మొక్కవోని దీక్షను చాటాలి: మేకపాటి
వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సమైక్యశంఖారావం సభకు లక్షలాదిగా తరలివస్తున్న ప్రజానీకం రాష్ట్ర సమైక్యత పట్ల తమ మొక్కవోని దీక్షను చాటిచెప్పాలని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం పిలుపునిచ్చారు. సభకు వచ్చేవారందరికీ ఎల్.బి.స్టేడియం లోపల సరిపడా ఏర్పాట్లు లేనందున బయటే ఎక్కువమంది ఉండిపోయే అవకాశం ఉంటుందని, అందువల్ల లోపలికి వెళ్లలేకపోయామే అన్న భావన, బాధ లేకుండా అక్కడే ఉండి.. సభ పూర్తయ్యేం త వరకూ ఓర్పుగా ఉండాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే మహదాశయంతో వస్తున్న లక్షలాదిమంది స్టేడియం లోపల, బయట చివరి వరకూ ఉన్నపుడే మన పోరాటపటిమ ఏమిటో ఢిల్లీకి తె లిసి వస్తుందన్నారు.
భారీగా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకుండా వస్తున్నవారంతా అభినందనీయులని, అదే స్ఫూర్తిని సభ పూర్తయ్యేవరకూ ప్రదర్శించాలని కోరారు. కేంద్రప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్న ఈ తరుణంలో దీన్నొక ప్రతిష్టాత్మకమైన పోరాటంగా భావించి సభా ప్రాంగణం లోపల, బయటా ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే ఉద్యమానికి అంత బలం చేకూరుతుందన్నారు. వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని పార్టీ శ్రేణులు నిలబడాలని మేకపాటి కోరారు.
ఇదీ కార్యక్రమం: మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రసంగాలు ఉంటాయి. వారితోపాటుగా సమైక్య శంఖారావానికి సంఘీభావం తెలపడానికి వచ్చే వివిధ జేఏసీలు, ప్రజాసంఘాల నేతల ఉపన్యాసాలు ఉంటాయి. ఆ తరువాత పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు.