మోర్తాడ్, న్యూస్‌లైన్ : ఈ సీజన్‌లో భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ జల కళ సంతరించుకున్నా ప్రజలకు విద్యుత్ కోతల వెతలు తప్పడం లేదు. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో ఈ కోతలేమిటని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో వ్యాపారం ముందుకు సాగడం లేదని పేర్కొంటున్నారు.
మండల కేంద్రాలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు, గ్రామాలలో ఆరు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. దసరా పండుగ సమీపించడంతో మార్కెట్‌కు ప్రజలు తరలివస్తున్నారు. సాధారణంగా పండుగల సమయాల్లో బట్టల దుకాణాలు, ఫుట్‌వేర్ షాపులు, రెడిమెడ్ డ్రెస్సెస్ షాపులు, టైలర్ షాపులు కళకళలాడుతుంటాయి. ప్రస్తుతం విద్యుత్ కోతల వల్ల ఆయా వ్యాపారాలను నిర్వహించే వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. టైలర్ షాపులకు విద్యుత్ సరఫరా తప్పనిసరి. టైలరింగ్ మిషిన్‌లు గతంలో తొక్కుడు పద్ధతిలో నడిచేవి. ప్రస్తుతం మిషిన్‌లకు మోటార్లు వినియోగిస్తున్నారు. మిగతా దుకాణాలకు విద్యుత్ వెలుగులు తప్పనిసరి. కోతల కారణంగా తమ వ్యాపారాలు సాగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. దసరా సందర్భంగానైనా కోతలను ఎత్తివేయాలని కోరుతున్నారు.
వ్యాపారం సాగడం లేదు
రోజు ఆరు గంటల పాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. గిరాకి వచ్చే సమయంలోనే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో వ్యాపారం సాగడం లేదు. కోతల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి.
- సురేశ్, జిరాక్స్ సెంటర్ యజమాని, మోర్తాడ్
సీజన్‌లో ఇలా జరిగితే ఎలా
దసరా సందర్భంగా అందరు షాపింగ్ చేస్తారు. ఇలాంటి సీజన్‌లో విద్యుత్ కోత విధిస్తే ఎలా? అనేక వ్యాపారాలు సాగాలంటే విద్యుత్ సరఫరా తప్పనిసరి. అధికారులు, ప్రభుత్వం పునరాలోచించి విద్యుత్ సరఫరా నిరంతరం జరిగేలా చూడాలి.
- దేవ కుమార్,రెడిమెడ్ డ్రెస్సెస్ షాప్ నిర్వాహకుడు, మోర్తాడ్
కోతలు పూర్తయ్యేంతవరకు ఆగాల్సిందే
వరి కోతలు పూర్తి అయ్యేంతవరకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వరి పంటకు చివరి దశలో నీరు అధికంగా అందించాలి. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. గతంలో కంటే ఇప్పుడు వ్యవసాయానికి విద్యుత్ వినియోగం పెరగడంతో ఇతర అవసరాలకు విద్యుత్ కోతలు విధించాల్సి వస్తోంది.
-శ్రీనివాస్, విద్యుత్ ఏడీఈ, మోర్తాడ్
విద్యుత్ కోతలతో ప్రజల వెతలు
Published Sun, Oct 6 2013 5:36 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement