కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. పదకొండు రోజులుగా ప్రజలు వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు. సమైక్య రాష్ట్రం విడిపోతే భవిష్యత్ ఏమిటనే ఆందోళనతో పలువురు హఠాన్మరణం చెందుతున్నారు. రంజాన్, నాగులచవితి నేపథ్యంలో ఉద్యమానికి విరామం ప్రకటించినా.. ఆవేదనతో పలువురు స్వచ్ఛందంగానే నిరసన తెలియజేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి జేఏసీ నేతృత్వంలో ఆందోళనల తీవ్రరూపం దాల్చనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణను రూపొందించారు.
కర్నూలు నగరంలో మాజీ మండలాధ్యక్షుడు డి.విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలోనూ ర్యాలీ చేపట్టారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నాల్గో రోజు నిరాహారదీక్ష కొనసాగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు, అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళాసమితిలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో కట్టమంచి రెసిడెన్షియల్ స్కూల్‌లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకున్నారు.
16వ తేదీన 80వేల మంది విద్యార్థులతో మహా ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. డీసీసీ, టీడీపీ కార్యాలయాల వద్ద నిరాహారదీక్షలను ఆ పార్టీల కార్యకర్తలు కొనసాగించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కూడలిలో న్యాయవాదులు దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదోనిలో కురువ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప గుడి నుంచి ఎన్‌టీఆర్ విగ్రహం వరకు మోటర్‌సైకిల్, ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. గొరవయ్యలు ఢమరుకం వాయిస్తూ పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. బీమా సర్కిల్‌లో సోనియా దిష్టిబొమ్మ, పాతబస్టాండ్ సర్కిల్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు.
ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో గౌతమ్ మోడల్ స్కూల్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. చిప్పగిరిలో దళిత విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరులో ఉపాధ్యాయుల రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నాయకులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బనగానపల్లెలో జేఏసీ ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు మోటర్‌సైకిల్ ర్యాలీ చేపట్టారు. డోన్‌లో పాల వ్యాపారులు సోనియా దిష్టిబొమ్మను గేదెపై ఊరేగించి పాతబస్టాండ్‌లో దహనం చేశారు. మంత్రాలయంలో సీఎస్‌ఐ చర్చి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మానవహారం నిర్వహించారు.
పత్తికొండలో ఏపీఆర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నుంచి నాలుగు స్తంభాల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జొన్నగిరిలో సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కోడుమూరులో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి దహనం చేశారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ, జేఏసీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
ఇక యుద్ధమే
Published Sun, Aug 11 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
Advertisement
Advertisement