జన్మభూమి రుణం తీర్చుకోవాలి
రాయలసీమ ముఖద్వారంలో జరిగే ఈ స్వాతంత్ర్య వేడుకలకు ప్రాధాన్యం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భవిష్యత్ భారతావని అభివృద్ధికి బాటలు వేయాలని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నదే తన ఆశయమని చెప్పారు. రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లోపించిందని, రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం కాలేదని, అధికారులు ఎక్కడ ఉండాలో నిర్ణయించలేదని, ఎంత ఆదాయం వస్తుందో తెలియదని అన్నారు. తెలుగువారంతా తమ జన్మభూమి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని, సమైక్య ఉద్యమంలో పాల్గొన్నవారిపై కేసులు ఉపసంహరిస్తామని చెప్పారు.
విభజన వల్ల వచ్చిన నష్టాలపై రేపు శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ఈ రోజు సమస్యల సుడిగుండంలో ఉన్నామని, రాబోయే రోజుల్లో సమస్యలన్నీ అధిగమిస్తాని అన్నారు. వ్యవసాయాభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని, ప్రజలకు ఎప్పటికప్పుడు జవాబుదారీతనంతో ఉంటామని హామీ ఇచ్చారు. రూ. 1.50 లక్ష వరకు రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా రైతులకు అండగా ఉంటాని, భవిష్యత్‌లో కరవును అధిగమించడానికి నీరు-చెట్టు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రంలోని పొలాల్లో భూసార పరీక్షలు చేయిస్తామని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని చంద్రబాబు అన్నారు.