సీఆర్డీఏ అధికారులకు షాక్
అమరావతి: సీఆర్డీఏ అధికారులకు పెనుమాక రైతులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. భూసేకరణ అభ్యంతరాలపై ఈరోజు సీఆర్డీఏ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లకూడదని అన్నదాతులు నిర్ణయించారు. దీనిపై పెనుమాకలో డప్పుతో చాటింపు కూడా వేయించారు. ఇకపై సీఆర్డీఏ అధికారులు ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేసినా హాజరుకాకూడదని గ్రామస్తులు నిర్ణయించారు.
రెండేళ్లలో చాలాసార్లు అభ్యంతరాలు ఇచ్చామని, అధికారులు ఏ ఒక్కటీ పట్టించుకోలేదని.. పైగా సమావేశాలకు పిలిచి అక్రమ కేసులు పెడుతున్నారని పెనుమాక రైతులు తెలిపారు. ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
రాజధానికి భూసేకరణ కోసం ఇంతకుముందు సీఆర్డీఏ నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈనెల 6న ఎమ్మెల్యే ఆర్కేను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.