భూ సేకరణ ఆపకపోతే దీక్షకు సిద్ధం | pawan kalyan oppose land pooling in AP capital area | Sakshi
Sakshi News home page

భూ సేకరణ ఆపకపోతే దీక్షకు సిద్ధం

Published Mon, Aug 24 2015 3:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

భూ సేకరణ ఆపకపోతే దీక్షకు సిద్ధం - Sakshi

భూ సేకరణ ఆపకపోతే దీక్షకు సిద్ధం

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్  
* కన్నీళ్లతో కట్టే రాజధాని వద్దు
* టీడీపీకి మిత్రపక్షమే కానీ.. బానిసను కాను
* వైఎస్సార్‌సీపీ శత్రువు కాదు.. నాకు ఏ పార్టీ ఎక్కువ కాదు

సాక్షి, గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ప్రకటించిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే నిలిపివేయక పోతే తాను బరిలోకి దిగుతానని.. అవసరమైతే ధర్నా, నిరాహార దీక్షకు సిద్ధమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

రాజధాని ప్రాంతం మంగళగిరి మండలం పెనుమాక గ్రామంలోని ఓ కళాశాల ఆవరణలో ఆయన ఆదివారం స్థానిక రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రాజధాని నిర్మాణంపై టీడీపీ అధిష్టానం తనతో చెప్పింది వేరని, ఇప్పుడు జరుగుతోంది వేరని ఆక్షేపించారు. రైతుల నుంచి భూములు తీసుకోబోమని చెప్పారని, ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వచ్ఛందంగా భూమలు ఇస్తే తీసుకోవచ్చని, బలవంతంగా తీసుకుంటామంటే మాత్రం ఊరుకోనని ఉద్ఘాటించారు.
 
వ్యవసాయం లేకుంటే ఇబ్బందులు తప్పవు
‘‘కుప్పంలో నీరు లేకపోవడంతో ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొని పంటలు పండిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో 20 అడుగుల్లోనే నీరు ఉండగా ఎందుకు ఇక్కడి భూములను వ్యవసాయానికి పనికిరాకుండా చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపుకుంటూ పోతే ఇబ్బందులు తలెత్తుతాయి. నేను తోటి రైతుగా ఇక్కడికి వచ్చా. ఇక్కడి రైతులకు అండగా ఉంటా’’ అని పవన్ పేర్కొన్నారు.

3,500 ఎకరాల కోసం రాద్ధాంతం ఎందుకని మంత్రి రావెల చేసిన వ్యాఖ్య పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో 15 ఎకరాల స్థలం కోల్పోతే టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఎందుకు సుప్రీం వరకు వెళ్లారని ప్రశ్నించారు. ల్యాండ్‌బ్యాంక్ ఉన్న ఆయనే అంత విలవిలలాడితే ఎకరా, అర ఎకరా ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం త్యాగాలు చేయాలంటూ ఎంపీ గల్లా జయదేవ్ చెబుతున్నారని, మన దాకా వస్తే కానీ త్యాగాల విలువ తెలియదని మండిపడ్డారు. తాను టీడీపీకి మిత్రపక్షమే కానీ.. బానిసను మాత్రం కానని స్పష్టం చేశారు.
 
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోతే?
రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని చట్టబద్ధత కలిగిన కాగితంపై వారికి లిఖితపూర్వకంగా భరోసా కల్పించాలని కోరారు. సీఆర్‌డీఏ చట్టంలో లోపాలున్నాయని, వాటిని వెంటనే సరిచేయాలని చెప్పారు. రాజధానిపై సలహాలు సూచనల కోసం ఇంజినీర్లు, అనుభవజ్ఞులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
 
కన్నీటితో కట్టే రాజధాని మంచిది కాదు
ఆనందంతో కట్టే రాజధాని కావాలి కానీ, కన్నీటితో కట్టే రాజధాని మంచిది కాదని చెప్పారు. తాను టీడీపీతో, బాబుతో గొడవకు రాలేదని వివరించారు. గొడవ పడితే సమస్య పరిష్కారం అవుతుందంటే అందు కు సిద్ధమన్నారు. వైఎస్సార్‌సీపీ తనకు శత్రువు కాదని, తన కు ఎవరితోనూ వ్యక్తిగత శతృత్వం లేదన్నారు. ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ కాదని, తాను ప్రజల పక్షమని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే దేనికి వెనుకాడనని, చావుకు కూడా వెనుకాడనని తెలిపారు.

అన్నయ్య(చిరంజీవి) మనసు గాయపరిచి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చానని, తన చిత్తశుద్ధిని శంకిస్తే తనలో మరో మనిషిని చూస్తారని హెచ్చరించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, కులాల కుమ్ములాటలు జరిగే ప్రమాదం ఉందని పవన్ పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే మేల్కొని పరిస్థితిని చక్కదిద్దకుంటే అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.

చంద్రబాబు రాజధాని నిర్మాణానికే పరిమితమైతే రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి వస్తుందన్నారు. ఆ ప్రాంతానికి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఉందన్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లోనే కాదుకదా మరే ఎన్నికల్లోనూ టీడీపీ అధికారంలోకి రాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement