
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల అరెస్టుపై జనాగ్రహం
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్రకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. అనైతిక పద్ధతిలో బహిష్కరించడమే కాకుండా అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు తీవ్రంగా ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై మాజీ ఎమ్మెల్యే సుబ్బారావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయభాస్కర్‌ల ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు రాస్తారోకో చేశారు.
జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం లో ధర్నా నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్‌లో కార్యకర్తలు మానవహారం ఏర్పాటు చేశారు. కొత్తపేట మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలమూరులో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు సీఎం కిరణ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. పలాసలో కేంద్ర మంత్రి కిల్లి కపారాణి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ వెంకటరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు.
నల్ల రిబ్బన్‌లతో నిరసన
అనంతపురంలో కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోదరుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మడకశిరలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.