మద్ది ఆంజనేయస్వామి, అమ్మవారి ఉపాలయం వద్ద భక్తులు పేర్చిన రాళ్లు
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అంటుంటారు పెద్దలు. జీవితంలో ఈ రెండు ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు కావడంతోనే అలా అంటారేమో. రెండు కోర్కెలు నెరవేరాలని జీవితంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ రెండు కోర్కెలు తీరే పుణ్యక్షేత్రాలు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉండటం విశేషమని భక్తులు చెబుతుంటారు. సొంతింటి కల నెరవేరాలన్నా, పెళ్లి కావాలన్నా ఈ క్షేత్రాలను దర్శిస్తే నెరవేరుతాయన్న నమ్మకం పూర్వం నుంచి వస్తోంది. అందులో ఒకటి జిల్లాలోని ప్రముఖ హనుమద్ క్షేత్రంగా విరాజిల్లుతోన్న గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం, మరొకటి జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం. ఆ వివరాలు ఇలా..
సాక్షి, పశ్చిమగోదావరి : జంగారెడ్డిగూడెం పట్టణంలో రాష్ట్ర రహదారిని ఆనుకుని ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి మెట్లమార్గంలో శ్రీమన్నారాయణ, జగదాంబ అమ్మవారు, వినాయకుడు, నటరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. ఈ దేవతామూర్తుల ఆలయాల ఎదుట భక్తులు రాయి మీద రాయి ఆపై మరో రాయి పేర్చి సొంతింటి కల నెవరవేరాలంటూ మొక్కుకుంటారు. ఈ క్షేత్రంలో రాయి మీదరాయి పెడితే సొంతింటిని నిర్మించుకునే భాగ్యం కలుగుతుందని పూర్వం నుంచి వస్తున్న భక్తుల నమ్మకం.
అంజన్న సన్నిధిలో పెళ్లిళ్ల సందడి
మద్ది ఆంజనేయస్వామి వారి క్షేత్రంలో స్వామివారి చుట్టూ చేసే ప్రదక్షిణలకు ప్రాముఖ్యత ఉంది. పెళ్లి కాని యువతీ, యువకులు ఈ క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేస్తే కోరిక తీరుతుందనే నమ్మకం. శని, ఆది, మంగళవారాల్లో అత్యధికంగా స్వామి వారి ప్రదక్షిణ మండపంలో ప్రదక్షిణలు చేస్తుంటారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఎక్కువగా విష్ణాలయాల్లో అత్యధికంగా వివాహాలు జరుగుతుంటాయి. కానీ పెళ్లిళ్ల సీజన్‌లో మద్ది అంజన్న సన్నిధిలో అధిక సంఖ్యలో వివాహాలు జరిగి అనేక జంటలు ఒకటి కావడం విశేషం.
పూర్వం నుంచి భక్తుల నమ్మకం
రాయి రాయి మీద పెట్టి స్వామి వారిని మొక్కుకుంటే సొంతింటి కల నెరవేరుతుందని భక్తులు నమ్మకం. ఈ సంప్రదాయం పారిజాతగిరిలో పూర్వం నుంచి వస్తోంది. కొల్లేపర చిట్టియ్య అనే భక్తుడు పారిజాతగిరి ఆలయ మెట్ల మార్గంలో దేవాతామూర్తుల విగ్రహ ప్రతిమలను ప్రతిష్ఠించారు. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి రాయి మీద రాయి పేరుస్తుంటారు.
– నల్లూరి రవికుమారాచార్యులు, ప్రధానార్చకులు, పారిజాతగిరి క్షేత్రం
108 ప్రదక్షిణలు చేయాలి
మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. పెళ్లికాని, యువతీ యువకులు, భక్తులు, విద్యార్థులు ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం పూర్వీకులు 27 నక్షత్రాలను గుర్తించారు. ఒకో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 27ని 4 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. రాశులు 12గా విభజించారు. ఒకో రాశికి 9 పాదాలు కేటాయించారు. 12ని 9 పెట్టి గుణిస్తే 108 వస్తుంది. అందుకే 108 ప్రదక్షిణలు చేస్తే గ్రహ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
–వేదాంతం వెంకటాచార్యులు, ప్రధానార్చకులు, మద్దిక్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment