10 నుంచి లాటరీ ద్వారా రైతులకు ప్లాట్లు
మంత్రి నారాయణ వెల్లడి
సాక్షి, విజయవాడ బ్యూరో: జూన్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 23 వరకు రాజధాని రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు. లాటరీ తీసిన వెంటనే ఏ రైతుకు ఎక్కడ ప్లాటు కేటాయిస్తారనే విషయాన్ని తెలిపేందుకు జియో కో-ఆర్డినేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు.
తమకు రావాల్సిన ప్లాట్లకు సంబంధించి రైతులు 9.18ఎ, 9.18బి ఫారాల ద్వారా ఆప్షన్లు సమర్పించే గడువు శుక్రవారంతో ముగుస్తున్నా రైతుల కోసం ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భూసమీకరణ ప్యాకేజీ కింద మెట్ట రైతులకు అదనంగా 50 గజాలు ఇచ్చేందుకు ఈ సమావేశం ఆమోదించినట్లు చెప్పారు. రాజధాని గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్ ఇండెక్స్ ఏరియా) నిబంధనల సవరణకూ సమావేశం ఆమోదం తెలిపిందని, ఇదే విధానాన్ని సీఆర్‌డీఏ పరిధి అంతటికీ వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.