జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని వార్డు
జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. అన్ని ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. మలేరియా శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకూ 42 డెంగీ కేసులు, మలేరియా 100 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగాల సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ నిమ్మకునీరెత్తినట్లు ఉందనే విమర్శలొస్తున్నాయి.
లబ్బీపేట(విజయవాడ తూర్పు) : విజయవాడతో పాటు, జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తిరువూరు, గుడివాడ, అవనిగడ్డ, మైలవరం, నందిగామ, కైకలూరు, తదితర ప్రాంతాల్లో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మెడిసిన్ వార్డులో రోగులకు పడకలు సైతం చాలని పరిస్థితి నెలకొంది. దీంతో నేలపైనే ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు అవుట్ పేషెంట్స్ విభాగానికి సైతం జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో రెండు నెలలు జ్వరాలు ఇలానే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. రోజురోజుకు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు.
పడకలన్నీ ఫుల్....
ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగంలో 180 పడకలున్నాయి. యూనిట్లు వారీగా ప్రతిరోజు ఒక్కోవార్డులో అడ్మిషన్లు జరుపుతుంటారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో రోగుల సంఖ్య ఎక్కువుగా ఉంటోంది. మెడిసిన్ విభాగాల్లోని పడకలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రోగులకు ఖాళీగా ఉన్న కార్డియాలజీ, డెర్మటాలజీ వంటి వార్డుల్లో సర్దుబాటు చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో సమయంలో రాత్రివేళల్లో అధికంగా రోగులు వస్తే పడకలు ఖాళీ లేక నేలపైనే రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. అలాంటి వారిని ఉదయం 9 గంటల అనంతరం వైద్యులు సర్దుబాటు చేస్తున్నారు.
పెరిగిన అవుట్ పేషెంట్స్....
ప్రభుత్వాస్పత్రిలోని జనరల్ మెడిసిన్ అవుట్ పేషెంట్స్ విభాగానికి సాధారణంగా 150 నుంచి 200 మంది రోగులు నిత్యం చికిత్స కోసం వస్తుంటారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో 350 మందికి పైగా వస్తున్నారు. అవుట్‌పేషెంట్స్ విభాగానికి చికిత్స కోసం వస్తున్న వారిలో అధిక శాతం మంది జ్వర బాధితులే వస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రమాదమే...
వైరల్ జ్వరాలు మధుమేహం, రక్తపోటు, హెచ్‌ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వైరల్ జ్వరాలొస్తే ప్రమాదకరంగా మారే ఆవకావాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వారికంటే అలాంటి వారికి జ్వర ప్రభావం తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉందని సూచిస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే వారిలో సైతం అలాంటి వారే ఎక్కువుగా ఉంటున్నారు.
వైరల్‌లో కూడా డెంగీ లక్షణాలు....
విష జ్వరాల్లో సైతం డెంగీ లక్షణాలు ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, ఆకలి మందగించడం, వాంతులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. డెంగీ వచ్చిన వారికి కూడా ఇవే లక్షణాలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
మెరుగైన సేవలు అందిస్తున్నాం
జ్వరంతో బాధపడుతున్న వారు నగరంతో పాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాం. ఒకవేళ వార్డుల్లో పడకలు చాలకుంటే ఇతర వార్డుల్లో సర్దుబాటు చేస్తున్నారు.డాక్టర్ ఎస్ బాబూలాల్,సూపరింటెండెంట్, ప్రభుత్వాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment