
జన్మభూమి కమిటీలకు కనికరం లేదు!
- జెడ్పీచైర్మన్ ఎదుట పెట్లూరువాసుల ఆవేదన
వెంకటగిరి: పెట్లూరుకు చెందిన వెంకటసుబ్బయ్య ఐదేళ్లుగా మంచానికి పరిమితమై ఉన్నాడు.. భార్య కూలీ పనులకు వెళితేనే పూట గడుస్తోంది.. దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యులు కనికరించలేదని బాధితుడి బంధువులు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గడపగడపకు వైఎస్సార్‌లో భాగంగా పెట్లూరు గ్రామంలో పర్యటించిన జెడ్పీ చైర్మన్‌కు ప్రజలు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు.
సబ్సిడీ రుణాలు, పింఛన్ల మంజూరులో అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జెడ్పీచైర్మన్ మాట్లాడుతూ వెంకటసుబ్బయ్య దీనస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా సహాయకార్యదర్శులు చిట్టేటి హరికృష్ణ, సాయినాయుడు, జిల్లా రైతువిభాగం కార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ ఆవుల గిరియాదవ్, మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు కూనా మల్లికార్జున్, మాజీ మండల కన్వీనర్ బత్తినపట్ల వీరారెడ్డి, వెంగమాంబపురం సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్ వెంకటకృష్ణమనాయుడు, నాయకులు కందాటి రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, మహిళా నేత ధనియాల రాధ, తదితరులు పాల్గొన్నారు.