే నాగరాజుది ప్రభుత్వ హత్యేనని, లబ్ధిదారులను తగ్గించేందుకు కమిటీల పేరుతో వడబోత పెట్టి ఇలాంటి అర్హుల ఉసురును టీడీపీ ప్రభుత్వం తీస్తోందని వైఎస్సార్సీపీ నేత గంటా మురళీరామకృష్ణ అన్నారు. అంగవైకల్యం 90 శాతం ఉన్న నాగరాజుకే ఇవ్వకుంటే.. మరి పింఛన్లు ఎవరికిస్తున్నట్టని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో షర్మిలను కలసిన నాగరాజు గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర దొరసానిపాడుకు చేరుకున్న సమయంలో నాగరాజు ఆమెను కలుసుకుని తన కష్టాలను చెప్పుకున్నాడు. తనకు వికలాంగ రిక్షాను ఇప్పించాలని ఆమెను కోరాడు. దీనికి స్పందించిన షర్మిల వైఎస్సార్సీపీ పాలనలోకి వచ్చిన తరువాత అంతా మంచి జరుగుతుందని చెప్పి, పాదయాత్ర ముగియగానే అప్పటి ఎమ్మెల్యే తానేటి వనిత ద్వారా రిక్షాను నాగరాజుకు అందించారు. దీంతో అతడు ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారం చేశాడు. దీని కారణంగానే ఇప్పుడు టీడీపీ నాయకులు తన కుమారుడికి పింఛను రాకుండా చేశారని నాగరాజు తల్లితండ్రులు ఇసాకు, గంగమ్మలు ఆవేదన చెందారు. -
దేవాదాయ శాఖ ఇన్చార్జి ఆర్జేసీగా త్రినాథరావు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావును దేవాదాయ శాఖ ఇన్చార్జి రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)గా నియమిస్తూ ఆ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం ఆర్జేసీ హోదాలో ఉంది. ఇక్కడ త్రినాథరావు 2013 జనవరి 1 నుంచి డెప్యూటీ కమిషనర్ హోదాలో ఈవోగా పనిచేస్తూ వచ్చారు. -
స్టార్టింగ్ ట్రబుల్ తెచ్చిన తంటా
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమలలోని శేషాచలం ఘాట్‌రోడ్డు ఆదివారం ఉదయం హాహాకారాలతో మార్మోగింది. యాత్రా బస్సు అదుపుతప్పటంతో 21 మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇవి.. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామానికి చెందిన 40 మంది భవానీ దీక్షధారులు దీక్ష విరమణకు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి టూరిస్ట్ బస్సులో వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుంచి ఆదివారం వేకువ జాము 3 గంటలకు ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. బస్సుకు స్టార్టింగ్ ట్రబుల్ ఉండటంతో శేషాచలం ఘాట్‌రోడ్డు వాలులో డ్రైవర్ బస్సును పార్కింగ్ చేశాడు. స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణానికి ఉదయం 8 గంటలకు యూత్రికులు బస్సు వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగింది ఇలా.. మొత్తం 40 మంది యాత్రికుల్లో 30 మంది బస్సు ఎక్కారు. డ్రైవర్ టెంపల్లి బంగార్రాజు బస్‌ను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోరుుంది. రన్నింగ్‌లో స్టార్ట్ చేసేందుకుగాను బస్సు చక్రాల కింద ఉంచిన రాళ్లను తొలగించమని క్లీనర్ గంగరాజుకు సూచించాడు. రాళ్లు తొలగించిన అనంతరం బస్సు గేర్‌ను న్యూట్రల్ చేయడంతో అది కొండపై నుంచి దిగువకు వేగంగా దూసుకుపోవటం ప్రారంభించింది. ఎయిర్ బ్రేకులు పనిచేయలేదు. డ్రైవర్ సమయ స్ఫూర్తిగా లింగయ్య చెరువు సమీపంలోని 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని బస్సు ఢీకొనకుండా తప్పించాడు. బస్సు ఆ చెరువు గట్టుఢీకొని మీదకు ఎక్కింది. ఉండటంతో చెరువులోకి పడకుండా నిలిచింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాద సమయంలో ఏ వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. యాత్రికులు ఒకరికొకరు ఢీకొట్టుకోవటం, బస్సులో కింద పడిపోవడంతో గాయూలయ్యూరుు. వెంటనే స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను బయటకు తీశారు. 12 మందికి తీవ్రంగా, 9 మందికి స్వల్పంగా గాయూలయ్యూరుు. రెండు 108 అంబులెన్స్‌లలో ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తరలించారు. ముందునుంచే మొరాయించిన బస్సు యాత్ర ప్రారంభం నుంచే లక్ష్మీదేవి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు మొరాయిస్తూనే ఉందని యాత్రికులు చెప్పారు. ఆగిన ప్రతిసారి తాము తోస్తూ వచ్చామన్నారు. స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో డ్రైవర్ బస్సును వాలు ప్రాంతంలో పార్కింగ్ చేశాడన్నారు. బస్సు కండిషన్లో లేకపోవటమే ప్రమాదానికి కారణమని చెప్పారు. గాయాలైన వారు వీరు.. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం మద్ది గ్రామానికి చెందిన రామసింగ్ పద్మనాభస్వామి, కనకల మహాలక్ష్మి, కనకల పున్నమ్మ, రామసింగ్ పైడిరాజు, చిన్నారి ఆర్.లిఖిత , లక్ష్మీవరప్రసాద్, రామసింగ్ అప్పలకొండ, పడాల అప్పాయమ్మ, టెంపల్లి బంగార్రాజు (డ్రైవర్), కనకల సత్యనారాయణ, కనకల దుర్గాప్రసాద్, విశాఖజిల్లా తాడుతూరుకు చెందిన ఎలుసూరి వెర్రిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. మద్ది గ్రామానికి చెందిన కాళ్ల సూరిబాబు, సురాల కృష్ణ, వేణు రమణమ్మ, భూగత సత్యవతి, కాళ్ల నాగమణి, చిన్నారులు కనకల దుర్గమ్మ, రామసింగ్ ప్రసాద్, పోవన ప్రసాద్, కనకల శాంతికి స్వల్ప గాయూలయ్యూరుు. పీహెచ్సీలో అందుబాటులోలేని వైద్యులు ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించగా వైద్యులు అందుబాటులో లేరు. సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. ప్రముఖ పుణ్య క్షేత్రంలోని పీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రగాయూలైన 12 మందిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన అనంతరం వైద్యులు పీహెచ్‌సీకి చేరుకున్నారు. పీహెచ్‌సీలోని క్షతగాత్రులను భీమడోలు సీఐ దుర్గాప్రసాద్, తహసిల్దార్ చవాకుల ప్రసాద్ పరామర్శించారు. ఎస్సై కర్రి సతీష్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు
ద్వారకాతిరుమల : రాష్ట్రంలో దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమౌతోంది. దీంతో చినవెంకన్న దేవస్థానంలో పలువురు ఉద్యోగులకు వచ్చే నెలలో స్థానచలనం కలగనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కోరుతూ ఆయా దేవస్థానాల ఈవోలను కమీషనర్ ఇప్పటికే ఆదేశించారు. రాష్ట్రంలోని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం రమా సహిత సత్యనారాయణస్వామి, కాణిపాకం విఘ్నేశ్వరుడు, భద్రాచలం శ్రీరాముడు, శ్రీశైలం మల్లికార్జునస్వామి, యాదిగిరిగుట్ట, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం వంటి ప్రధాన దేవస్థానాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తయిన రికార్డు అసిస్టెంట్ స్థాయి నుంచి ఏఈవో స్థాయి వరకు బదిలీలకు రంగం సిద్ధమైంది. పాలనా సిబ్బందితో పాటు ఇంజినీరింగ్ విభాగ సిబ్బందికి కూడా ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. అభియోగాలున్న ఉద్యోగులపై బదిలీల్లో ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈనెల 19న జారి అయిన జీవో 175 ను అనుసరించి వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది.