తిరుపతి (మంగళం), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం జైల్లో నిరాహారదీక్ష చేస్తున్న జగన్ వెంటే జనం ఉన్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం తుడా సర్కిల్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద రిలే నిరాహారదీక్ష చేస్తున్న ఎస్టీలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు. అంతకు ముందు సమైక్యాంధ్ర నినాదంతో జగన్ ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో వేలాదిమంది జగన్ ఫొటో ప్లకార్డులతో ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. సుమారు మూడుగంటల పాటు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆందోళన చేశారు.
అనంతరం లంబాడీలు నృత్యాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో మహోన్నత వ్యక్తిగా నిలిచిపోతారన్నారు. భారతదేశ రాజకీయాల్లోనే సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నది ఒక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఏడు కోట్ల మంది జనం జగనన్న వెంట ఉన్నారని పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విభజన ప్రకటన చేసిన సోనియాగాంధీ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జగన్ ఆశయాలతో ఉద్యమాలను మరింత తీవ్ర ం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
సమైక్యం కోసం కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎక్కడా ఉద్యమాలు చేసిన దాఖలాలు కనిపించడం లేదని, దీంతో సమైక్యాంధ్రపై వారికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలతోనే నేడు సీమాంధ్రులకు ఈ గతి పట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, ఎస్‌కే.బాబు, ఎస్టీ విభాగం నాయకుడు హనుమంత్‌నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
జగనన్న వెంటే జనం
Published Mon, Aug 26 2013 4:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM
Advertisement