జిల్లాలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పింఛన్లు ఎట్టకేలకు ఏప్రిల్ 1 నుంచి అందనున్నాయి. జనవరిలో జరిగిన జన్మభూమి సభల్లో పింఛన్ల పంపిణీ అంటూ ఊదరగొట్టి చేతికి మంజూరు పత్రాలను అందజేసి మూడునెలల తర్వాత ఉగాది నుంచి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయకపోవడంతో ఎప్పటి లాగే మాట తప్పి ఎట్టకేలకు ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మదనపల్లె: జిల్లాలో గత మూడు నెలలుగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పండుటాకులకు ఊరట కలగనుంది. ఈ ఏడాది నూతనంగా పింఛన్ల కోసం 26,907 మంది దరఖాస్తు చేసుకుంటే వాటిలో 23,147 పింఛన్లను మంజూరు చేస్తూ 3,760 దరఖాస్తులను తిరస్కరించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్లు 1,94,722, వితంతువులు 1,47,904, దివ్యాంగులు 50,249, చేనేత కార్మికులు 6,559, కల్లు గీత కార్మికులు 441 మందికి రూ.43,86,53,500 రూపాయలు అందజేస్తున్నారు. వీటికి అదనంగా నూతనంగా ఒకో నియోజకవర్గానికి 2000 పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల మంజూరుపై పలువురు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అర్హత ఉండి పింఛన్లకు నోచుకోనివారు సైతం ఈసారి పింఛన్లు అందుకుంటామని ఎదురు చూసినా నిరాశే ఎదురైంది. ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం ప్రకటన కూడా అదే దారే. జన్మభూమి కమిటీల ప్రమేయం లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామన్న హామీ అమలు కాలేదు. ప్రస్తుతం పాత పద్ధతిలోనే కొత్త పింఛన్ల మంజూరు వ్యవహారం కొనసాగుతోంది.
సర్వేదే కీలకపాత్ర
ప్రజాసాధికారిక సర్వేను ఆధారంగా చేసుకుని పింఛన్ల మంజూరుకు శ్రీ కారం చుట్టారు. ప్రజాసాధికారిక సర్వేలో వివరాల ప్రకారం దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలు ఉండీ, జన్మభూమి కమిటీ సభ్యుల ఆమోదం వచ్చాకే వాటిని ఇచ్చేందుకు ఎంపిక చేశారు. మిగిలిన వాటిని తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment