సాక్షి, అమరావతి : అంతులేని ఆనందం.. ప్రతీ పేద వాడి ఇంట్లో పండుగొచ్చిన సంబరం. వైఎస్ జగన్ రాష్ట్రాధినేతగా రాబోతున్న శుభ తరుణాన్ని చూసి యావత్ ఆంధ్రావని పులకిస్తోంది. ‘విన్నాడు.. ఆయన ఉన్నాడు’ అనే భరోసాను నింపుకొంటోంది. వ్యవసాయం ఇక దండగ కాదు.. పండుగే అని రైతన్న, అప్పుల బాధ నుంచి గట్టెక్కుతామని అక్కాచెల్లెమ్మలు, నిరుద్యోగ నైరాశ్యాన్ని పారదోలవచ్చని యువత, ఉన్నత చదువులకు ఇక ఆర్థిక కష్టాలు ఉండవని విద్యార్థులు ఇలా.. ఒకరేమిటి ఏ వర్గం తలుపు తట్టినా వైఎస్ జగన్ విజయం ఈ రాష్ట్రానికి శుభ సంకేతమంటున్నారు.
తమ కష్టాలు పట్టించుకోని వారు, తమ కన్నీళ్లకు కారణమైన వారు అధికారంలో ఉండి వికటాట్టహాసం చేస్తుంటే.. తమ కన్నీళ్లు తుడవడానికి ముందుకొచ్చి, 3,648 కి.మీ పాదయాత్రలో ప్రతి హృదయాన్ని స్పృశించి, నేనున్నానంటూ భరోసానిచ్చిన నేతను గెలిపించుకోవడంతోనే తమ తలరాతలు మారతాయని భావిస్తున్నారు. పాదయాత్రలో ఆయనతో అడుగులో అడుగేసి, ఆత్మీయత పంచి, కష్టాలు చెప్పుకొన్న ప్రతీ వ్యక్తిలోనూ ధైర్యం కన్పిస్తోంది. అధికారంలో అన్న ఉన్నాడని అక్కాచెల్లెమ్మ అనుకుంటుంటే.. మా పెద్ద కొడుకు ఉండగా మాకేంటని అవ్వాతాతలు ధైర్యంగా ఉన్నారు. ఊరూరా కన్పించే ఈ సన్నివేశాల్లో కొన్ని....
కొండంత ధైర్యం
నెల్లూరు జిల్లా కలికిరి మండలం కుడుములదిన్నెపాడుకు చెందిన గడ్డమడుగు గోపాల్, వరమ్మల గుండెకోతను విన్నపుడు వైఎస్ జగన్ చలించిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక.. ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఇంజినీరింగ్ చదివే కొడుకు బలవన్మరణానికి పాల్పడితే.. ఆ తల్లిదండ్రుల పడే బాధ వర్ణనాతీతం. కన్నీళ్ళు ఇంకిపోని కళ్లతో వారు చెప్పిన బాధ విన్న వైఎస్ జగన్ విన్నాను... నేనున్నాను అంటూ పాదయాత్రలో భరోసా ఇచ్చారు. ఇప్పుడు జగన్ అఖండ విజయం చూసి ఆ దంపతుల్లో కొండంత ధైర్యం వచ్చింది. వాళ్లలా ఏ ఒక్కరూ పుత్రశోకం అనుభవించరన్న ఆనంద కన్పిస్తోంది.
ఇప్పుడుబాధ తగ్గింది
పోయిన కొడుకును తీసుకురాలేరు గానీ.. జగన్ సీఎం అయ్యాక ఆ బాధ చాలా వరకూ తగ్గింది. మాలాంటి పేదలకు ఇక కడుపుకోత ఉండదనే ధీమా లభించింది. మాట తప్పని వైఎస్ కుటుంబం మీద లక్షల మంది విద్యార్థులు నమ్మకం పెట్టుకున్నారు. అన్నగా ఉంటాడనే భావిస్తున్నారు. మా బాబు జ్ఞాపకాలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నాయి. అయితే, మా సమస్య విని.. అందరికీ మంచి చేయాలని ఆలోచించిన జగన్ మనసు విశాలమైంది. ఇన్ని బాధలున్నా ఆయన గెలుపు విని పండుగ చేసుకున్నాం.
– గోపాల్, వరమ్మ దంపతులు
అక్కాచెల్లెమ్మల ఆనందం
నిన్నటిదాకా అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక కన్నీళ్లు పెట్టిన అక్కాచెల్లెమ్మలు జననేత విజయాన్ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. బతుకుకు భరోసా దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం వెంకటాపురం ఎస్సీ కాలనీలోని డ్వాక్రా సంఘాల్లో నిరుపేద మహిళలే సభ్యులు. చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ మోసంలో వీళ్ల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అప్పు కట్టమని బ్యాంకులు వెంటపడటమే కాదు.. కోర్టు చుట్టూ తిప్పిన దారుణ పరిస్థితిపై జగన్ పాదయాత్రలో కన్నీటి పర్యంతమయ్యారు. జగన్ గెలపుతో వాళ్లేమంటున్నారంటే....
అండ దొరికింది
ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు అండ దొరికింది. అన్నగా మా నేత మాకు మేలు చేస్తాడు. అప్పుల ఊబిలోంచి బయటపడతాం. మళ్లీ మేం మా కాళ్ల మీద నిలబడతామనే నమ్మకం వచ్చింది. మా కోసం అన్న ఎంతైనా చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా ఉంటాం.
– బారికల అచ్చియ్యమ్మ, వెంకటేశ్వర స్వయం సహాయ సంఘ సభ్యురాలు, వెంకటాపురం
నమ్మకం గెలిచింది
నమ్మకం గెలిచిందన్నా. మాట నిలబెట్టుకుంటాడు జగన్. పాదయాత్రలో మద్యం వల్ల బలయ్యే కుటుంబాల గురించి చెప్పాం. విన్నాడు. నేనున్నానన్నాడు. తప్పకుండా మా వెంటే ఉంటాడు. మద్య నిషేధం అమలు చేస్తాడు. అందుకే జగన్ గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నాం.
– ఆవుల నాగలక్ష్మి, మూడిండపల్లె గ్రామం, దువ్వూరు మండలం.
Comments
Please login to add a commentAdd a comment