► అధికారులు లేకపోవడంతో జనం అవస్థలు
► ఎక్కడి పనులు అక్కడే..
► కార్యాలయాల చుట్టూ అవసరార్థుల ప్రదక్షిణ
► పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు
► పింఛనుదారులతో కార్యక్రమాలు
నవ నిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వం పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాల్సిన అధికారులు కాస్తా కార్యాలయాలు వదిలి రోడ్ల వెంట తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఆరు రోజుల పాటు ఆఫీసుల ముఖం చూడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు కూడా దీక్షల కారణంగా రద్దు కావడం గమనార్హం.
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావడం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలుకు నోచుకోకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను పావులుగా వాడుకుని ప్రభుత్వం తరపున ప్రచారం చేయిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నవ నిర్మాణ దీక్షల పేరిట అధికారులను రోడ్ల వెంట తిప్పడం.. కార్యక్రమాలకు జనం రాకపోవడంతో పింఛనుదారులతో మమ అనిపించడం జరిగింది.
ఇక సమావేశాలు, సెమినార్లకు పొదుపు మహిళలు.. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లతో పాటు అన్ని శాఖల ఉద్యోగులను బలవంతంగా తరలించడం విమర్శల పాలయింది. కార్యక్రమాల్లో ప్రభుత్వ పనితీరును చెప్పడం తిప్పస్తే ప్రజల నుంచి ఒక్క వినతి కూడా తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా, డివిజన్, మండల అధికారులతో పాటు సిబ్బంది కూడా దీక్షల్లో పాల్పంచుకోవడం వల్ల ప్రజా సమస్యలను పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. దీక్షల కోసం ఏకంగా విత్తనాల పంపిణీని నిలిపేయడం పట్ల రైతులు గగ్గోలు పెట్టారు.
ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ
కీలకమైన సమయంలో దాదాపు వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉండటం అన్ని వర్గాల ప్రజల ఇబ్బందికి కారణమైంది. ఒకవైపు విత్తన పనులు ప్రారంభమయ్యాయి. మరో వైపు విద్యాసంవత్సరం మొదలు కానుండటంతో వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అడంగల్, 1–బి తదితరాల కోసం అనేక మంది రైతులు వచ్చి వెళ్తున్నారు. నీటి సమస్యలు, పశుగ్రాసం కొరత తదితరాలపై మండల పరిషత్ కార్యాలయాలకు నిత్యం అనేక మంది వస్తుంటారు. 2 నుంచి 7వ తేదీ వరకు అధికారులు, సిబ్బంది నవనిర్మాణ దీక్షలకు వెళ్లడంతో వీరంత అనేక ఇబ్బందులు పడ్డారు. అధికారులు లేకపోవడం వల్ల ఎక్కడి పైళ్లు అక్కడే.. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఉద్యోగల మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితి తలెత్తింది.
పరువు పోకుండా ఉండేందుకు తంటాలు
నవనిర్మాణ దీక్షల కారణంగా పరువు పోకుండా ఉండేందుకు అధికారులు, దేశం నేతలు ఎంతో కష్టపడ్డారు. సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో బలవంతంగా తరలించి మరీ కూర్చోబెట్టారు. వృద్ధులు, వితంతువులకు పింఛన్లు దీక్షా కార్యక్రమాల్లోనే పంపిణీ చేస్తామంటూ నమ్మబలికి రప్పించడం విమర్శలకు తావిచ్చింది. మరికొందరు కొత్త పింఛన్ల పేరిట మోసగించారు.
మంత్రాలయం నియోజకవర్గంలోని బంటుపల్లి గ్రామానికి చెందిన వృద్ధులు, వితుంతువులను నవనిర్మాణ దీక్ష సమావేశానికి తరలించడానికి పింఛన్లు ఎర వేశారు. ఎమ్మిగనూరులో మంత్రాలయం నియోజక టీడీపీ ఇన్‌చార్జి ఉన్నారు.. ఆయనను కలిస్తే పింఛన్లు వస్తామని టీడీపీ నేతలు నిమ్మించారు. దీంతో వృద్ధులు, వితంతువులు అతి కష్టం మీద ఎమ్మిగనూరుకు వెళ్లి ఆయనను కలిశారు. అయితే మంత్రాయంలో జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి వస్తే పింఛన్లు వస్తాయని చెప్పడంతో అక్కడికీ వెళ్లారు. మొత్తంగా 100 కిలోమీటర్లు ప్రయాణించి దీక్షకు వెళితే.. కార్యక్రమం ముగిశాక ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.
నంద్యాలలో ఉద్యోగులు, పొదుపు మహిళలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను నిర్బంధంగా నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో పాల్లొనేలా ఆదేశించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
డోన్ పట్టణంలోని ఎస్‌కేపీ హైస్కూల్ ఆవరణలో గురువారం నవ నిర్మాణ దీక్షల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. అయితే పాల్గొన్న వారెవరూ బయటకు వెళ్లకుండా టీడీపీ నాయకులు స్కూల్ గేటుకు తాళం వేయడం చర్చనీయాంశంగా మారింది.
కౌన్స్‌లింగ్ ఉంది ఏం చేయాల్నో
డిగ్రీ పూర్తయింది. పీజీ కౌన్సెలింగ్‌కు వెళ్లాలి. ఇన్‌కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం మీ సేవలో అప్లై చేసి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న. అధికారులు, సిబ్బంది నవనిర్మాణ దీక్షలో ఉన్నారని ఆలస్యమౌతోంది. ఇప్పుడు సారోళ్లు వచ్చినా కౌన్సెలింగ్ లోపు సర్టిఫికెట్లు అందుతాయో లేదోనని టెన్షన్‌గా ఉంది. ఇన్‌చార్జి ఎవరైనా ఉన్నారా అంటే ఎవర్ని అడిగినా తహసీల్దార్ సార్ రావాల్సిందే అంటున్నారు. – రాజశేఖర్, రామళ్లకోట
2 నుంచి 7వ తేదీ వరకు చేపట్టిన కార్యక్రమాలు,
హాజరైన ప్రజల వివరాలు ఇలా..
తేదీ సమావేశాలు/ సెమినార్లు హాజరైన ప్రజలు
2వ తేదీ – 16,330
3వ తేదీ 19 22915
4వ తేదీ 28 17662
5వ తేదీ 26 27391
6వ తేదీ 52 23457
7వ తేదీ 33 21251
మొత్తం 158 2,29,006
దీక్ష.. పరీక్ష
Published Fri, Jun 9 2017 11:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM
Advertisement
Advertisement