ఎమ్మెల్యే ఆర్కేపై కేసు
అమరావతి: ప్రతిపక్ష నాయకులపై ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. రైతుల పక్షాన నిలబడ్డారనే అక్కసుతో విపక్ష ఎమ్మెల్యేపై చంద్రబాబు సర్కారు కేసులో ఇరికించింది. రాజధానికి భూసేకరణ కోసం నిర్వహించిన బహిరంగ విచారణను అడ్డుకున్నారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) సహా 13 మంది పెనుమాక రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. మరికొంత మంది రైతులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
తమపై తప్పుడు కేసులు పెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. న్యాయం చేయమని అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. మీటింగ్ మినిట్స్ ఎందుకు రాయడం లేదని, అంతా ప్రభుత్వం ఇష్టమేనా అని నిలదీశారు. రైతులను బెదిరించి భూములు లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోందని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆరోపించారు. ఎమ్మెల్యే ఆర్కే, రైతులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
పెనుమాక రైతులపై కేసులు పెట్టడాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం రైతులు చేసిన నేరమా, అన్నదాతల తరపున స్థానిక ఎమ్మెల్యే నిలబడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. దుర్మార్గపు పోకడలను చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు.