స్వైన్ గణగణ | people in panic about swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్ గణగణ

Published Wed, Feb 11 2015 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

స్వైన్ గణగణ

స్వైన్ గణగణ

జిల్లాలో వ్యాధి విజృంభణ
వినుకొండలో ఒకరి మృతి
మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ
ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
నేటికీ ఏర్పాటు కాని నిర్ధారణ కేంద్రాలు
కనీసం స్క్రీనింగ్ కేంద్రాలు లేవు
 


సాక్షి, గుంటూరు : జిల్లాలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి కోరలు చాస్తోంది. వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వినుకొండకు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందాడు. జిల్లాలో మరో ముగ్గురికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన ఏడుగురు వ్యక్తులు అనుమానంతో గుంటూరు నగరంలోని జ్వరాల ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స పొందుతున్నారు. ఐడీహెచ్ వైద్యాధికారులు వారి శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని ఐపీఎంకు పంపగా, వారిలో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయిందని చెబుతున్నారు.

వీరిలో పేరేచర్ల గ్రామానికి చెందిన షేక్ బడేషా అనే వ్యక్తికి వ్యాధి పూర్తిగా నయం కావడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించారు. ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన వెంకటనర్సమ్మ అనే మహిళ, కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన అనూష(19) అనే యువతికి వ్యాధి నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. కాగా, గుంటూరుకు చెందిన ఎనుగంటి నర్సయ్య అనే వ్యక్తి హైదరాబాద్ వెళ్లి అక్కడ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది.

ఒంగోలులో మృతి..

ఇదిలా ఉంటే వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన దివ్వెల ఆంజనేయులు(33) అనే వ్యక్తి గత నెల 28వ తేదీన శ్వాస తీసుకోలేక స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు, అక్కడే చికిత్స పొందుతున్న అతడు సోమవారం రాత్రి మృతి చెందాడు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నప్పటికీ రెండు జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదని మృతుని బంధువులు ఆరోపించారు. ఆంజనేయులు మృతదేహాన్ని గ్రామంలోకి తేవడంతోనే ఎక్కువ సమయం ఉంచకుండా అంత్యక్రియలు ముగించారు.  విషయం తెలుసుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పద్మజారాణి ఆదేశాలతో వినుకొండలో గ్రామానికి చేరుకున్న సిబ్బంది ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

భయాందోళనలో ప్రజలు..

జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. గాలి ఆధారంగా సోకే వ్యాధి కావడంతో ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.  ప్రాంణాంతక వ్యాధి అయినప్పటికీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌లోని ఛాతి,ఊపిరితిత్తుల ఆసుపత్రిలో ఈ వ్యాధి నిర్ధారణ కేంద్రం ఉండేది. విభజన అనంతరం నవ్యాంధ్రలోని 13 జిల్లాల్లో ఎక్కడా నిర్ధారణ  కేంద్రంగానీ, పరికరాలు గానీ లేవు.

కనీసం హైదరాబాద్ నుంచి నవ్యాంధ్ర లోని జిల్లాలకు వచ్చే ప్రయాణికులను కనీసం స్క్రీనింగ్ చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టకపోవడం చూస్తుంటే ప్రజల ఆరోగ్యం పై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు  ఏ మాత్రం బాధ్యత లేదని అర్థమవుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 17న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అన్ని శైవక్షేత్రాలు జనంతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా జిల్లాలోని కోటప్పకొండ, అమరావతికి భక్తులు లక్షల్లో వస్తారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే  భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

కొచ్చెర్లను సందర్శించిన వైద్యుల బృందం

ఈపూరు : కొచ్లెర్లలో  వైద్యబృందం సోమవారం ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు నమోదు చేసుకున్నారు. గోరంట్ల నర్సమ్మకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించటంతో జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతోంది.  గుంటూరు ప్రభుత్వ వైద్యులు ఆద్మాలిస్ట్ కె.ఎస్ భానూ ప్రకాష్ ఆధ్వర్యంతో బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement