భార్యలా చూడమందని చంపేశాడు | woman Murder illegal affair with preist | Sakshi
Sakshi News home page

భార్యలా చూడమందని చంపేశాడు

Published Sun, Dec 6 2015 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

భార్యలా చూడమందని చంపేశాడు

భార్యలా చూడమందని చంపేశాడు

రామసీత హత్య కేసులో నిందితుడి లొంగుబాటు
 ద్వారకాతిరుమల : మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజు ఆమెను వదిలించుకోవటానికి హత్య చేశాడని భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో శనివారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా ఐ.రుద్రవరానికి చెందిన పడమటి రామసీత(28)కు కైకలూరుకు చెందిన వెలివల రవికుమార్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది.
 
 వివాహానంతరం వారు ద్వారకాతిరుమలలో స్థిరపడ్డారు. వీరికి తొమ్మిదేళ్ల వయసు కుమార్తె ఉంది. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఉపాలయమైన కుంకుళ్లమ్మ ఆలయ అర్చకుడు కుందుర్తి నాగరాజుకు, రామసీతకు కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో రామసీత దంపతుల మధ్య వివాదాలు జరిగాయి. రెండేళ్ల క్రితం వారు విడిపోయారు. అప్పటి నుంచి రామసీత పోషణను నాగరాజే చూస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతడు గుండుగొలనుకుంట కాలనీలో రామసీతకు చెందిన 3 సెంట్ల ఇంటి స్థలాన్ని, ఆమె కుమార్తెకు చెందిన బంగారు గొలుసును అమ్ముకున్నాడు.
 
  ఏం జరిగిందంటే..
 భార్యతో సమానంగా తననూ చూడాలని రామసీత కొద్దిరోజుల నుంచి నాగరాజుపై ఒత్తిడి తీసుకొస్తోంది. తనను ఆలయాలకు తీసుకెళ్లాలని అడుగుతోంది. మరోపక్క వీరి విషయం తెలిసి నాగరాజు కుటుంబంలో కలహాలు రేగాయి. రామసీత వల్ల తన పరువు  దెబ్బతిని మనుగడకే ముప్పు వాటిల్లుతోందని నాగరాజు భావించాడు. ఆమెను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 1న ఉదయం దేవస్థానం కార్యాలయానికి వెళుతున్నానని ఇంటి దగ్గర చెప్పిన నాగరాజు నేరుగా రామసీత ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె కుమార్తెను పిలిచి మీ అమ్మకు, నాకు ఏ విధమైన సంబంధం లేదని తన భార్యతో చెప్పమని లక్ష్మీపురంలోని తన ఇంటికి పంపించాడు.
 
 అనంతరం నాగరాజు ఒక చీరను ఒడిచుట్టి రామసీత మెడకువేసి బిగించాడు.  ఆమె కేకలు వేయకుండా అదే చీరను నోటిపై చుట్టి  హత్య చేసి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న రామసీత కుమార్తె తన తల్లి ఎంతకీ కదలకుండా పడి ఉండటంతో చుట్టుప్రక్కల వారికి తెలిపింది. స్థానికులు పోలీస్టేషన్‌కు సమాచారం అందించడంతో భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సై బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల ఎస్సై సీహెచ్.సతీష్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలింపు చేపట్టారు.
 
 శనివారం ఉదయం ద్వారకాతిరుమల వీఆర్వో లక్ష్మీపతి సమక్షంలో నాగరాజు లొంగిపోయి, తన తప్పు ఒప్పుకున్నాడని సీఐ వివరించారు. అతడిని భీమడోలు కోర్టులో హాజరు పరచగా జడ్జి ఎస్.వెంకటేశ్వరరెడ్డి రిమాండ్ విధించారు. రామసీత ఫోన్ తీసుకెళ్లిన నాగరాజు అందులోని సిమ్ కార్డులు, మెమొరీ కార్డును రాజమండ్రి వద్ద గోదావరిలో పడేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement