పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కూడా చూడలేకపోతున్నారు. చూడ లేకపోతే పోయేది ఏముందిలే అనుకోకండి. వైద్యులు చెబుతున్న వాస్తవాలు వింటే భయపడి పోవాల్సిందే. సూర్యుడి కిరణాలకు చిక్కకుండా చాలా మంది తప్పించుకుని తిరుగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా విటమిన్–డి చాలా అవసరం. సూర్య కిరణాల నుంచి సహజంగా లభించే విటమిన్–డికి దూరమైతే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బద్ధకం వీడి ‘ఉదయాన్నే లేవండి.. కాస్తా ఎండన పడండి.. ఆరోగ్యంతో జీవించండి..’ అని వైద్యులు సూచిస్తున్నారు.
సాక్షి, నెల్లూరు(బారకాసు): చుర చురమనే ఎండ అంటే.. అందరికి దడే. ఆ ఎండ కిరణాలు శరీరాన్ని తాకకపోతే కూడా ప్రమాదమేనని వైద్యులు చెబుతున్న విషయాలు వింటే దడ పుడుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందించాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతోంది. ఇందులో విటమిన్–డి చాలా ప్రధానమైనది. డి విటమిన్ శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పని సరి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, లేచాక చదువులు/ఉద్యోగాలకు పరుగులు తీయడం అనివార్యంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పలు సర్వేల్లో అత్యధికంగా భారతీయుల్లోనే విటమిన్–డి కొరత ఏర్పడుతోందని తేలింది.
10 శాతం మందికి విటమిన్ డి లోపం
జిల్లా జనాభాలో 10 శాతం మందికి విటమిన్–డి లోపం ఉందని ఇటీవల పరీక్షల్లో తెలినట్లు వైద్య సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో డి విటమిన్ లోపిస్తున్న వారు అధికమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌ల్లోని జనరల్ ఫిజీషియన్లు, ఆర్థోపెడిక్, న్యూరాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టుల వద్దకు వెళ్లే రోగుల్లో 10 శాతం మంది విటమిన్–డి లోపంతో బాధపడున్నట్లు నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య నానాటికి పెరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఎముకలకు కావాల్సిన కాల్షియంను శోషించడానికి, కండరాలు బలహీనంగా కాకుండా రక్షించడానికి విటమిన్–డి తోడ్పడుతోంది. డి విటమిన్‌ను సూర్యకాంతి ద్వారా సులభంగా లభిస్తుంది. లేకపోతే డాక్టర్ సూచనతో విటమిన్–డి సప్లిమెంట్లు (మాత్రలు) తీసుకోవాల్సి ఉంటుంది.
విటమిన్–డి తక్కువైతే..
శరీరంలో విటమిన్–డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. తరచూగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పని తీరుపైనా తీవ్ర ప్రభావం ఉటుంది. శరీర నిరోధకశక్తి తగ్గుతోంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాకపోవడంతో షుగర్ వస్తుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాతా సహజంగా క్యాల్షియం తగ్గుతుంది. క్యాల్షియం తగ్గితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ.
విటమిన్–డి ప్రయోజనాలు
ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సిఫెరాల్ అనే యాసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారిన పడతారు. ఉదయాన్నే ఎండలో కాసేపు ఉంటే విటమిన్–డి శరీరానికి లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్–డిని తయారు చేసుకుంటాయి. తద్వారా కాలేయం, మూత్ర పిండాల్లో విటమిన్–డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం శరీరం దానిని ఉపయోగించుకుంటుంది. అలా సూర్యకాంతి ద్వారా తయారైన విటమిన్–డి శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తోంది. శరీరకంగా దారుఢ్యంగా ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్–డి తప్పనిసరి. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్–డి అవసరం.
నీడ పట్టు ఉద్యోగం అనుకుంటే..
నీడ పట్టున కూర్చుని పని చేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనార్యోగానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హయిగా నీడన కూర్చుని పని చేసే వారికి విటమిన్–డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్‌కు విటమిన్–డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
ఏమి తినాలంటే...
చేపలు, బీఫ్, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, పాలు, ఛీజ్, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది.
కాసేపు ఎండలో ఉండటం మంచిది
ఎండలో కాసేపు గడపక పోవడం వల్ల విటమిన్–డి లోపం కలుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో నడక చాలా మంచిది. ఈ లోపం ప్రధానంగా 40 ఏళ్లకు పైగా ఉన్న వారిలో కనిపిస్తుంది. పరీక్షల ద్వారా లోపం బయట పడుతుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు.
– డాక్టర్ ఎన్.విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు, జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఆత్మకూరు
క్యాల్షియం లోపం కారణంగా
రక్తంలో విటమిన్–డి ఉంటే ఆహారంలోని క్యాల్షియంను శరీరం తీసుకుంటుంది. అది లోపిస్తే ఎముకలు మెత్తబడుతాయి. ప్రస్తుతం ఎండలో పనిచేసే వారు లేకపోవడంతో విటమిన్–డి లోపిస్తోంది. ఈ లోపం ఉన్న వారు క్యాల్షియం తీసుకోవాలి. తొలి సంధ్య వేళ సూర్యకాంతి తగిలేలా చూడాలి.
– డాక్టర్ మస్తాన్‌బాషా, ఎముకలు, కీళ్లు నరాల ప్రభుత్వ వైద్యుడు, సర్వజన ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment